Tuesday 1 September 2015

ప్రాంజలి పభ - Birthdays for the month of 9/2015

ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి పభ 




21 సెప్టెంబర్ అంతర్జాతీయ శాంతి దినోత్సవము (21 Sep International Day of Peace)
ప్రపంచ శాంతియే ఆశయంగా రూపొందిన ఐక్యరాజ్య సమితి తమ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్ నెల మూడవ మంగళవారం నాడు అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1981సం||లో తీర్మానించింది. తదనుగుణంగా 1982వ సం|| సెప్టెంబర్ 21 (మూడవ మంగళవారం) న ప్రపంచ శాంతి దినోత్సవాన్ని “ప్రపంచ శాంతి ప్రజల హక్కు” యనే ధీంతో జరుపుకున్నారు.
కొఫీ అనన్ ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శిగానున్న కాలం‌ 2001లో అంతర్జాతీయ శాంతి సంవత్సరానికి సెప్టెంబర్ 21 వ తేదీని గ్రెగేరియన్ కేలండర్‌కు అనుసంధానించాడు. ఈదినోత్సవం ”అంతర్జాతీయ కాల్పుల విరమణ మరియు అహింసాదినోత్సవ”మంటూ మరింత స్పష్టతనిచ్చాడు. మరుసటిసం|| (2002) నుండి సెప్టెంబర్ 3వ మంగళవారానికి బదులుగా సెప్టెంబర్ 21వతేదీన ఈ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.
శాంతియంటే యుధ్దాలులేని సమాజం మాత్రమేకాదనీ ప్రపంచవ్యాప్తంగా సహన, సౌభ్రాతృత్వాల సమ్మిళిత సాధనయనీ ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
శాంతి మరియు అభివృధ్ధిలను విద్యలో అంతర్భాగంగా బోధించాల్సిన అవసరముందని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాంకీ మూర్ చెబుతూ 21 సెప్టెంబర్‌న 12 గం||లకు ఒక్క నిమిషంపాటు మౌనంపాటించి “శాంతి మరియు అభివృధ్ది”పట్ల తమ ధృడ సంకల్పాన్ని ప్రకటించాలని కోరాడు.
ప్రపంచమంతటా శాంతి విరాజిల్లినప్పుడే ఆర్ధికాభివృధ్దిఫలాలు మానవాళికి చేరుతాయి. అప్పుడే ఆరోగ్యం, విద్యా రంగాల్లోస్థిరమైన ప్రగతి ఉంటుంది.
ఈ సందర్భంగా ఇండియా, పాకిస్తాన్‌ల పరిస్థితులను పోల్చుతూ వివరించవచ్చు. శాంతిని పాటించే భారతదేశం‌నుండి సుందర పిచాయ్, సత్యనాదెళ్ళ వంటియువకులు ప్రపంచ దిగ్గజాలైన వ్యాపార సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. అస్తవ్యస్త విధానలు అనుసరించే పాకిస్తాన్‌నుండి వారి యువత ప్రపంచవ్యాప్తంగా పలు తీవ్రవాద సంస్థలను స్థాపించి అల్లకల్లోలం చేస్తున్నారు.
భారతదేశం‌ అభివృధ్ధిలో అంతరాలు మరొక అంశం. ప్రపంచవ్యాప్తంగా వందమంది సంపన్నుల్లో ముగ్గురు (ముఖేష్అంబానీ- 49 , దిలీప్ సంఘ్వీ- 51, శివ్‌నాడర్- 74) భారతీయులుండగా, 187 దేశాల మానవాభివృధ్ధి సూచికలో 136వ స్థానం‌లో ఉంది (ప్రపంచం‌లోని పేదల్లో మూడోవంతు మంది భారతదేశం‌లోనే ఉన్నారు). భారతదేశం సంపన్నమైనదే కానీ భారతీయులు మాత్రం పేదవారు (India is Rich but Indians are Poor) అనే సామెతకు ఇదొక నిదర్శనం.
ఈ అంశంపై మరోసారి చర్చిద్దాం





ఇది టిక్ చేయండి - ఇది విని మనసుతో ఆలోచించండి 

తెలంగాణా రాష్ట్రం‌లో తొలి నియామక పరీక్షకు హాజరౌతున్న అభ్యర్ధులందరికీ శుభాకాంక్షలు
టీపియస్సీ అభ్యర్ధులు చరిత్రకు సంబంధించిన అంశాల అధ్యయనంపై సూచనలు చేస్తూ చరిత్రపరిశోధకులు డా॥ద్యావనపల్లి సత్యనారాయణ 'నమస్తే తెలంగాణా' దినపత్రికలో రాసిన వ్యాసం జతచేశాను.
భారతీయులుగా మనందరం ప్రపంచ, దేశచరిత్రలనూ, తెలుగు మాట్లాడేవాళ్ళుగా తెలంగాణాతోపాటు ఆంధ్రప్రాంత చరిత్రనుకూడా తెల్సుకోవాలి. ఏప్రాంతంవారు ఆప్రాంత చరిత్రను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రస్తుతం తెలంగాణా పబ్లిక్ సర్వీసు పరీక్షలు రాసేవాళ్ళకు, ఇంకా తెలంగాణా విద్యావంతులకు ఇది మరీ అవసరం.
"ఆయా కాలాల సమకాలీన, సామాజిక పరిస్థితుల పరిమితుల్లో ప్రజలకు చేసిన ప్రయోజనాలకోణం‌లో ఆరాజులనూ, ఆయా రాజరికాలనూ అంచనావేయాలని" ఇ హెచ్ కార్ చరిత్రకారులకు మార్గదర్శనం చేశాడు. ఈ కోణం‌లో శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల చరిత్ర సంపూర్ణంగా లేదు. పలుచోట్ల వాస్తవాలను మరుగునబెట్టి పలువికారాలనూ, వక్రీకరణలను మాత్రమే రాశారు. కాకతీయులు, కుతుబ్‌షాహీల మధ్యకాలపు పద్మనాయక రాజుల చరిత్ర దాదాపు విస్మరించబడింది.
కాకతీయుల చరిత్రను పివి పరబ్రహ్మ శాస్త్రి, ఆచార్య హరిశివకుమార్, ఆచార్య పోలవరపు హైమావతి గార్లు విపులంగా చర్చించారు. త్వరలో పోలవరపు హైమావతిగారి పుస్తకాలు మరికొన్ని రాబోతున్నాయి.
తెలంగాణా చరిత్రలో కాకతీయులది స్వర్ణయుగం. ఆకాలపు ప్రధానాంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం!
అ) పర్వతచరియలతో కూడిన దక్కన్‌పీఠభూమిలో సాగునీటి వ్యవస్థను అభివృధ్ధి చేసి సస్యశ్యామలం చేశారు. ప్రపంచం‌మొత్తం మీద వ్యవస్థీకృతంగా చెరువులు నిర్మించిందీ, వ్యవసాయాన్ని అభివృధ్ధి చేసిందీ కాకతీయులేననడం‌లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇ) స్త్రీశక్తికి ప్రతిరూపమైన రుద్రమాంబ, గణపాంబలతోపాటు మధ్యయుగాల్లోనే బాలికాసాధికారకు బాటలువేసిన గణపతిదేవ చక్రవర్తి విధానాలనూ అధ్యయనం చేయాలి.
ఉ) కాకతీయుల మతసామరస్యవిధానం అద్వితీయమైనది. జైనులు హింసకు గురయ్యారని కొందరు చరిత్రకారులు రాసినప్పటికీ ఆకాలం‌లోకూడా అత్యుత్తమైన జైన సాహిత్యం వెలువడింది. గుర్రాలను విక్రయించే అరబ్బువర్తకుల కోరికమేరకు గణపతిదేవుడు మసీదునిర్మాణానికిసైతం అనుమతించాడు. శివ, విష్ణు, సూర్య దేవుళ్ళతో త్రికూటాలయాలు, మరికొన్నిచోట్ల పంచకూటాలయాలనూ కాకతీయులు నిర్మించారు.
ఎ) "దేశభాషలందు తెలుగు తెలుగు లెస్స" కృష్ణదేవరాయలు కొనియాడడానికి నేపధ్యం కాకతీయులకాలం‌లో జరిగిన భాషా, సాహిత్యాల అభివృధ్ధియే.
ఐ) కాకతీయుల శిల్పంసైతం ప్రత్యేకరీతులను సంతరించుకున్నది. చాయా సోమేశ్వరాలయం (నల్గొండ జిల్లా) లో శివలింగంపై నిరంతర ఛాయ- నీడ, రామప్పదేవాలయం‌ (వరంగల్ జిల్లా) ‌లో సప్తస్వర శిల్పం ద్వారా ఆకాలం‌లోనే కాంతి, ధ్వని శాస్త్రాలపై అధ్యయనం జరిగిందనడానికి నిదర్శనాలుగా చెప్పవచ్చు.
ఒ) నాట్యపరంగానూ, నాట్యశాస్త్ర సాహిత్యపరంగానూ జాయపదేవుని సృత్యరత్నావళి తారాస్థాయికిచెందినదిగా చెప్పవచ్చు.
ఔ) ప్రజలభాషయైన తెలుగు అధికారభాష.
క) ఇన్ని విశిష్టతలున్న కాకతీయులు తమది ఘనమైన సూర్య, చంద్ర వంశాలుగా ఎన్నడూ ప్రకటించుకోలేదు. అది వారి నిరాడంబరతకు నిదర్శనం. నేడు అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మ వర్ణాలవారినీ, ఉత్తరభారతానికి చెందిన కాయస్థులను కొలువులో నియమించుకొని పాలనసాగించారు.
గ) ధృడమైన కేన్ద్రపాలనతో పాటు స్వయం ప్రతిపత్తిగల్గిన సామంతరాజ్యాలతో పరిపాలనా వ్యవస్థ.
చ) గెలికి కయ్యనికిదిగిన యాదవరాజును ఓడించి రాబట్టిన నష్టపరిహారాన్ని యుధ్దభూమిలోనే సైనికులుకు పంచిన వితరణశీలి రుద్రాంబ. ఇది సామ్యవాదానికి మౌలిక రూపంగా చెప్పుకోవచ్చు.
పైవిశిష్టతలన్నింటికీ ప్రాధమిక, ద్వితీయ చారిత్రకాధారాలున్నాయి. మౌఖికాధాలతో తెలుస్తున్న మరికొన్ని విశేషాలు
అ) పరాజితులనుసైతం గౌరవించడం: మేడారం చరిత్ర
ఇ) శ్రామికునికి గౌరవం: రామప్ప దేవాలయం
ఉ) అవినీతిపరులకు మరణశిక్ష: వరంగల్ జిల్లా నర్సంపేట ప్ర్రాంతం‌లోని రంగాయ చెర్వు ఉదంతం.
Again All the Best


18 సెప్టెంబర్ ప్రపంచ వెదురు దినోత్సవము (18 Sep World Bamboo Day)
ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల వెదురులున్నాయి. ఇది గోధుమ, వరి, మక్క మాదిరిగా గడ్డి (Poaceae) జాతికిచెందింది. బొంగుప్రధానంగా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలకు చెందినప్పటికీ సగానికిపైగా వెదురుజాతులు ఆసియాలోనూ అందులోనూ 300 పైగా జాతులుచైనాలోనూ ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులననుసరించి వెదురు పరిమాణాల్లో తేడాలుంటాయి. ఉష్ణమండలప్రాంతాల్లో పొడుగ్గానూ, ఇతర ప్రాంతాల్లో కురచగానూ ఉంటాయి.
అత్యంతశక్తి వంతం: మామూలు చెట్లకంటే వేగంగా పెరగడటం వెదురుకున్న ప్రధాన ప్రయోజనం. వెదురు కాండం బలంగానూ, గట్టిగానూ ఉండటమేకాకుండా తేలికగానూ, వంచడానికి అనువుగానూ ఉంటుంది. వెదురు భవనాల నిర్మాణానికి, పరంజా మరియు అనేక ఇతర అంశాలలో ఉపయోగాలవల్ల అత్యంత ప్రజాదరణ పొందింది. అలాగే, వెదురు లేత రెమ్మలు ఆహారానికికూడా ఉపయోగిస్తారు.
చైనాలో సహజ అడవులు మరియు తోటలలో ఏడు మిలియన్ హెక్టార్ల వెదురు పెరుగుతున్నది. 3 నుండి 5 సంవత్సరాలకాలంలో వెదురుకాడలు లేతగా, మృదువుగా, వంచడానికి అనుకూలంగా ఉన్నప్పుడే పంటను తీసుకుంటారు. చైనా లోని యున్నన్ దక్షిణ ప్రావిన్స్ లో పెరిగే డెండ్రోకాలముస్ సినికస్ అతిపెద్ద జాతికి చెందిన వెదురు, దీని కాండం వ్యాసం 30 సెం.మీ. మరియు 30 మీటర్ల పొడవు ఉంటుంది.
వెదురు ఎత్తుపల్లాల కాండం, నిరంతరం హరితంగా కన్పించే ఆకులు, వెదురు పీఠం అత్యంత మనోహరమైన దృశ్యం. సాధారణంగా వెదురు ఆకారం, రంగు వాటి ఆరోగ్యముతోపాటు భూగర్భ ఖనిజాలు, లవణాలపై ఆధారపడిఉంటుంది. ఈ ప్రభావాలకారణంగా వెదురు ఇంద్ర ధనస్సును మరిపించే రంగుల్లో లభ్యమౌతుంది.
ఆహారంగా కూడా: వెదురు పిలకలు, వెదురు రెమ్మలు, వెదురు బియ్యం‌లతో చైనా, జపాన్, ఆఫ్రికాలలో సాధారణంగా 36 రకాలవంటలు, ప్రత్యేకమైన మరో 20 రకాల వంటలు చేస్తారు.
వెదురు ఆహారంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రయోజనాలు 1) కొలెస్టొరల్ తగ్గించడం 2) రోగనిరోధక శక్తిని పెంచుతుంది 3) బరువును అదుపులో ఉంచుతుంది 4) కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను దూరంచేస్తుంది. 5) రక్త పోటును నివారిస్తుంది. 6) జీర్ణాన్ని వృధ్ధి చేస్తుంది.
వెదురు సాగు: ఐరోపాతోపాటు మంచుఖండాల్లో తప్ప ప్రపంచమతటా వెదురును సాగుచేయవచ్చు. క్రిమి కీటకాలు, పాములలాంటివి చేరకుండా చూసుకోవడమొక ప్రత్యేక జాగరూకత. మర్రిచెట్టు పెరిగినకొద్దీ కొమ్మలనుండి ఊడలను విస్తరించినవిధంగానే వెదురు భూమిలో తన వేళ్ళను విస్తరిస్తూ వనంగా మారుతుంది.
మానవాళికి ఇన్నిప్రయోజనాలిచ్చే వెదురును కల్పవృక్షమంటే అతిశయోక్తి లేదేమో? ప్రస్తుతకాలాల్లో వెదురు ఒక సామాజిక వర్గానికి కులవృత్తిగానూ, జీవన భృతిగానూ మిగిలిపోవడం విచారకరమైనవిషయం.
భిన్నంగానూ, సృజనాత్మకంగానూ ఆలోచిస్తే వెదురుపెంపకం ఒక లాభదాయకమైన ఉపాధిమార్గం. వెదురుసాగును శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రాధమిక (వ్యవసాయ) రంగం, ద్వితీయ రంగం (వ్యాపార, పారిశ్రామిక)రంగాల్లో ఆదాయంపొందటంతోపాటు మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. ఇతర ఏ పంటలకూ అనువుకాని భూములెన్నో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలొ అందుబాటులోనున్నాయి. ప్రభుత్వం అమ్మకంద్వారాగానీ, లీజుద్వారాగాని విద్యావంతులైన యువతకు కేటాయించి, శిక్షణఇస్తే నిరుద్యోగ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది.
మీకు ఓపిక ఉందని తెల్యజేస్తే వెదురు చెప్పే జీవిత సత్యాలను మరో టప్పాలో చర్చిద్దాం!


15 సెప్టెంబర్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవము (15 Sep International Day of Democracy)
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావన ప్రజలు ఎలుగెత్తి కోరుతున్న ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. తనకు తానే ప్రజాస్వామ్యం ఒక హక్కుగా కొనసాగుతుంది,మానవాళి సమగ్రాభివృధ్దికి ప్రజాస్వామ్యమొక్కటే అనివార్యమైన మార్గం.
బాంకీ మూన్ – ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి
ప్రజాస్వామ్యం అంటే నియమితకాలం‌ననుసరించి ప్రజలు పూర్తిస్థాయి ప్రక్రియలో భాగస్వాములై తమ రాజకీయ, ఆర్ధిక, సామాజిక మరియు సాంస్కృతిక వ్యవస్థలనునిర్ణయించుకొనే ఒక స్వేచ్చా ప్రకటన.
ప్రజాస్వామ్యవ్యవస్థలన్నీ కొన్నిసాధారణ లక్షణాలలో ఏకీభవిస్తాయి, ప్రజాస్వామ్య భావనకు ఒక నిర్దిష్ట రూపమంటూ లేదు. సంబంధిత సభ్యదేశాల వినతి మేరకు ఐక్య రాజ్య సమితి వ్యవహార నిబంధనలననుసరించి ఆయాదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికీ యుయన్‌ఓ కృషి చేస్తుంది.
ప్రతీదేశం‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించాలనీ, నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను బలోపేతం చేయాలనీ 2007 సం|| సెప్టెంబర్ 15 తేదీన ఐక్య రాజ్య సమితి తీర్మానించిన సందర్భంగా ప్రతీ సం|| ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా “అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం”ను నిర్వహిస్తారు.
ప్రజాస్వామ్యం వల్లనే పౌర హక్కులు, రాజకీయ హక్కులు పరిరక్షించబడ్తాయి. ప్రజాస్వామ్యానికి సార్వత్రిక ఓటుహక్కు, వంచనలేని ఎన్నికల ప్రక్రియ మూలస్థంభాలు. అప్పుడే ప్రజాస్వామ్యం ప్రభవిస్తుంది, గుభాళిస్తుంది.
సభ్యదేశాలు తమ పౌరులకు, భావిపౌరులకు తమ దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల, ఎన్నికలు, ఓటింగ్ పట్ల గౌరవం పెంచేటట్టుగా అవగాహనా కార్యక్రమాలను రూపొందించాలి.


14 సెప్టెంబర్ హిందీ దివస్ (14 सितम्बर हिंदी दिवस)
मित्र और परिवार‌कू हिंदी दिवसका शुभ कामना
భారత రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 14వ తేదీన్ ఎంపిక చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం ఈ రోజున హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తాము. హిందీభాషను కొన్నిసార్లు ఖర్‌బోలీ, హిందుస్తానీ, హైందవీ భాషలుగానూపిలుస్తారు. ప్రస్తుతం అమలులోనున్న హిందీ భాష 300 సం||ల క్రితం రూపొందిందనీ, హిందీ భాషకు ఉపయోగించే దేవనాగరీ లిపి సమకాలీన లిపులల్లో అత్యంత శాస్త్రీయమైనదిగా భాషావేత్తలు చెబుతారు. హిందీ భారత్‌లో బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో హిందీ అధికార భాష.
హిందీ ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందిన ఇండో- ఆర్యన్ భాష.భారతీయ భాషల్ల్లొకెల్లా హిందీ అత్యంత సజీవభాష. ఇతరభాషలకు చెందిన పదాలను తనలో ఇముడ్చుకుంటుంది. అన్నిభాషల్లోకెల్లా హిందీ నేర్చుకోవడం తేలికయని, పదిరోజులు వరుసగా హిందీ సినిమాలు చూస్తే పదకొండొరోజు హిందీ అలవోకగా మాట్లాడెయవచ్చునని అంటారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు నేపాల్, ఫిజీ, పాకిస్థాన్, ట్రినిడాడ్& టుబాగో, బంగ్లాదేశ్, సింగాపూర్, దక్షిణాఫ్రికా దేశాల్లో హిందీ భాషను అత్యధికంగా మాట్లాడ్తారు. భారతదేశ జనాభాలో 25% జనాభా హిందీని విస్తృతంగా మాట్లాడుతారు.
ప్రపంచ భాషాస్థానాల్లో హిందీ నాల్గవ స్థానం‌లో ఉంది. ఆ వివరాలు చూద్దాం:
అత్యధికులు మాట్లాడె భాష (మిలియన్లలో): చైనీస్ (955)/ స్పానిష్ (405)/ఇంగ్లీష్ (360)/ హిందుస్తానీ (310)
ప్రాదేశిక విస్తృతి (ఎన్ని దేశాల్లో): ఇంగ్లీష్ (101)/ అరబిక్ (60)/ ఫ్రెంచి (51)/ చైనా (33)/ స్పానిష్ (31)/ పర్షియా (29)/ జర్మనీ (18)/ రష్యా (16)6)/ మలేషియా (13)/ పోర్చుగీసు (12)/ ఇటలీ (11)/ టర్కీ (8)/ హిందీ (8)/ తమిళం (6)/ఉర్దూ (6)/తెలుగు (4)
న్యాయవాది జుగల్ కిషోర్ శుక్లా ప్రారంభించిన ‘ఉదాంత్ మార్తాండ’ (ఉదయించే సూర్యుడు)- హిందీలో వెలువడ్డ మొదటి పత్రిక -వారపత్రిక. కలకత్తాలో మే 30 1926న ప్రారంభమైన ఈపత్రిక ప్రభుత్వాదరణ లభించకపోవడంతో సంవత్సరకాలం‌లోనే మూతబడింది. తదుపరి కాలం‌లో జాతీయ బ్హావాలను రేకెత్తించడం‌లో హిందీ ప్రధాన పాత్ర వహించింది.
హిందీ దినోత్సవాన్ని జరుపుకుందాం:
ఈరోజున విద్యాలయాల్లో హిందీలో వ్యాసరచన, వక్తృత్వపోటీలతో పాటు క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. బహుమతులు ప్రదానం చేస్తారు. హిందీయేతర రాష్ట్రాల్లొని కెంద్రప్రభుత్వ కార్యాలల్లో కార్యాలయ సమయం‌లో అందరూ హిందీలోనే మాట్లాడుతారు. జాతీయ బ్యాంకులు, ప్రభువరంగ సంస్థలు, ప్రభుత్వం‌ వివిధ శాఖలలో భాషాసేవ చేసిన ఉద్యోగులకు “రాజభాషా కీర్తి పురస్కార్” , “రాజభాషా గౌరవ్ పురస్కార్” ఆవార్డులను ప్రదానం రాష్ట్రపతి చేస్తారు.
హిందీయేతర ప్రాంతాలకు చెందిన పౌరులు హిందీలో మాట్లాడటం, ఒక జట్టుగా కొంతసమయం ‘అంత్యక్షరి’ ఆడుకోవడంద్వారానూ, తమ పిల్లలకు హిందీ భాష ఆవశ్యకతను వివరించి జాతీయ భాషాభిమానాన్ని చాటాలి.
భాషాఇండియా.కాం నుండి హిందీ డౌన్‌లోడు చేసుకొని మనం కూడా హిందీని అభివృధ్ధి చేసుకుందాం.

   Like
   Comme
మహాకవి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 25 వ వర్ధంతి సందర్భంగా

ప్రదోష కాలములో లయకారుడు శివుడు, పార్వతీ సహితుడై.. ప్రమాద గణాల తో కలసి కైలాసములో తాండవం చేస్తారని మన ఇతిహాసాలు చెబుతాయి.. కానీ మనం మాంస నేత్రాలతో ఎపుడి అది చూసి ఎరుగము. అలతి పొలతి తెలుగు పదాలతో శివతాండవాన్ని మనకళ్ళలో కదలాడునట్టు చేసిన వారు మహాకవి సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. సంగీత సాహిత్యాలు రెండు కలసి మూర్తీభవించిన అద్భుత వ్యక్తిత్వం శ్రీ నారాయణాచార్యుల వారిది. శివ తాండం చదువుతుంటే మన మనసు ఇతరముల వైపు అసలు మల్లదు..వారి కంఠములో వారు స్వయంగా ఆలపించిన శివ తాండవము రేడియో ఆర్కైవ్స్ ఉన్న వారి దగ్గర ఉండే ఉంటుంది. అది వింటే తన్మయులవడం తథ్యం.

వారి కంఠములో రాయల కాలం నాటి విషయాలు వినాలి.. ఆ కథలు వింటే రోమాంచితం అవుతుంది. శ్రీకృష్ణ దేవరాయల వారి గురువు తాతాచార్యులు అనే వైష్ణవ గురువు గారి పేరు మనం అందరం వినే ఉంటాము. వారి వంశస్తులే మన పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. వారు పుట్టి పెరిగింది అనంతపురము అయినా వారి సాహితీ రచనలు అంతా జరిగింది కడప జిల్లాలోనే.. వారి అత్తగారి ఉరు ప్రొద్దుటూరు. వారి విగ్రహం ప్రొద్దుటూరు పట్టణములో నెలకొల్పబడి ఉంది. స్వామీ శివానంద సరస్వతి మరియు కంచి పరమాచార్యులవారికి వీరంటే అమిత ప్రేమాభిమానాలు ఉండేవి.

పుట్టపర్తి వారి తండ్రిగారు మరియు తల్లిగారు కుడా పండితులే. వారి ఇంటిలో ఎన్నో విద్వత్ సభలు చర్చలు జరుగుతుండేవి. చిన్న తనం నుండే వారిలో జ్ఞాన తృష్ణ మొదలయింది.. సంస్కృతం వంటి ఎన్నో భాషలు నేర్చుకున్న బహుభాషా కోవిదుడు శ్రీ పుట్టపర్తివారు. హ్రుషీకేశ్ లో వారి పాండిత్య ప్రతిభ గమనించిన శ్రీ స్వామీ శివానంద వారికి సరస్వతీ పుత్ర బిరుదునిచ్చి గౌరవించారు.. వారికి ఎనలేని సత్కారాలు బిరుదులూ అందినా ఈ ఒక్క బిరుదు మాత్రం ఆయనను సార్థక నామధేయున్ని చేసింది అంటే అతిశయోక్తి కాదు.వారికి చరిత్ర మీద చాలా పట్టు ఉండేది.. వారి మాటలను రేడియో ప్రోగ్రామ్స్ ఆర్కైవ్స్ లో నేను అపుడపుడు వింటాను.. అవి అనిర్వచనీయమైన అనుభూతిని కలుగ జేస్తాయి. చారిత్రకారునిగా ప్రసిద్ది చెందిన శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మ గారు వీరిని రచయితగా కంటే గొప్ప చరిత్రకారునిగా భావించేవారు.. వారు అనేక చారిత్రిక శాసనాల వెనుక ఉన్న అంతర్యం అంతా తెలిసిన వారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారికంటే గొప్పవారు లేరని.. మహాకవి గుఱ్ఱం జాషువా అంతటివారి చేత పొగడ్తలు అందుకున్న మహనీయులు వీరు.

శ్రీ పుట్టపర్తి వారు ఎన్నో కావ్యాలను తెలుగు కన్నడ మలయాళాది భాషలనుండి తర్జుమా చేసారు.. వారు చాలాకాలం ఆంగ్లభాషలో వ్రాయకపోవడానికి ఒక కారణం ఉంది.. తరువాతి కాలములో వారి ఆంగ్లములోని భాగవతాన్ని అనువదించారు. పండ్రెండేళ్ల వయసులోనే ఆంధ్ర కన్నడ రాజ్యం విజయనగర సామ్రాజ్యపు రెండవ రాజధాని అయిన పెనుగొండ గూర్చి పెనుగొండలక్ష్మి అనే గొప్ప కావ్యాన్ని వ్రాసారు.ఎన్నో గొప్ప కావ్యాలను రచించించిన వీరు తప్పక జ్ఞాన పీఠ్ అవార్డు అందుకోవడానికి అన్ని విధాల అర్హులే కానీ ఎందుకో వారికి ఇది రాలేదు.. బహుశా సాహిత్య సరస్వతికితన బిడ్డడిని గౌరవిన్చుకునేందుకు అవకాశం కలుగలేదేమో. వారిని ఎన్ని అన్నా ఊరుకున్నారెమో కానీ వారి పాండిత్య ప్రతిభను ప్రశ్నించి రెచ్చగొడితే మాత్రం భయంకరుడు అన్న పేరు వారికి .. ఆయనకు పదునాలుగు భాషలు వచ్చన్న అహంకారం అన్న వారితో వాదనకు దిగి అహంకారం మీద రెండు గంటలకు పైగా ఉపన్యాసం ఇచ్చి పదునాలుగు భాషలలో కవిత్వం చెప్పి .. నాకు అహంకారం ఉన్దడములో న్యాయం ఉందని సమర్థించుకున్న కవితా సామ్రాట్ శ్రీ నారాయణాచార్యుల వారు. నారాయణాచార్యులు కవిత్వాన్ని పాండిత్యాన్ని ఔపోసన పట్టిన అగస్త్య మహర్షి అనడములో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. వారి గూర్చి వ్రాసుకుంటూ పోతే రోజులు నెలలు చాలవు అంతటి గొప్ప విద్వత్తు ఉన్న మహాకవి.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే శ్రీ పుట్టపర్తి వారి పాండిత్య ప్రతిభ గొప్పతనం ఏమిటో మన అందరికీ తెలుస్తుంది.

పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు

-సి. నారాయణ రెడ్డి

రెండవ శనివారం సెప్టెంబర్ అంతర్జాతీయ ప్రధమ చికిత్స దినోత్సవం (Second Sat Sep International First Aid Day)

ఆకస్మికంగా జబ్బునపడ్డవారికీ, గాయాలు తగిలినవారికీ సత్వర తోడ్పాటునందించడాన్ని
“ప్రధమ చికిత్స” అంటారు. వారి ప్రాణాన్ని కాపాడటం, పరిస్థితి చేదాటిపోకుండా చూడటమే ప్రధమ చికిత్స ప్రధాన లక్ష్యం. అందువల్ల ప్రతీ పౌరునికి ప్రధమచికిత్సపై అవగాహన అవసరం. ప్రధమ చికిత్స నిర్వహించడానికి ఎటువంటి వైద్యవిషయాలపైగానీ, వైద్యపరమైన శిక్షణగానీ అవసరం లేదు. కాకపోతే తాము చేసేదేమిటో తెల్యకపోతే క్షతగాత్రునికి నష్టంజరిగటమేకాక ప్రాణాపాయస్థితిచేరే ప్రమాదముంది.

పూర్తి స్థాయి వైద్యసదుపాయం పొందేవరకు క్షతగాత్రునికి లేదా రోగికీ చేసే ప్రధమ చికిత్స తాత్కాలిక ఆపధ్ధర్మ చికిత్సమాత్రమే. ఇది కీలక సమయాల్లో వృత్తిపరమైన వైద్యం అందేవరకు కేవలం ప్రాణాలను కాపాడుతుంది తప్ప వ్యాధికి చికిత్స కాదు. అత్యధిక సంఘటనల్లో ప్రధమచికిత్సను నిర్వహించాల్సివచ్చేది తోటి పౌరులు లేదా కుటుంబ సభ్యులే. సంఘటనజరిగిన మొదటిపావుగంటలో బాధితునికి అందే ప్రధమ చికిత్సతోనె రాబోయే గంటలో ఏమి జరగనున్నదో తేలుతుంది. అనుక్షణం ప్రమాదాపుటంచుల్లో పయనిస్తున్న పౌరులకు ప్రధమచికిత్స ఆవశ్యకతను గుర్తుచేసేటందుకొరకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రీసెంట్ సంస్థ సెప్టెంబర్ రెండవ శనివారాన్ని “అంతర్జాతీయ ప్రధమ చికిత్సా దినోత్సవాన్ని” నిర్వహిస్తున్నది. ప్రమాదగ్రస్తులు, వ్యాధిగ్రస్తులపట్ల సేవాదృక్పధం, సానుభూతీ ఉన్నప్పటికీ అనేకమంది ప్రధమచికిత్సకు సంబంధించి తగు శిక్షణలేకపోవడంతో చొరవచూపించలేకపోవడం, సకాలం‌లో తగు సహాయంఅందక బాధితులపరిస్థితి మరింతప్రమాదకరంగా మారుతున్నది. ‘ప్రధమచికిత్స’ ను పాఠశాల విద్యతోపాటే పూర్తిస్థాయిలో శిక్షణనివ్వడం సామాజిక అవసరంగా మారిందని ఈసంస్థతో పాటు పలు సామాజిక, స్వచ్చంద కార్యకర్తలు చెబుతున్నారు. రెడ్‌క్రాస్ సంస్థ తమ సోదర సంస్థయైన ‘ సెయింట్ జాన్ అంబులెంస్” ద్వారా ఆసక్తిగలవారికి ప్రధమచికిత్సలో శిక్షణ ఇస్తున్నది.

ఇండో పాక్, ఇండో చైనా యుధ్దాల సమయం‌లో సివిల్ డిఫెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియావారు పౌర రక్షణకొరకు నాడు లోక్ సహాయక్ సేనలను ఏర్పరచి విద్యార్ధులకూ, యువతకూ ఆపత్సమయాల్లో తమతోపాటు తోటివారినికూడా రక్షించుకొనే అంశాలపై శిక్షణగరిపేవారు. ప్రస్తుతం 50-60 సం||లు పైబడ్డవారికి ఈవిషయం గుర్తుండేఉంటుంది.

దేశాలమధ్య నాటి యుధ్ధాలకాలం‌లో గగనతలదాడులను ఊహించే అవకాశం ఉండేది. నేటి జీవనపోరాటం‌లో ప్రమాదాలు ఎక్కడ, ఏ సమయం‌లో, ఏ తీరునజరుగుతాయొ ఊహించడం సాధ్యంకాని పరిస్థితి. అది రోడ్డుప్రమాదం, అగ్నిప్రమాదం, తీవ్రవాద దాడులు, రైలు ప్రమాదం, విమాన ప్రమాదం, ఉప్పెనలు, భూకంపాలు, వరదలు ఏవైనా కావచ్చు. అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి యువతను, విద్యార్ధులనూ సంసిధ్ధులుగా ఉండటానికి శిక్షణ గరిపితే ప్రజానీకం‌లో అవగాహనతో పాటు జాగరూకతకూడా పెరుగుతుంది. నాటి సివిల్ డిఫెన్స్‌ అంశాలతోపాటు ప్రాధమిక చికిత్సను సమ్మిళితంచేసి పాఠశాలవిద్యనుండే ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం ధృఢమౌతుంది.

విద్యావేత్తలు, విద్యాప్రణాలికావేత్తలు, పాఠ్యాంశ నిపుణులు, వైద్యవిద్యాచార్యులు, పోలీసులు, అగ్నిమాపక శాఖవారు సమ్యుక్తంగా కర్రికులం రూపొందించాలి. ప్రభుత్వాలు ఈ దిశగా ప్రయత్నిస్తాయని ఆశిద్దాం.

సంబంధిత చాయాచిత్రాలు అప్‌లోడ్ కావడం‌లేదు.


11 సెప్టెంబర్ వివేకానందుని చికాగో ప్రసంగం (11 Sep Vivekananda’s Chicago speech at World's Parliament of Religions 1893)

ప్రపంచం‌లోనే మొదటి సమ్మేళనమైన ‘వల్డ్ కొలంబియన్ ఎక్స్‌‌పొజిషన్‌కు’ చికాగో నగరం 1893లో ఆతిధ్యమిచ్చింది. కాంగ్రేస్ ఆఫ్ పార్లమెంట్స్ పేరుతో ‘మావవపరిణామ శాస్త్రం, కార్మిక, వైద్య, టెంపరాంస్‌గా పిలువబడ్డ మధ్యపాన నిషేధం, వ్యాపార, ఆర్ధిక, చరిత్ర, కళలు, తత్త్వం, సైన్సు శాస్త్రాలతోపాటు అమెరికాకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు స్వీడెన్ బోర్జియన్, చార్లెస్ బానీల చొరవతో మతాల సమ్మేళనం కూడా జరిగింది. ప్రపంచ మతాల సమావేశానికి హెన్రీ బారొస్ అనే మరో న్యాయమూర్తి అధ్యక్షుడుగా వ్యవహరించాడు.

ఈ సమ్మేళనానికి భారత్‌ప్రతినిధిగా స్వామి వివేకానంద పాల్గొన్నారు. “అమెరికా సోదర సోదరీ మణులారా” అని ప్రారంభించిన వివేకానందుడు విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి మట్లాడినాడు. మనదేశం‌లో “ బావిలోకప్ప కధని” ఉటంకిస్తూ ఇతర మతాల గురించి తెల్సుకోకుండా ఎవరికివారు తమను తాము గొప్పగాభావించుకొంటూపోతే సమగ్రత ఎన్నడూ రాదనీ, ఇతరమతాలగురించి తెల్సుకున్నప్పుడే సార్వజనీనత అనుభవమౌతుందని అన్నాడు. “ప్రపంచమతాల సమ్మేళన సభ” నిర్వహించి ఈ దిశగా కృషిచేసిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపాడు.

“అమెరికాసోదర సోదరీ మణులారా!” అంటూ ప్రారంభించిన తొలినాటి (సెప్టెంబర్ 11 1893) ఉపన్యాసం ప్రస్తుత కాలానికిసైతం ఉత్తేజకరంగా నిలుస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతీవారసత్వాలను ప్రస్తుత కాలాలకు అన్వయించాడు. వేదాంతతత్త్వం వివరించడంద్వారా అమెరికన్ల‌లో ఆధ్యాత్మిక స్ఫృహను మేల్కొల్పినాడు. వివేకానందుని ప్రభావంతోనే అమెరికా, ఇంగ్లాండులలో ‘వేదాంత సమాజాలు’నెలకొల్పబడ్డాయి. వాటితోనే యోగాకూడా పశ్చిమదేశాలకు పరిచయమైంది. పశ్చిమదేశాలలో 1893 నుండి నాలుగు సం|| ల వివేకానందుని పర్యటనతో హిందూమతం ప్రపంచ ప్రపంచ ప్రధాన విశ్వాసాల (మతాల) స్రవంతిలో ప్రధానమైనదిగా గుర్తించబడింది. రొమేన్ రోనాల్డ్ (సాహిత్యనోబెల్ గ్రహీత 1915) భారతదేశం గురించి తెల్సుకోవాలని టాగోర్‌ను అడిగితే “వివేకానందుడి సాహిత్యం చదివితె సమగ్రంగా తెలుస్తుంది. ప్రపంచం‌నుండి నిరాశావాదాన్ని పారదోలవచ్చని మీరు గ్రహిస్తారు” అని చెప్పాడు.

మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, ఆచరణలను అభివృధ్ధి చేసినప్పుడే మానవునికి పరిపూర్ణత సిధ్ధిస్తుందనే వివేకానందుని సూక్తి నేటికీ ఆదర్శం, ఆచరణీయం. మనసా, వాచా, కర్మణామనందరం పాటించాల్సిన జీవన విధానం.

 11 సెప్టెంబర్ జాతీయ ఆటవీ అమరుల సంస్మరణ దినం (11 Sep National Forest Martyrs Commemoration Day)
దొంగరవాణాదారులనుండి ఆటవీ ఉత్పత్తులనూ, వేటగాళ్ళనుండి జంతువులనూ రక్షించడం‌లో ఆటవీ సిబ్బంది చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది. పూర్వకాలం‌లో ఒక సామాజికవర్గంవారు వృత్తివిధులకువెళ్తూ భార్యమెడనుండి మంగళసూత్రాలు తీసుకెళ్ళి, తిరిగి ఇంటికివచ్చినప్పుడు మెడలోవేసేవారట. ప్రస్తుతకాలం‌లో ఆటవీ సిబ్బందిది ఇదే పరిస్థితి. భారతదేశపు అడవులన్నీ అమూల్యమైన ప్రకృతి వరప్రసాదితమైన కలప, వనమూలికలు, వన్యప్రాణులతో నిండిఉండేవి. ఆదిమ, ఆటవీ జాతులవారు ప్రకృతితో సహజీవనం చేసెవారు. కాలక్రమేణా ఆటవీవనరులు కొందరికి జీవనభృతిగా మారితే, అధికారం‌లో ఉన్నవారికి అక్రమ సంపాదనకూ, ఆదాయానికీ వనరులయ్యాయి. ప్రస్తుతకాలం‌లో ఇది వ్యవస్థీకృతమైంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం‌లో ప్రజాప్రతినిధి నిర్వహిస్తున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుపడిన ఒక మహిళాధికారిని ప్రభుత్వం మందలించి బదిలీ చేసింది.
తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని సత్యమంగళం అడవుల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎర్రచందనం, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ స్థానిక ఆటవీవాసుల అమాయకత్వాన్ని ఆసరాచేసుకొని అడవిని ధ్వసం చేశాడు. పలువురు ఆటవీశాఖాధికారులను నయాన,భయాన తన మార్గం‌లోకి తెచ్చుకొని అడ్డూ, అదుపూ లేకుండా తన దొంగవ్యాపారాన్ని కొనసాగించాడు. వీరప్పన్ కోసం ప్రత్యెకంగా నియమించబడ్డ భారత ఆటవీ సర్వీసు అధికారి పందిళ్ల శ్రీనివాస్‌కు ‘జిందా యా ముర్దా’ గా పట్టుకోవాలనీ అవసరమైతే షూట్ ఎట్ సైట్ అనుమతికూడా మంజూరు చేసింది. శ్రీనివాస్ మాత్రం వీరప్పన్‌ను అదుపులోకి తీసుకొని అతనిలో పరివర్తన తేవాలని ఆశించాడు. గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగినప్పుడే వారు వీరప్పన్‌కు దూరమౌతారని భావించిన శ్రీనివాస్, వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాధలో నివాసమేర్పరచుకొని పలు అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు. వీరప్పన్ అనుచరులను, అనుయాయులను ఒక్కొక్కరిని సాధారణ పౌరజీవనం‌లోని మరల్చాడు. అతని కుటుంబసభ్యులతో మానవీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. వీరప్పన్ కు లొంగిపోవడంతప్ప మరేమార్గమూలేని పరిస్థితికల్పించాడు.
శ్రీనివాస్ నిరాయుధుగావస్తే తాను లొంగిపోవడానికి సిధ్ధమేనంటూ వీరప్పన్ తన
తమ్ముడితో కబురుపెట్టాడు. నిరాయుధుడుగా శ్రీనివాస్ 9 నవంబర్ 1991 వతేదీన వీరప్పన్‌ను కలవడానికి వెళ్ళాడు. మరుసటిరోజు తుపాకీ కాల్పులు,శిరచ్చేదనంతో 10 నవంబర్‌న శ్రీనివాస్ శవం సత్యమంగళం అడవుల్లోని అరకాహళ్ళ ప్రాంతం‌లో పడిఉంది. తదుపరి కొంతకాలానికి వీరప్పన్ ఎదురుకాల్పుల్లో చనిపోవడం జరిగింది.
ప్రకృతి, వన్యప్రాణుల సం‌రక్షణా ధర్మం‌లో అసువులుబాసిన అడవి అమరులకు నివాళిగా నవంబర్ 10వ తేదీన “ఆటవీ అమరుల సంస్మరణ దినం” దేశవ్యాప్తంగా నిర్వహించేవారు.
ఆటవీ అమరుల సంస్మరణ దినం సెప్టెంబర్ 11వ తేదీకి మారిన నేపధ్యం:
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ రాజు (18వ శతాబ్దం) ఖెజార్లీ ప్రాంతం‌లో కలపను తీసుకురావల్సిందిగా తన భటులను పంపుతాడు. ఖెజార్లీ ప్రాంతపు బిష్ణోయ్ తెగకు చెందిన గిరిజనులు చెట్ల నరికివేతను అడ్డగించగా 11 సెప్టెంబర్ (1730 సం||)న జోధ్‌పూర్ రాజు సైన్యం 360 మంది గిరిజనులను ఊచకోతకోసింది. వనసంరక్షణకోసం రాజ్యహింసలో అసువులుబాసిన గిరిజనుల సంస్మరణార్ధం భారత ప్రభుత్వం “ఆటవీ అమరుల సంస్మరణ దినం”ను 2013 సం||నుండి సెప్టెంబర్ 11 వతేదీన నిర్వహించాలని భారత ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు సూచించింది. (సినీనటుడు సల్మాన్ ఖాన్ తన బృమ్దంతో రాజస్థాన్‌లో వేటకు వెళ్ళినప్పుడు బిష్ణోయ్ తెగవారే వారిని నిలువరించిన విషయం పలువురికి గుర్తుండేఉంటుంది)
మన మనుగడకోసం జీవవైవిధ్యం అవసరం. ఆటవీ ప్రాణులకుకూడా హుందాగా జీవించే హక్కు ఉంది. ఆటవీ ప్రాణులకు హానిచెసినా, అడవులను నరికివేసినా, వీటిని అక్రమ రవాణా చేసినా కఠినమైనశిక్షలుంటాయి.
ప్రకృతి, వన్యప్రాణి సం‌రక్షణలో అదృశ్యమైనవారికీ, అమరులైనవారికీ నివాళులర్పించడం మన కనీసబాధ్యత.
శ్రీనివాస్ చిత్రపఠంతో తల్లిదండ్రులు, కీర్తిచక్ర శ్రీనివాస్, హైద్రాబాద్ జూ పార్కులో శ్రీనివాస్ స్మారక స్థూపం



8 సెప్టెంబరు జాతీయ నేత్రదాన దినోత్సవం (8 Sep National Eye Donation Day)
నేత్రదానం ఎందుకు?

నేత్రదానం నిజంగా స్వార్ధంపూరితమైంది. మన మరణానంతరం మనకళ్ళు మరో ఇద్దరికి అమర్చటంద్వారా మనమీ ప్రపంచాన్ని చూడటం కొనసాగించవచ్చు. అన్నిదానాల్లోకల్లా నేత్రదానం మిన్న. ప్రస్తుతం దేశం‌లో ఒకకోటీ యాభై లక్షలమంది అంధులున్నారని అంచనా. ఇప్పటివరకు జరుగుతున్ననేత్రదానాలసంఖ్య కేవలం 22000 మాత్రమే.
మరికొంతమంది “అంగవైకల్యం,అంధత్వం గలవారిని దేవుడు తనవద్దకు అనుమతిస్తాడా?” అడుగుతుంటారు. “అవయవ దాతలకు మాత్రమే ఎటువంటి ఆటంకం‌లేకుండా స్వర్గ ప్రవేశం సాధ్యమౌతుందని” పలు మతాలకు చెందిన ప్రవచనకారులు చెబుతున్నారు.
ఎటువంటివారుదానం చేయవచ్చు
• ఒక సంవత్సరం నుండి ఏవయసువారైనా దానం చేయవచ్చు. రక్తపోటు, చక్కెరవ్యాది, ఆస్థ్మా, క్షయ వ్యాధిగ్రస్తులు, కళ్ళజోడు వాడేవారూ, కేటరాక్టు చికిత్స చేయించుకున్నవారుకూడా దాతలు కావచ్చు. వైద్యులు అన్నిరకాల పరీక్షలునిర్వహించిన తదుపరిమాత్రమే నేత్రాలను అమరుస్తారు.

ఎటువంటి నేత్రదానాలు నిరుపయోగం?
• మరణానికి కారణం తెలియనివి, రేబీస్, సిఫిలీస్, హెపాటిటస్ అంటువ్యాధిగలవారు, సెప్టికేమియా (రక్తం‌లో విషపదార్ధాలున్నవారు), ఏయిడ్స్ వ్యాధిగ్రస్తులు, కంటి వ్యాధులున్నవారివి.
నేత్రదాన విధానం:
మరణానికి పూర్వం దాత సమ్మతించాలి. లేకపోతే మరణానంతరం అత్యంత సమీపబంధువు లిఖితపూర్వక సమ్మతితోనే నేత్రదానం జరుగుతుంది. సమీపం‌లో గల నేత్రదాన కెంద్రానికి సమాచారంతోపాటు ఖచ్చితమైన చిరునామానూ, సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు ఇచ్చి పాటించవలసిన జాగ్రత్తలు:
- మరణించినవారి కనురెప్పలు మూసేయాలి
- మెత్తటి దూదిని మంచుగడ్డలకుచుట్టి కళ్ళపై ఉంచాలి. ఇందువల్ల చర్మకణాలు ఎండిపోకుండా తాజాగా ఉంటాయి.
- తలకింద తలగడ ఉంచాలి
- ఫ్యాన్ ఆర్పేయాలి.
- వైద్యుడు జారీచేసిన మరణ ధృవీకరణపత్రం ఉండటం మంచిది

దానంచేయబడ్డ కళ్లనుండి కోర్నియా భాగాన్ని అంధులకు అమర్చటంద్వారా మరో ఇద్దరు ప్రపంచాన్ని చూస్తారు. ఇతర భాగాలు వైద్యవిద్యార్ధుల శిక్షణకూ, పరిశోధనకోసం ఉపయోగిస్తారు. “మానవ అవయాల దాన చట్టం 1994” ననుసరించి నేత్రదాన కెంద్రాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యాపారానికి పాల్పడవు. ఈ ఇరవై సంవత్సరాలకాలం‌లో దుర్వినియోగం జరిగినట్టుగా ఒక్క కేసుకూడా నమోదుకాలేదు.

రాష్ట్ర దేశానికి చెందిన ప్రముఖులెందరో తమ నేత్రదానానికి సమ్మతించారు. మనం కూడా
• నేత్రదానంకోసం ప్రతిన చేద్దాం
• మన కుటుంబ సభ్యులనూ, మిత్రులనూ నేత్రదానంపై చైతన్యపరుద్దాం
• మనదృష్టికి వచ్చిన ఆకస్మిక మరణాల సందర్భం‌లో మృతుడి నేత్రదానం గురించి అతని కుటుంబ సభ్యులనూ, బంధువులనూ ప్రోత్సహిద్దాం
• ఈ టప్పాను మన మిత్రులకు పంచి వారిని నేత్రదానం గురించి ఆలోచింపజేద్దాం.
రంగారెడ్డి జిల్లా దేవుని ఎర్రవెల్లి సర్పంచ్ ఆధ్వర్‌ంంలో గ్రామప్రజలందరూ గతసంవత్సరం సామూహికంగా నేత్రదాన సమ్మతిపత్రాలను వైద్యులకు అందజేశారు. వారి స్ఫూర్తిని మనందరం అభినందించాలి. ఆచరించాలి


3 సెప్టెంబర్ సర్దార్ జమలాపురం కేశవరారు జయంతి (3 Sep BA Jamalapuram Keshava Rao)

తిన్నామా?పడుకున్నామా? తెల్లారిందా? ఒక తెలుగుసినిమాలో పోలీసు అధికారి పత్రికావిలేకరులనుద్దేశించి అన్నప్పటికీ నేటి సమాజికపరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం అవకాశమున్న ప్రతివారు సమాజంకోసం ఆలోచించేవారు. సామాజికాభ్యున్నతిమి కృషిచేశారు. ఆకోవకు చెందినవారు సర్దార్ జమలాపురం కేశవరావు. ఆయన సేవాతత్పరతతోనే ప్రజలు “సర్దార్” గా పిలుచుకున్నారు. నాటి హైద్రాబాద్ రాష్ట్ర కాంగ్రేస్ కమిటీకి తొలి అధ్యక్షుడిగా సేవలందించారు.

1908 సెప్టెంబర్ 3న నిజాం సంస్థానంలో తూర్పు భాగాన వుండే ఖమ్మం(నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మ దంపతులకు వీరు తొలి సంతానం. వీరిది సుసంపన్నమైన జమీందారీ వంశం. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు.

నిజాం పరిపాలనాకాలంలోని వెట్టిచాకారి, కష్టాలగురించి మనందరికీ తెలుసు. భూస్వామ్య వర్గాలు వెట్టిచాకిరీని తమ హక్కుగా భావించేవారు. వెట్టిచాకిరీ నిర్వర్తించకపోతే దారుణంగా హింసించేవారు వారి గురించి జాలిపడేవారు తక్కువ.. వారి పరిస్థితులకు కేశవరావు చలించిపోయారు. వారిపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు, నిజాం నిరంకుశ పాలనానుంచి విముక్తించేయడంకోసం కేశవరావు తెలంగాణజిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించారు. ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు.

1930లో విజయవాడసభలో కేశవరావుకు గాంధీతోపరిచయమైంది. గాంధీఉపన్యాసాలకు ఉత్తేజితుడై గాంధేయవాదిగా సిద్ధాంతాలను ఆచరించేవారు. ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయోద్యమాన్ని కేశవరావు తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించారు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో ఈయన ముందుండేవారు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవారు. 1938లో ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో ఈయన ప్రముఖపాత్ర నిర్వహించారు. గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా 18 నెలల కఠినకారాగారశిక్ష అనుభవించారు. 1942లో ‘క్విట్ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలోవిస్తృతంగా ప్రచారం చేశారు.

1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్రమహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్ర హం బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండేళ్ల కారాగార శిక్ష విధించింది. నిజాం సంస్థానం దేశంలో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇలా అలుపెరుగని నాయకుడిగా ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు సాగిన కేశవరావు. 45 ఏళ్ల ప్రాయంలోనే 1953 మార్చి 29న తుదిశ్వాస విడిచారు.
కేశవరావుపై వి6 టీవీ చానెల్ రూపొందించిన వీడియో చూద్దాం
https://www.youtube.com/watch?v=Ay-_bjWxq0g
Telangana Hero - Jamalapuram Keshava Rao
Visit our Website : http://V6news.tv/ Twitter : https://twitter.com/#!/V6News Facebook : http://www....

2 సెప్టెంబర్ (1947) పరకాల మారణకాండ (2 Sep Parakala (Warangal Dist) Massacre)
తెలంగాణా పోరాట కాలం‌లో వరంగల్ జిల్లా (నాడు కరీం‌నగర్ జిల్లా) పరకాలదొక ప్రత్యేకత. తెలంగాణాలోని ఇతర ప్రాంతాలమాదిరిగా కాకుండాఆర్యసమాజ్ కార్యకర్తలు, సోషలిస్టు భావాలు కలవారు, కాంగ్రేసు, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఉద్యమించారు. సెప్టెంబరు 17, 1948 తర్వాత ఇతర ప్రాంతాల్లోలాగా కమ్యూనిస్టులు తమ పోరాటాన్ని కొనసాగించలేదు. ఈ ప్రత్యేకతను రావి నారాయణరెడ్డి తన అనుభవాల్లో నమోదు చేశారు.
స్వాతంత్ర్యానంతరం నిజాం తానెవరికీ సామంతుడను కానని ప్రకటించుకున్నాడు. తన రాజ్యం‌లో తన్ జండాకుతప్ప మరే జండాలకూ స్థానం‌లేదనీ, ఎటువంటి జండా పండుగలు జరుపవద్దనీ, ఈ ఆదేశాలు ఉల్లంఘించినవారికి మరణ శిక్ష వరకు ఎటువంటి శిక్షనైనా అమలుపరుస్తామని ప్రకటించాడు.
ఇటువంటి బెదిరింపులకు వెరువకుండా సెప్టెంబర్ 2 (1947) వతేదీన పరకాలలో మూడురంగుల జండా ఎగురవేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. సుమారు 25 గ్రామాలనుండి రెండువేలకుపైగా ప్రజలు పరకాల చేరుకున్నారు. పరకాల మెజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావు కాల్పులకు ఆదేశాలిచ్చాడు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా అమీన్ జియాఉల్లా పిస్తోలు పేల్చాడు. వెనువెంటనె నిజాం పోలీసులు, రజాకార్ మూకలు, రౌడీలు తమకు చిత్తంవచ్చినట్టుగా ప్రజలపై దాడిచేశారు. అందినవారిని అందినట్టు కత్తికోకండగా నరికారు. అందినకాడికి దోచుకున్నారు. చూస్తుండగానే ఆప్రదేశమంతా పీనుగులపెంటగా మారింది. ఈ దాడిలో 21మంది చనిపోయినట్టుగా నమోదు చేయబడ్డా సమీపంసమీపం‌లోని పాడుబడ్డబావిలో దొరికిన శవాలను బట్టి, ప్రత్యక్షసాక్షులకధనం ప్రకారం 50మంది వరకు చనిపోయారని అంచనా. వెంటనే నిజాం మిలిటరీ దళాలు చేరుకొని ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. తదుపరి ప్రభుత్వం జరిపించిన మేజిస్టేరియల్ విచారణ ఆ ఘటనకెవరూ బాధ్యులు కారని తేల్చింది.
బొంబాయిలోని కాంగ్రేస్ హౌజ్ నిజాం దురాగతాన్ని ఖండిస్తూ బులెటిన విడుదల చేసింది. భారతప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని నిజాం ఉల్లంఘించాడనీ, ప్రజలు వెనుదిరిగివెళ్ళడానికి అవకాశమీయకుండా నిరాయుధులపై దాడిచేయించడం ఘాతకమనీ, ఈ ఘటనలో అరెస్టుచేసిన 150 మందిలో ఒక్కరంటేఒక్క ముస్లిం కూడా లేడనీ” ప్రకటించింది.
నాటి పార్లమెంటు సభ్యుడూ,నేటి మహారాష్ట్ర గవర్నర్‌యైన చెన్నమనేని విద్యాసాగర్ రావు తమ తల్లి చెన్నమనేని చంద్రమ్మ గారి స్మారకంగా నాటి ఘటనా స్థలం‌లోనే ‘అమరధామ’మనే స్మారకమందిరాన్ని నిర్మించారు.
ఆనాటి మారణకాండలో అమరులైనవారికి నివాళులర్పించడం మన కనీసవిధి. ఈ పోరాటస్ఫూర్తిని కొనసాగించాడానికి విద్యాసాగర్ రావుగారి వితరణశీలత్వానికి తెలంగాణా ప్రజల ధన్యవాదాలు.
ఈ ఘటనపై టీవీ 99 వారు రూపొందించిన వీడియొ చూద్దాం.https://www.youtube.com/watch?v=rtOAd2sjFjc
Parkal massacre mark in build a memorial to Commemorate the Incident - 99tv
►Subscribe to 99tv Telugu: https://www.youtube.com/99tvtelugu ►Like us on Facebook: https://www.face...


1 సెప్టెంబరు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ ప్రారంభం (1 Sep Sri Krishandevaraya Andhra Bhasha Nilayam)

ప్రజల భాషకోసం పోరాడిన గిడుగు రామ్మూర్తి జయంతిని (29 ఆగస్టు)ని ‘తెలుగు భాషా
దినోత్సవం’ గా జరుపుకుంటారు. నాడు కోస్తాప్రాంతం‌లో దైనందిన వ్యవహరాలతోపాటు విద్యాబోధనలో పండితులభాషకాకుండా పామరుల భాష కావాలని గిడుగు జీవితకాలం పోరాటంచేశాడు. అమ్మ భాష అంటే అమృతం, అందరికీ అది చెందాలనేదే గిడుగు పోరాటం.

పరభాషా పదఘట్టనలకింద నలిగిపోకుండా తల్లిభాష ఉనికిని కాపాడుకోవాలనేది నాటినైజాంలోని తెలుగువారి ఆరాటం. బంకించంద్రుని వందేమాతరగీతం స్ఫూర్తితో భాషలేవైనా ఆసేతుహిమాచలంలోని పౌరులందరూ భారతీయులేననీ, సమిష్టి ప్రజాపోరాటాలద్వారానే భారతస్వాతంత్ర్యం సాకారమౌతుందని విశ్వసించారు.

భాషనూ,భావస్వేచ్చనూ కోల్పోతున్న తెలంగాణాప్రజానీకంలో చైతన్యం కల్గించాలంటే విద్యావ్యాప్తితోపాటు భావవ్యాప్తి అవసరమని భావించిన నాటి విద్యావంతులు తొలుత పఠనాలయాలు, గ్రంధాలయాల స్థాపనకు పూనుకున్నారు. ప్రస్తుత చారిత్రకాధారాల ప్రకారం నిజాం రాష్ట్రం‌లో తొలి గ్రంధాలయాన్ని సోమసుందరం ముదలియార్ (1872) సికింద్రాబాద్‌లో ప్రారంభించాడు. ముదిగొండ శంకరాధ్యులు (1872) కవాడీగూడాలో శంకరానంద గ్రంధాలయం, సికింద్రాబాద్‌లో ‘ సార్వజనిక గ్రంధాలయం’,1908లో వరంగల్లో ‘ శబ్ద్దనుశాసన గ్రంధాలయం”, ఇంకా అక్కడక్కడా మరొక 10 గ్రంధాలయాలకుపైగా స్థాపించబడినప్పటికీ పలుకారణాలతో ఎక్కువకాలం కొనసాగలేదు. 1880 నుండి నడుస్తున్న పౌరగ్రంధాలయాన్నొకదాన్ని స్వాధీనం చేసుకొని "ఆసిఫియా స్టేట్ లైబ్రరీ"గా నిజాం ప్రభుత్వం పేరుమార్చింది. ఇప్పుడది అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ లైబ్రరీ.

మలితెలంగాణా ఉద్యమానికి ప్రసార, సామాజిక మాధ్యమాల కృషిచేసిన తీరుననే నాటి తెలంగాణా పోరాటానికి గ్రంధాలయాలు వేదికలయ్యాయి. అందువల్లనే సురవరం ప్రతాపరెడ్డి “ గ్రంధాలయోద్యమమే తొలి తెలంగాణాఉద్యమం” గావర్ణించాడు.

హైద్రాబాద్‌కు చెందిన విద్యావంతులు మన్సబ్దార్ రావిచెట్టు రంగారావు, కొమర్రజు లక్ష్మణ రావు, మునగాల రాజా నాయిని వెంకటరంగారావు గారలు రాబర్ట్ సూవెల్ విరచిత “The Forgotten Empire”- విజయనగర సామ్రాజ్యం (ఎమెస్కోవారి తెలుగు అనువాదం ‘విస్మృత సామ్రాజ్యం’) చదివి నాటితెలుగు భాషాప్రాభవానికి సంతసిస్తూ తెలుగుభాషా పునర్వైభవంకోసం కృష్ణదేవరాయలస్ఫూర్తితో కృషిచేయాలని నిశ్చయించుకున్నారు.

హైద్రాబాద్‌, రాంకోఠిలోని రావిచెట్టు రంగారావు స్వగృహం‌లో ది 1 సెప్టెంబరు 1901 సాయంకాలం మరికొందరు తెలుగుభాషాభిమానులు కొఠారు వెంకట్రామ నాయుడు, మునగాల రాజా,ఆదిపూడి సోమనాధ రావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా|| ఆర్ మాధవరావు, ఆదిరాజు వీరభద్రరావు, పాల్వంచ సంస్థానాధీశుడైన మహబూబ్ సర్ఫరాజ్ పార్ధసారధి అప్పారావు అధ్యక్షతన సమావేశమై అక్కడే “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాని"కి ప్ర్రారంబ్హోత్సవం చేశారు. ఆ సంస్థకు రంగారావుగారు వ్యవస్థాపక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
రావిచెట్టు రంగారావు గారి ఇంట్లో పది ఏళ్లపాటు కొనసాగిన గ్రంధాలయం ఆయన ఆకస్మిక మరణానంతరం అద్దె ఇంట్లోకి మార్చబడింది. ఆయన ధర్మపత్నిరావిచెట్టు లక్ష్మీనరసమ్మ గారిచ్చిన రూ 3000 విరాళంతో ప్రస్తుతపు సుల్తాన్‌ బజార్‌లోని ఇంటిని ఖరీదుచేశారు. మునగాల రాజా రూ 1250, పాల్వంచ సంస్థానాధీశులు పార్ధసారధి స్మారకనిది నుండి రూ 750 విరాళంగా నాటి కార్యదర్శి మాడపాటి హన్మంతరావు గారు 1915లో సొంత భవనాన్ని నిర్మించారు.

నిజాం కాలం‌లో జాతీయ, స్వేచ్చా, భాషోద్యమాలకు శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం పురిటి గడ్డగా నిలచింది. గుర్రం జాషువా, చిలకమర్తి, పానుగంటివారు, దేశోధ్దారక కాశీనాధుని నాగేశ్వర్ రావు, సరోజినీనాయుడు, టంగుటురి ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు, విశ్వనాధ, శ్రీశ్రీ వంటి ఉద్దండ రాజకీయ, సాంస్కృతిక, సాహితీవేత్తలు ఈ గ్రంధాలయం‌లో ప్రసంగించారు. పలువురు వక్తలు ఈ భాషానిలయం‌లో ప్రసంగించడాన్ని గొప్పగౌరవంగా భావించేవారు.

శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం శతవసంతోత్సవ (2001) సందర్భంగా నాటి విద్యాశాఖ కార్యదర్శి రమణాచారి గారిచొరవవల్లనూ, తొలిదశలోనున్న మలితెలంగాణా ఉద్యమాన్ని చల్లార్చే యత్నంతోనూ నాటితెలుగుదేశం ప్రభుత్వం రూ 30 లక్షలను మంజూరుచేసింది. సంస్థ కార్యదర్శి మాదిరాజు లక్ష్మినర్సింహారావు మరికొందరు విద్యావేత్తల తోడ్పాటుతో మరో రూ. 30 లక్షలను సేకరించగా నాల్గంతస్తుల భవనాన్ని నిర్మించారు. సంస్థపేరును తెలుగు కళా నిలయంగా పేరుమార్చాలనే నిబంధనపెట్టారు. సాధారణంగా సీమాంధ్రులకు కృష్ణదేవరాయలపై వ్యతిరేకత ఉండదు. పైగా ఆంధ్ర భాషా నిలమని కూడా ఉంది. కానీ ఇక్కడ ఆ పేరు/ ఆ సంస్థ నేటి తెలంగాణ(నాటి నిజాం) ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడింది. ఇటువంటి తాయిలాలుతో సెంటిమెంటును తృప్తి పరుస్తూ పేరుమార్చి చరిత్ర మరుగునపడేయించాలనేది వారి పన్నాగం.

భవన నిర్మాణకాలం‌లో అత్యంత పురాతనవీ, అరుదైనవీ 40వేల పుస్తకాలను భద్రపరచి సరూర్‌నగర్‌లోని భాగ్యనగరి ఖాదీ సమితిలో గ్రంధాలయాన్ని నిర్వహించారు.

శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం తెలంగాణా ప్రజలకు పోరాట స్ఫూర్తి, చైతన్య దీప్తి. తెలంగాణా ప్రజల ఆత్మగౌరవ ప్రతీకయై నేటికీ విరాజిల్లుతున్న ఈ సంస్థ వ్యవస్థాపనా దినోత్సవాన్ని (ది. 1 సెప్టెంబర్) ప్రభుత్వం' తెలంగాణా గ్రంధాలయ దినోత్సవం' గా నిర్వహించడం ఉచితంగాఉంటుందని పలువురు విద్యావంతుల కోరిక.
Photos: Late Ravichettu Ranga Rao, Founder Secretary, Old Building, New Building


1 comment: