Sunday 28 May 2023

తరుణోపాయం కథ 2 (26-05-23)

ఒక అడవిలో ఒక సింహం అనేక ఇతర జంతువులు నివసిస్తున్నాయి.ఆ అడవికి సింహం రారాజు.అదిరోజు దొరికిన జంతువులను దొరికినట్లుగా తింటూ అన్ని జంతువులను భయభ్రాంతులకు గురిచేస్తుండేది.జంతువులన్ని ఒకచోట సమావేశమై ఎలాగైనా సింహం పీడను వదిలించుకోవాలని తీర్మానించుకున్నాయి.అందుకోసం అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి.

                                    ఇదిలావుండగా సింహం ఒక రోజు పంటి నొప్పితో విలవిల్లాడుతూ  "ఈనొప్పి ఎలా తగ్గించుకోవాలి" అని నక్కను సలహా అడిగింది.అప్పుడు నక్క" మృగరాజ!ఈ అడవిలో కొంగను మించిన డాక్టర్ ఎవరు లేరు.డాక్టర్ కొంగ మీ పంటి నొప్పికి సరియైన చికిత్స చేయగలదు.వెంటనే మీరు కొంగను పిలిపించండి".అని సలహా యిచ్చింది.

                                   సింహం ఆజ్ఞతో డాక్టర్ కొంగ పరిగెత్తుకుంటూ వచ్చి సింహం నోటిలో పళ్ళను పరిశీలించి, "రాజా మీ నోటిలో నాలుగు పళ్ళు పుచ్చిపోయాయి ఆనాలుగు పళ్ళు తీసివేస్తే మీబాథ తగ్గుతుంది, కాని మీరు అందవిహీనంగా కనబడతారు అందుకని మీ పళ్ళను మొత్తం తొలగించి మరళ కొత్త పళ్ళను కట్టిస్తాను అప్పుడు మీ పంటి బాధ తగ్గటమే కాకుండా మీరు మరింత అందంగా కనిపిస్తారు మీరు సరే అంటే చికిత్స ప్రారంభిస్తాను"అని అన్నది.

                                    సింహం సరే అనగానే కొంగ సింహం నోటిలోని పళ్ళను మొత్తం ఒక్కొక్కటిగా పీకివేసింది.కొత్తపళ్ళవరుసనుకట్టి "ఇదిగో రాజా నీ కొత్త పళ్ళవరస దీనిని దగ్గరలో వున్న  నదిలో  ముంచుకొని తీసుకు వస్తాను అలా చేస్తే నీవు జంతువులను చంపుట వలన కలిగే పాపానికి నిష్కృతి లభిస్తుందని నాకు ఒక మునిపుంగవుడు సెలవిచ్చాడు కావున నేను త్వరగా నది వద్దకు వెళ్ళి తిరిగి వస్తాను ,అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి వెళ్ళింది.

                  మరింత అందంగా తయారవుతాననే భ్రమల్లోవున్న సింహం, కొంగ ఎంతకూరాకపోయేసరికి,ఆకలికి తాళలేక వేటాడలేక నీరసించి నీరసించి చిక్కిశల్యమై,చివరికి చనిపోయింది.సింహంపీడ విరగడైనందన అన్నిజంతువులు ఎంతో సంతోషించాయి.కొంగతెలివిని మెచ్చుకున్నాయి.

నీతి: ఉపాయంతో ఎంతటి అపాయాన్నైన తప్పించుకోవచ్చు.

88---

ప్రాంజలి ప్రభ -- రోజుకొక కధ చదవండి - చదవమని చెప్పండి (27 -05 -2023 ) 

బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు   (ఒక వాస్తవ గాథ)

          అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు.

బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని తబ్బిబ్బులు పడుతున్నారు. ఇంతట్లో ఒకతను బస్సు టైర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.ప్రయాణికులందరూ దేవ్ గడ్ కు వెళ్లేవాళ్ళే. 

ఒక చేతిన పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలిని టికెట్టు తీసుకోమని కండక్టర్ అడగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది.

బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది. వానాకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో..?

అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా!"

ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!

కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన సీటు వద్దకు వచ్చి కూర్చున్నాడు.

బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కునుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపితే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్న తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది? ఆమెకు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు..?

ఒంటరిగా ఉన్న ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే..?

ఇంతలో ముసలామె దిగే ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .

కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.

బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. 

కండక్టర్ అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.

అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.

"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు?" అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్  ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి! బస్సును నడపండి!" అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కిఆదేశాలు ఇచ్చారు.

"నాయనా! నీ పేరేంటి?" అని కండక్టర్ని అడిగింది ముసలామె.

"అవ్వా! నా పేరుతో నీకేమి పని?.. నా పేరు మహాదూ వేంగుర్లే కర్.”

"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా?"

"మాల్‌ వన్." అన్నాడు కండక్టర్ ."నీకు సంతానం ఎంత మంది?"

"ఇద్దరు" అన్నాడు కండక్టర్ .

ఇంతట్లో ముసలవ్వ ఇంటిని(పూరి గుడిసె ను) చేరుకున్నారు. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.

ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది. ఆమెకు దగ్గరి బంధువులు అనేవాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!

ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది.  భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.

ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా, వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను. కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌' బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరిట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేలరూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మలకోసం వాడుకోండి. నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను." అని అంది. సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.ఇదేంటి సమస్య? ఈ మహాదు వేంగుర్లే కర్ ఎవరు? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ దగ్గర  సెలవు తీసుకొని వెళ్లి పోయారు.            

రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ కన్నుమూసింది.ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్ని పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్, కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కానుక కండక్టర్ కి అన్ని విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. ముసలవ్వ తన పేరట వీలునామా వ్రాసిన విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది విన్న సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.

మహాదూ వేంగుర్లే కర్     పిలిచిన తారీఖున ఆఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. 

అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయంతో ఆమె ఇంత విలువైన సంపదను తనపేరట వ్రాయటం అతడికి మతి పోయినట్లు అయింది.!

అక్కడ సమీపం లో   పిల్లల గోల వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా?" అని అడిగాడుకండక్టర్.

"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా హైస్కూల్ నడుస్తోంది." అనిచెప్పాడు సర్పంచ్ . 

"ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి నిమిత్తం తమ భూమిలోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.

"ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ ముందుకు రావటం లేదు." అని జవాబిచ్చాడు సర్పంచ్.

వెంటనే కండక్టర్ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ - "ఇదిగో సర్పంచ్ గారూ పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకోండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన బంగారం తీసుకోండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరిట బడికి ఒకదివ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి. మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి." 

గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరి జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. ఊరి జనం అతడిని కొంత దూరంవెంబడించింది.

చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదేఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.మనం జీవితంలో ఒకరికి చేసిన చిన్న, పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.

మనిషి మనిషి కి  మధ్య  మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు 

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

****

ప్రాంజలి ప్రభ వారి నేటి కథ
(2)...28=05=2023
జీవన సత్యం

వేసిన రోడ్డు మీద వెళ్ళిపోవడం సులువు. మనమే ఒక రోడ్డు వేసుకుని వెళ్ళడం కష్టం. అమ్మ చందమామను చూపించి బువ్వ తినిపిస్తుంది. జ్ఞాని దేవుణ్ని చూపిస్తాడు. చివరికి అతడే గురువుగా మిగిలిపోతాడు.

దేహం - అణువుల సముదాయం.
మనస్సు - ఆలోచనల సముదాయం.
బుద్ధి - అవగాహనల సముదాయం.
ఆత్మ - అనుభవాల సముదాయం.

 మంచివాళ్లు. ఆదర్శవంతులు ఒక మార్గం చూపిస్తారు. ఆ దారిలో మనం వెళ్తే జీవితం ఎక్కువ కష్టాలు లేకుండా సాగిపోతుంది.

ఇది నీది - అది నాదని 'వంతు'లతో భాగాహారాలు వేసి భాగాలు పంచుకుంటారు.

 నిజానికి అన్ని భాగాలు భగ'వంతు'ని లోనివే..

కాలం మనతోనే ప్రారంభం కాలేదు.
మన ముందు ఎందరో ఉన్నారు. గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి చూపించారు. అందువల్ల మనకు ఒక దారి ఉంది. ధైర్యం ఉంది. భయం లేదు.. అలా ముందుకు వెళ్ళిపోదాం! అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను. అవరోధాలను పరిష్కరించి, రాబోయే తరాలకు మన మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నామో చూపిద్దాం.

జననం అంటే?  కార్యంగా 'ఉండడం'.
మరణం అంటే? గుప్తంగా 'ఉండడం'.
మోక్షం అంటే? లీనమై 'ఉండడం'.

మార్గం వేరు, లక్ష్యం వేరు. సరైన మార్గం ఎన్నుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం. మనం ఎంతో అదృష్టవంతులం. మన ముందు తరాలవారు మనకు ఎన్నో ఉపాయాలు, పరిష్కారాలు, కిటుకులు అందించారు. భయపడకుండా అడుగు వేసుకుంటూ వచ్చేయండి. మీకు మేమున్నాం అని. వాళ్ల అనుభవాల చరిత్ర భరోసా ఇస్తోంది. వారికి మనం ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం కూడా ఎంతో కొంత కృషిచేసి, మన పని చేసుకుంటూ ఆదర్శప్రాయమై ఇతరులకు నాలుగుదారుల
కూడలిలో దీపాలు వెలిగించాలి. వెలుగు భావితరాలకు కనిపించాలి. వాళ్ళు మనకు అభినందనలు తెలపాలి. ఇదే జీవితం వెళ్ళేవారు వెళ్తుంటారు. వచ్చేవాళ్లు వస్తుంటారు. ఎవరి అనుభవాలు వారివి. చివరికి అందరికీ కొన్ని అరుదైన అనుభవాలు శాశ్వతంగా మిగిలిపోతాయి.

భోగి అద్దంలో క్షయమయ్యే శరీరాన్ని చూసుకుంటాడు!

 యోగి తనలో అక్షయమైన ఆత్మను దర్శించుకుంటాడు!

మరణించిన తరవాత లోకంలో శాశ్వతంగా ఎలా ఉండిపోవాలో తెలియజేస్తోంది భగవద్గీత. ఎలా బతికితే శాశ్వత పరంధామ పథం పొందగలమో కూడా వివరణ ఇస్తుంది. శ్రీకృష్ణుడు మనకు చేసిన మహోపకారం భగవద్గీత ద్వారా చూపిన జ్ఞాన మార్గం.. మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాధలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మహా గ్రంథాలు, మహానుభావుల అనుభవాలే మనకు దిక్సూచి, వారి కార్యాచరణే మనకు శిరోధార్యం. వారి నిబద్ధతే మనకు ప్రాణసమానం. వాళ్లే మన ఊపిరి. వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.

జీవుడిలో దేవుడు దాగి జీవుడితో ఆట ఆడుతున్నాడు.

ఇప్పుడు జీవుడు దేవుడిలో దాగి ఆ ఆట దేవుడిదే అని నిశ్చింతగా ఉండాలి.

తాతముత్తాతలు ఆస్తులు ఇస్తారు. తల్లిదండ్రులు సంపాదించినవి ఇస్తారు. కాని, వెలకట్టలేనివి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అవే మనకు విలువైన సంపద. తరగని ఆస్తి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాముడంటే తెలియని ఒక ప్రదేశంలో పుడితే, రామాయణం కూడా తెలియదు. దాని గొప్పదనం తెలియదు. మన ముందు నడిచిన మహానుబావుల అడుగుజాడల్లో నడవాలి. దైర్యం విడిచిపెట్టకూడదు. వీరులు వాళ్లు. మన సుఖం కోసం వారెన్నో త్యాగాలు చేశారు. యుద్ధాలను ఆహ్వానించారు. విజయం సాధించారు. శాంతిని అందించారు.
కర్మఫలం కర్మ చేసిన వానికి మాత్రమే చెందదు. ఆ ఫలం ప్రపంచంలో ఉన్న సకల చరాచరానికి పంచబడుతుంది.. అంటారు గురువుగారు.

 వాన చుక్క సముద్రంలో పడి సముద్రవ్యాప్తమైనట్టుగా...

ఆదే దారిన పడుతూ లేస్తూ అయినా వెళదాం. వెయ్యిసార్లు కిందపడినా,
మళ్ళీ లేచి నిలబడదాం. ఒక కొత్త వెలుగును లోకానికి చూపిద్దాం!

రెండు శరీరాల కలయిక - సంయోగము
నీతో నీ కలయిక - యోగము

 మొదటి కలయిక -  క్షణికానందము.
 రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము.

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
***
నిజమో అబద్ధమో మీరేచెప్పండి ప్రాంజలి ప్రభ కథ... (3) 29=05=2023

నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే , నీ బాధను పంచుకునే వారికేఎక్కువ విలువ ఇవ్వు.     
ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు  కాని బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. నిజమా 

కులం పోవాలని చెప్పేది మనమే..
కులం చూసి ఓటు వేసేది మనమే..
అవినీతి పోవాలనేది మనమే..
అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే.. నిజమా 

సమాజంలో మంచిని స్వీకరించి  చెడును వదిలి వేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేదే  "విద్య" అదే మన అందరి బంగారం, బంగారం పంచలేకపోయినా విద్యను పంచుదాం. నిజమా 

ఇంటికో రాముడు పుట్టాలని చెప్పేది మనమే..
మన ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవి పుట్టాలని కోరుకునేది మనమే..
మార్పు రావాలని చెప్పేది మనమే..
అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరి పోసేది మనమే..నిజమా 

మనం చేసిన మంచిని మర్చి పోవాలి. మనకు మంచి చేసిన వారిని మాత్రం జీవితాంతం మర్చి పోకూడదు.
   
గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారి తోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్న వారితోనూ పోల్చుకోవాలి. వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని, ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.   
ఉన్నది చాలనుకుంటే మనకెంతో తృప్తి. ఒకరిది వద్దనుకుంటే మదికెంతో సంతృప్తి నిజమా 
     
రేపటి అందమైన భవిష్యత్తు కోసం  మన మనస్సును ఎల్లప్పుడూ మంచి విషయాలతో నింపుకోవాలి.అదియే అందరికీ శాంతి సౌభాగ్యలు నిచ్చె సంతృప్తి

అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........
వెర్రి గొర్రెలు..కాదు కాదు తెలిసిన మూర్ఖులం నాకెందుకు అనే చవటలం...నిజమా 

  అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని
 ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం. నాగరికతను పాటిస్తాము ఏ ఎండకు ఆ గోడుకు పట్టె మనుష్యులం. మాటమీద లేని మనుష్యులం. నిజమా 

​ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు ఒకనాడు జరుపుకుంటాం.​ కాదండో మారింది ఉప్పుడు దీపాలు వెలిగిస్తున్నారు కొంత మార్పు మానవలోకం. నిజమా 

​మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.​ అందుకే చెడు వేగంగా మనిషిని చేరుతుంది మంచి నిదానంగా మార్పు చూపిస్తుంది. నిజమా 

​ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.​
ఇప్పుడు ఒకేచోట పాలు, బ్రాందీ అమ్మే ప్రభుత్వాలు కొనే మనుష్యులున్నారు నిజమా.

​ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.​ ఎందుకంటే అజీర్తి రోగం రాకుండా. నిజమా 

​ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.​
ఎవరి స్వార్ధం వారిది, వారిమతం వారికే గొప్ప నిజమా 

​దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు -నిత్యందైవణామం చేస్తాడు, ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.​ దైవాన్నే మోసాగిస్తాడు. నిజమా 

​విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.​ అంటే తీరం దాటాక తెప్ప తగ లేసే మనుష్యులు కదా నిజమా 

​ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.!​ 
నిజమె కదా.....

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
....
30-05-2023
కూతురు

కూతురు అమెరికాలో , అమ్మ హనుమకొండలో , కొడుకు ఇంగ్లండ్ లో, తండ్రి ఇరుకు సందులో..
నువ్వు ఇన్ఫోసిస్, నాన్నకేమో క్రైసిస్ , నువ్వు వీసాపై ఎక్కడో అమ్మ అంపశయ్యపై 
నువ్వు రావు, రాలేనంటావు, నిజానికి రావాలని అనుకోవు, టికెట్ దొరకదంటావు..
సెలవు లేదంటావు..
వస్తే తిరిగి రావడం కష్టమంటావు..
నువ్వు వచ్చేదాక అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు  గుమ్మం వైపే..
రావని తెలిసినా  నాన్న అమ్మకు ఆ కబురు చెప్పలేక..
కక్కలేక..మింగలేక..
మంచం చుట్టూ అటూ ఇటూ అవతల ఆ తల్లి ఇంకాసేపట్లో అటో ఇటో..
వయసు వచ్చినప్పటి నుంచి డాలర్ డ్రీమ్సే..
పొద్దున లేస్తే ఆ ఊసే..
నీ కలల వెనకే తల్లిదండ్రుల పరుగు..
వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ..
గుండె బరువుతో వారిక్కడ..
మొదట్లో రోజూ ఓ వాట్సప్ కాలు రెండ్రోజులకో వీడియో ఫోను పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు అప్పటికే  నిద్ర లేచి ఉంటాడు నీలో ఓ మాయలోడు...
అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు ఇక్కడ డొక్కు స్కూటర్ తో తంటాలే నాన్నకి ప్రతిరోజు..
ఈలోగా అన్నీ బాగుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదంటే అక్కడే ఓ భామతో మేరేజ్..
ఆలికి కడుపో కాలో వస్తే ఆయాగా అమ్మకి వీసా నాన్నకి నేను డబ్బులు పంపుతాలే 
అని భరోసా..!
ఎంత అమ్మయినా, నీ పిల్లలకు నాన్నమ్మయినా, ఆమె నాన్నకు భార్య అక్కడ పెద్దాయన 
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని ఒకటే బెంగ..
ఆ దంపతులను అలా వేరుగా ఉంచి మీ జంట మాత్రం టింగురంగ..
మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక అప్పుడిక ఆమె ఉంటే బరువు
ఈలోగా ముగుస్తుంది ఆమె వీసా గడువు..
ఆమె చేతిలో టికెట్, నాన్నకిమ్మంటూ ఓ గిఫ్టు పేకెట్..
ఇటు నిన్ను వదలి వెళ్ళలేక అటు భర్తని విడిచి ఉండలేక చెమ్మగిల్లిన కళ్ళతో విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపని ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..
నువ్వు పంపుతావేమో..
కాని ఆ వయసులో నాన్నకు శ్రమ..
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..
వచ్చే ప్రాణం..పోయే ప్రాణం చివరకు అనివార్యమయ్యే మరణం..
వాడు వస్తున్నాడా.. ఏమంటున్నాడు..
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ..
నిర్జీవమైన ఆ కళ్ళలో నీ బొమ్మ..
కొరివి పెట్టాల్సిన నువ్వు సీమలో నాన్న కర్మ చేస్తుంటే ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..
అస్తికల నిమజ్జనం అంటూ నాన్న కాశీకి పయనం అంత శ్రమ ఎందుకు..
పక్కనే ఉంది కదా గోదారని నీ అనునయం..
ఇప్పుడిక నాన్న కథ 
ఉన్న ఊరు కట్టుకున్న ఇల్లు ముఖ్యంగా ఆ ఇంట్లో అమ్మ జ్ఞాపకాలు వదిలి రాలేక
ఒంటరి బ్రతుకు ఈడ్వలేక కష్టాలకు ఓర్వలేక..
ఓ రోజు502023న ఆయన కధా కంచికి…
ఈసారి వస్తావు కొరివి పెట్టి ఊళ్ళో ఇల్లు అమ్మేసి ఉన్న ఊరు..కన్న తల్లి..
అన్నిటితో రుణం తెంచుకుని నేను ఎన్నారై..
మిగిలినవన్నీ జాన్తా నై..
అంటూ పుట్టిన గడ్డను వదిలి పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస ఇదే కదా చాలామంది వరస..!!
***
31--05--2023

అర్ధమయిందా ? ప్రాంజలి ప్రభ నేటి కథ          -                                                        -               *ఒక ఊరిలో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. *
ఒక చదువు రాని వ్యక్తి శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. "రామాయణం నీకేం అర్ధమైంది?" అని అడిగింది భార్య. "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు ఆ వ్యక్తి ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని ఆ చదువు జ్ఞానం లేని వ్యక్తి చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.
* అప్పుడు ఆ భార్య ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా అంది. ఆ వ్యక్తి వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా అలాగే తీసుకొచ్చాడు. భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. చూసావా ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. "నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.*
* అప్పుడు ఆ చదువు రాని వ్యక్తి ఇలా అన్నాడు "గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు. భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది.*

కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న  భర్తను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భార్య  అక్కడేం  చేస్తున్నావు అని *అడిగింది *..
        ....... *దానికి అతడు * .......
" *ఆలి పోయిన వాని ఆలిని వెతక బోయిన వాని తల్లి మగని కోసం  కూచున్నా అన్నాడు *,”
అర్థం కాక అయోమయంలో ఉన్న *భార్యతో * *భర్త * ఈవిధంగా *చెప్పాడు * ఏమిటంటే..
" ఆలి పోయిన వాడు "శ్రీరామ చంద్రుడు",
" వెతక బోయిన వాడు  "హనుమంతుడు"
" అతని తల్లి అంజనాదేవి,
 " ఆమె మొగుడు  వాయుదేవుడు.. 
అంటే "గాలి" కోసం, బాల్కనీ లో కూచున్నా అని "విసనకర్ర" తో విసురుతూ *చెప్పాడు * "...
మొగవాళ్ళను తక్కువ అంచనా వేయకూడదు ఎక్కడచెప్పాల్సిన మాటలు అక్కడ చెపుతారు. అందరూ ఇట్లావుంటారని అనుకోకండి ప్రత్యేకంగా మావారు లాంటివారే.
నిజమేనా
మీ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
***

దివ్య శిల్పి

శిలా నీవే....
శిల్పం నీవే....!!
మానవా...
ఓ ! మానవా!!                                               
మేలుకో.....  
నిన్ను నీవు తెలుసుకో....!!   
నిన్ను నీవుగా.... మలుచుకో....!!   
నిన్ను నీవే... దైవంగా మార్చుకో....!!  

శిలా నీవే....
శిల్పం నీవే....!! 
ఇంకా....ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళు....  
ఎన్ని జన్మలు...                                             ‌
శిలగానే... ఉంటావు,                                
శిల్పమెక్కడో  లేదులే.....                 
అది....నీ‌ లోనే‌....
నీ మదిలోనే ఉందిలే..... శిల్పం...!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!
నీవే శిల్పానివి....                                    
శిలగా.... !
ఉన్న నిన్ను నీవుగా శిల్పంగా.... 
మలిచే  శిల్పి..... ‌
ఎవరో.... 
కాదులే.... 
అది నీవేలే....!!
అది నీవేలే....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీవే శిల్పివి,  
నిన్ను నీవు...                                    
ఎరుక‌తో తెలిసుకో.... !                        
నీకు నీవే శిల్పివి....!!
నీలోనే ఉన్న శిల్పాన్ని   చూడు.....!
మబ్బుల మాటున  దాగిన... 
! చందమామలా...! 
మరుగున ఉన్నది....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీ మనసులోని అయుక్తాలను,
అరిషడ్వర్గాలను
తొలగించుమూ....! 
వ్యర్థాలను,
దుర్గుణాలను...
విసిరి పారవేసేయుమూ...!!
నిన్ను నీవు.... సరిగా  మలుచుకో....   అంతే,  ‌   
ఇక అదే శిల్పమే,
అందులోన దాగిన దైవమూ....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీకు నీవే...  కర్తవు,                           
నీకు‌ నీవే...   విధాతవు,     
 నీకు నీవే  శిల్పివి....                       
నీవే‌ సుందర శిల్పానివి....!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

నీవు... నీ వ్యక్తిత్వంను,                               
నీ జీవితంను,
నీ  జీవనం  సుందరశిల్పంగా మలచుకో....
మానవా,  ఓ మానవా....!!!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!

మహా శిల్పీ ఓ మానవతా శిల్పీ....
ఓ దివ్య శిల్పీ       ‌మేలుకో....
నిన్ను నీవు దైవంగా మలుచుకో....!

శిలా నీవే....!
శిల్పం నీవే....!!
మానవా...
ఓ ! మానవా!!                                               
మేలుకో..... ! 
నిన్ను నీవు తెలుసుకో....!!   
నిన్ను నీవుగా.... మలుచుకో....!!   
నిన్ను నీవే... !
దైవంగా.. మార్చుకో....!!  
***