Thursday 3 March 2016

Students special stories for the month of 3/2016

ఓం శ్రీ  రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - వ్యాసాల ప్రభ 
ర్వేజానాసుఖినోభవంతు    

‘పతి! పత్ని!! ఔర్ ఓ? “భర్త!!భార్య! మరి అది (ఆ ఇంకొకరు)ఎవరు?”......... ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆసక్తితో ఆశించడమేకాక తెలుసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తాం.

“ఆడ! మగ!! మరి ఆ మిగిలిన వాళ్ళెవరు?” మనలో చాలా మందికి సమాధానం తెలిసినా అనడానికే కాదు, అనుకోవడానికే అసహ్యంగా భావిస్తారు.

“చూడు పిన్నన్నమ్మా! పాడు పిల్లాడు!! పైనపైన పడత‌ఉంటడు” పాటలో పాత్రలపాటు చూసేవాళ్ళు కూడా నృత్యం చేస్తుంటారు.

వీళ్ళు ఆడుతుంటే ఆనందించినా, అనుకోవడానికి అసహ్యించుకున్నా, ఆ సందర్భం తర్వాత వీళ్ళను మరిచిపోతాము. కానీ ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి నేడు, 31 మార్చి అంతర్జాతీయ హిజ్రాల దినోత్సవం (International Day of Trans genders) రోజు వీళ్ళ గురించి ఆలోచించాల్సిందే. ఆవేదన పడాల్సిందే. మార్పుకు కృషిచేయాల్సిందె. ప్రభుత్వాలకు నివేదించాల్సిందే

భారత జనాభా గణన 2011 ప్రకారం మనదేశం‌లో వీరి సంఖ్య దాదాపు 5 లక్షలు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 137, రెండవస్థానం నాటి సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో 44 మంది. సుప్రీంకోర్టు వీరిని ధర్డ్ జెండర్ గా నమోదు చేయాలని ఆదేశించేటప్పటికల్లా జనాభా గణన పూర్తి కావడంతో వీరిలో అత్యధికులు నిర్భయంగా తమ లింగ స్థయిని ప్రకటించుకోలేక స్త్రీలుగా చెప్పుకున్నారు. అందువల్ల వీరి సంఖ్య ఇంతకుమూడింతలుంటుందని జనాభా గణన పై స్థాయి అధికారులు చెబుతున్నారు.

భారతదేశ చరిత్ర, ఇతిహాసాల్లో మనకు తెలిసిన మొదటి ట్రాస్న్‌జెందర్ శిఖండి. దుష్టుల పక్షాన నిలిచిన కురుకుల పితామహుణ్ణి, భీష్ముణ్ణి అస్త్ర సన్యాసం చేయించడం, అతడు/ ఆమె చేసిన సామాజుక మహోపకారం. ఆ అస్త్ర సన్యాసం‌ వల్లనే పాండవుల విజయం సుగమమైనదని చెబుతుంటారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా ట్రాన్స్‌జెండరు జీవితాన్ని అవసరార్ధం ఆహ్వానించినవాడు అర్జునుడు (బృహన్నల). ఆపాత్రలోకూడా స్త్రీలోలుడైన కీచక వధ చేస్తాడు.

చరిత్రలో ఘియాసుద్దీన్ తుగ్లక్ ముఖ్య సైన్యధిపతి మాలిక్ కాఫుర్ నపుంసకుడు. ఘియసుద్దీన్ అతనితో (స్వలింగ) సంపర్కం జరిపెవాడని చెబుతారు. ఇక్కడ శిఖండి, మాలిక్ కాఫుర్‌లకు గల తేడా ఏమిటంటే శిఖండి పురుష రూపం‌లో జన్మించి స్త్రీ లక్షణాలను పొందినవాడు, వీరిని భారతీయ భాషల్లో ‘హిజ్రా’ లంటారు. మాలిక్ కాఫుర్ పురుషునిగా జన్మించినప్పటికీ విత్తు కొట్టబడి (కాస్ట్రేటెడ్) నపుంసకుడిగా మారినవాడు. ఇతడు పురుషుడే ఐనప్పటికీ సంపర్కానికి పనికిరాడు, వీరిని భారతీయ భాషల్లో ‘కొజ్జా’ లంటారు.

పురుషునిగా జన్మించినప్పటికీ ఆరుసంవత్సరాల వయసు వచ్చేటప్పటికే స్త్రీ లక్షణాలు అభివృధ్దికావడం, సమాజం ఆడంగియని అవహేళన చేసినప్పటికీ ఆలాగే ఉండిపోవాలని కోరుకుంటూ, స్త్రీ లక్షణాలు సంపూర్ణముగా ఆపాదించబడేలోపు అనుమానాలు అవహేళనమధ్య ఇంటినుండి గెంటివేయబడటం, తనలాంటి వారితో చేరి ఆ సమాజం‌లోనే జీవితాన్ని కొనసాగించి అంతంకావడం. ఇదీ ఈ మూడో మనుషుల జీవితం. వీరిలో అత్యధికులు సెక్స్ రిఅసెస్‌మెంటు సర్జరీ చేయించుకుంటారు.
ప్రపంచం‌లోని మతాలన్నీ వీరి ఉనికిని గుర్తించాయి. వీరి సంఖ్య అత్యంత తక్కువగా ఉండటం వల్ల సామాజికంగానూ, ఆర్ధికంగానూ, చట్టపరంగానూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీరి ఉనికినీ, ఆస్తిత్వాన్నీ “కాంచన” తెలుగు సినిమాలో చర్చించారు. విద్యా ఆరోగ్యసేవలవంటి అవకాశాలనిస్తే తామెవరికీ తీసిపోమని వీళ్ళు నిరూపించారు. షబ్నం మౌసి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికైన మొదటి హిజ్ర., రాయ్‌గడ (చత్తీస్ఘర్) నగరానికి మధుభాయ్ కిన్నార్ మేయర్గా ఎన్నికైన తొలి హిజ్రా. ఇటీవల రచయిత్రి రేణుక అయోల గారు వీరి సాధకబాధకాలను “మూడో మనిషి” పేరుతో ప్రచురింఛిన దీర్ఘకవితలో హృద్యంగా వివరించారు. ఈకవితపై పుష్యమీ సాగర్‌గారు రాసిన సమీక్షను నమస్తె తెలంగాణా (28 మార్చి 2016)లో ప్రచురించారు. సమీక్ష చదివిన తర్వాత “మూడో మనిషి” ఖచ్చితంగా చదవాలని, మూడో మనుషులగురించి తెల్సుకోవాలనే సానుకూల దృక్పధం పెరుగుతుంది. (మిత్రులందరికీ తెలుసు- నాగోడపై నెను ఎటువంటి ప్రచారాలు చేయలేదు. సామాజిక బాధ్యతగా మాత్రమేఅ ఈ పుస్తకాన్ని చదవాలని సూచిస్తున్నను. చిరునామా: రేణుకా అయోల, యు సీ ఓ ఆర్కేడ్, ఫ్లాట్ 2, నవోదయా కాలనీ, ఎల్లారెడ్డి గూడ, హైద్రాబాద్- 500037 చరవాణీ; 9963889298 వెల: రూ 50)

వీరికి వయసెంతవచ్చినప్పటికీ పూర్తిగా పసిపిల్లల మనఃస్తత్వం. తిండి, నిద్ర ఇవిమాత్రమే వీరి నిత్య లేదా అత్యవససరాలు. వారు చావలేకజీవించేది వీటికోసమే. తమపై జరిగే లైంగిక దాడి, హింస, అవహేళనలకు ప్రతిగా వీరు అసహనంగానూ, అగ్రెసివ్‌గానూ ప్రవర్తిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనేకులు మద్యానికి బానిసలౌతున్నారు.

నేడు అన్ని వర్గాలు, స్త్రీలు, అనాధబాలలు, వికలాంగులు, ఏయిడ్స్ బాధితులు సామాజికవ్యవస్థలో తమ అస్థిత్వంకోసం పోరాడుతున్నారు. వీరు హిజ్రాలుగా మారడములో వీరి ప్రమేయం, పాత్ర లేదు. ఇది కేవలం శరీరములోని జన్యులోపం. వీరికి తిండి కోసం పోరాటం తప్ప, ఆస్తిత్వంకోసం కానీ, ఆస్తులకోసంగానీ ఆరాటం లేదు. కొన్ని రాష్ట్రాలు వీరి ఉనికిని గుర్తించి రిజర్వేషన్లను కల్పించాయి. వీరిగురించి 2014 మార్చి పార్లమెంటులో జరిగిన చర్చలో బీజేపీ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు.

తెలంగాణా ఉద్యమకాలం‌లో ఈమూడో మనుషులు ర్యాలీలు నిర్వహించారు, రిలే నిరాహర దిక్షలకు సైతం కూర్చున్నారు. వంటా, వార్పూ, రాస్తారోకోల్లో కూడా పాల్గొన్నారు.

మకుంపట్టిన పిల్లలను సముదాయించినట్టుగా వీరితో సౌమ్యంగా ఉంటూ సమాజంపట్ల నమ్మకం కల్గించాలి. ప్రభుత్వం వీరికి ఉపాధిలో శిక్షణ, రక్షణ కల్పించినట్టైతే వీరిని అత్యున్నత మానవ వనరులుగా దేశాభివృధ్ధ్ లో భాగస్వాములను చేయవచ్చు.

అంతర్జాతీయ జీవవైవిధ్యాల ఒప్పందం ప్రకారం ప్రతీ ప్రాణికీ జీవించేహక్కుంది. భారతరాజ్యాంగం నిర్దేశించిన ప్రాధమిక హక్కులననుసరించి పుట్టిన ప్రతీ మనిషికీ గౌరవంగా జీవించే హక్కు, ఉద్యోగం/ఉపాధి హక్కు ఉంది. ప్రభుత్వాలు వాటిని గుర్తించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పూనుకోవాలి.


http://revolvy-cdn.revolvyllc.netdna-cdn.com/images/cache/21/18/e8/2118e8ed40e1cbf1b109f8b23c46016c.png

రుద్రధ్యానమ్
************
సద్యోజాతం ప్రపద్యామి
సద్యోజాతాయవై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వమామ్ | భవోద్భవాయ నమః||
(తై. అరణ్యకము 10 పక్ర. 43 అను.)

భావం:: మహాదేవుని పశ్చిమముఖమునకు 'సద్యోజాతము' అని సంప్రదాయ సిధ్ధవ్యవహార నామము. అట్టి 'సద్యోజాత' ముఖమే తన రూపముగా కల పరమేశ్వరుని ఆశ్రయించుచున్నాను. ఆ 'సద్యోజాత' మహాదేవుని (అనుగ్రహింపజేసికొనుట) కొరకే నా ఈ నమస్కారం; మహాదేవ! నన్ను నీవు "నాకు మరల జన్మము కలుగు విషయమున (కలుగునటుల) ప్రేరేపించకుమా! ఈ భవమును(సంసారమును-జన్మపరంపరను) అతిలంఘించి ముక్తిని సాధించుకొనునట్లు నన్ను ప్రేరేపించుమా! సంసారము(జన్మము) నుండి తన ఉపాసకులను ఉద్ధరించు సద్యోజాతునికొరకు ఈ నా నమస్కారాలు.

(సద్యోజాత శబ్దమునకు వ్యుత్పత్తి : సద్ (సదా) యః అజాతః - ఎవడు ఎల్ల సమయములందు జనించని నిత్యసిధ్ధతత్వ్తరూపుడు).
పంచ బ్రహ్మ మంత్రాలో, ఇది పశ్చిమ ముఖానికి సంకేతము. సద్యోజాతుని రూపములో ఈశ్వరుడు జ్ఞానమూర్తిగా భావించి ధ్యానము చేసిన. వారికి సంసారబంధ విముక్తిని కల్పించి మోక్షం ప్రసాదిస్తాడని ఈశ్వరారాధన చేసేవారు విశ్వసిస్తారు. నివృత్తి మార్గమును అవలంబించి, అత్మసమర్పణతో సద్యోజాతుని ఆశ్రయించి, పునః - పునః జన్మలేనట్లు దీవింపుమని సద్యోజాతుని ఈ మంత్రముల ద్వారా ప్రార్ధిస్తున్నట్లు గ్రహించవచ్చు.

ఇటువంటి శివాలయం, శ్రీముఖలింగము ( శ్రీకాకుళం జిల్లా) నందుగలదు. శ్రీముఖలింగము స్వయంభు లింగము మరియు దక్షిణకాశి గా పిలవబడుతుంది. ఇక్కడ శివలింగము ముఖాకృతితో దర్శనమిస్తుంది. (ముఖ్య మందిరాన్ని మధుకేశ్వరాలయం అంటారు). ప్రధాన మందిరానికి కూతవేటు దూరాన, గ్రామాగ్రభాగన నెలకొనియున్న మందిరము సోమేశ్వరాలయం. ఇది చంద్రునిచే ప్రతిస్థాపన గావించబడినదిగా అచ్చటి ప్రజలు విశ్వాసం. ఇది పశ్చిమముఖ శివాలయం.పవిత్ర వంశధారా నదికి అభిముఖంగా, ప్రకృతి అందాలతో అలరారుతుంది. సోమవారం పవిత్ర వంశధారా నదిలో స్నాన్నమాచరించి, (పశ్చిమముఖ - పంచ బ్రహ్మ మంత్రాలో) భక్తిశ్రద్ధలతో ఆ సోమేశ్వరుడుని పూజిస్తే జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.


లాల్‌బహదూర్‌శాస్ర్తీ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు, ఆయన భార్య శ్రీమతి లలితాశాస్త్రిగారికి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.

మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థవారు హరికృష్ణ శాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్‌బహదూర్‌శాస్త్రి గారికి ఈ విషయం తెలి పారు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట.

అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా?దేశ ప్రధాని కాకముందు లాల్‌బహదూర్‌శాస్ర్తీగారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీఅయ్యారు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితాశాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయ త్నం కారణంగా ఇన్నేళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. దేశ ప్రధాని ఐన లాల్‌బహదూర్‌శాస్ర్తీ. ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మించేది.


దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే

అని నాటి కవిశేఖరులనే భయపెట్టుటే గాక పండిత పామరులందరి తమ పాండిత్యముతో మెప్పులు గడించిన తిరుపతి వేంకట కవులలోని.. శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి ఈనాడు



బానిస బ్రతుకులకు మోక్ష దినము.
మార్చి 25 వ. తేది.

సీll
బానిస బ్రతుకుల బంధాల సంకెళ్ళు
తెగ నరికిన రోజు తెలియ జెప్పి

నీచ సంసృతికిని నీళ్ళొదలని దేశ
చట్టస భలతీరు చక్క బడక

నారిని సంధించి నాతి సలిపె పోరు
విజయకే తనముల విజయ గీతి

గాలి తగిలి నంత గాఢాంధ కారంబు
తొలగగా వెలుగొందె తొలుత గాను.

తే.గీll
విశ్వ జాతుల వారంత విషము నొదలి
బాని సత్వము తొలగగా బాధ లంత
మాయ మయ్యెను మహిలోన మంచిగాను
మాన వత్వపు విలువలు మదిన తెల్పె.

- మల్లి సిరిపురం.



























 
  
“కొలంబస్, కొలంబస్ ఇచ్చారూ సెలవూ, ఆనందంగా బతకడానికీ కావాలొకదీవీ! కొలంబస్!!!” అంటూ యువత వెర్రిగా గంతులు వేస్తూ చిందులు తొక్కుతుంది.
ఇంకా మరికొంతమంది యువకులు “ నిన్న మనదికాదు, కాదు!!, రేపు మనకు లేదు, లేదు!!, నేడే నిజం, నేడే నిజం, నిజం!!!.. కాసే బ్రహ్మానందం, హో డోసే పరమానందం” అంటూ ఆడుతుంటారు.

ఇంతగా కిక్కెక్కించి కీర్తించబడుతున్న కొలంబస్ కారూక్‌జారీ (ఘనత)ను (25 మార్చి బాధితబానిసల సంస్మరణ మరియు అట్లాంటిక్ సముద్రానికి అవతలి బానిసవ్యాపార నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవము సందర్భంగా) చూద్దామా!
 

స్పెయిన్ దేశస్తుడైన క్రిష్టఫర్ కొలంబస్‌కు భారతదేశం సిరిసంపదలపై ఆసక్తి ఎక్కువ. అతను 1492వ సంవత్సరం‌లో సిం‌హాసనం పెట్టుబడి మరియు అనుమతితో భారతదెశానికి ప్రత్యామ్నాయ సముద్రమార్గం అన్వేషణకు బయలుదేరి బహామాద్వీపాలకు చేరుకుంటాడు. ఆర్వాక్ ఇండియన్లుగా పిలువబడే స్థానికుల మెతకదనం అతనికి తెగనచ్చుతుంది. అంతే! అతనిచేతిలోని మారణాయుధాలకు లొంగి వారు బానిసలౌతారు. వారితో కొలంబస్ అమెరికా భూభాగానికి చేరుకుని ఆ బానిసలను అమ్మేస్తాడు. కొద్దికాలానికి సెక్సుకోసం బాలికల వ్యాపారంకూడా లాభసాటిదని గ్రహించి అందులోనూ ప్రధముడిగా నిలుస్తాడు.

అలా మొదలైన బానిసవ్యాపారాన్ని ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందినవారితో ఐరోపాకు చెందిన పలువురు వర్తకులు నాలుగు శతాబ్దాలుగా కొనసాగించారు. ఐతే కొలంబస్ సమకాలికులెవరూ బానిస వ్యాపారం‌లో అతని రికార్డును అధిగమించలేకపోయారు. తన జీవతకాలం‌లో ఐదువేలమంది బానిసలను అమ్మి ఎప్పటికప్పుడు కొలంబస్ తన రికార్డును తానే బద్దలుచేసుకున్నాడు.

ఈ 400 సం.ల కాలం‌లో చీకటి ఖండాలకు చెందిన 15 మిలియన్ల మంది (అంటే కోటీ యాభయి లక్షలమంది) పైబడి స్త్రీ, పురుష, బాలబాలికలు బానిసలుగా వ్యాపార వస్తువులుగా అమ్మివేయబడ్డారు. బానిసలుగాపట్టుబడ్డ 96%మంది ఆఫ్రికన్లను దక్షిణ అమెరికా, కారీబియన్ దీవులకు నౌకలలోనూ, ఓడలలోనూ సరుకులనూ, జంతువులనూ కిక్కిరిసినట్టుగా పేర్చి తరలించేవారు.
బ్రిటన్‌లోని ఎవాంజిలికల్ ఇంగ్లీష్ ప్రొటేస్టెంట్స్ కార్యర్ర్తలు తొలుత బానిసవ్యాపారానికి వ్యతిరేకంగా 1787లో ఉద్యమించారు. ఇరవై సంవత్సరాల తదుపరి బ్రిటన్ పార్లమెంటు సభ్యుడైన విలియం వెల్బీఫోర్స్ చొరవ కృషిల మేరకు పార్లమెంటులో “బానిస వ్యాపార రద్దు’ చట్టాన్ని 25 మార్చి1807 సంవత్సరం‌లో ఆమోదించింది.
ఈ చట్టం అమలైన తేదీ సంస్మరణగా ఐక్యరాజ్య సమితి ఈతేదీని బాధితబానిసల సంస్మరణ మరియు అట్లాంటిక్ సముద్రానికి అవతలి బానిసవ్యాపార నిర్మూలనా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవలసిందిగా సభ్యదేశాలను కోరింది. ‘ఆర్క్ ఆఫ్ రిటర్న్’ అనే సంస్మరణా స్థలిని ఐక్యరాజ్య సమితి ఆవరణలో గత సంవత్సరం ఆవిష్కరించారు.

కొలంబస్‌తో ప్రారంభమైన అణ్వేషణా యాత్ర ప్రపంచవ్యాప్తంగా మానవుని జీవన విధానం‌లో అనూహ్యమైన మార్పులు తెచ్చిందనేది తిరుగులేని వాస్తవం. ఎంతమాత్రమూ విస్మరించలేని నిజం, అలాగే చీకటి ప్రాంతాలుగా పిలువబడే రెండుఖండాలను కోలుకోలేనివిధంగా పాతాళానికి తొక్కేసిన విషయం కూడా విస్మరించలేని విషయం.

బానిసవ్యాపారానికి బలైన వారికోసం మౌనం పాటిస్తూ అటువంటి వ్యవస్థను తిరిగి ఏరూపం‌లోనూ కొనసాగనివ్వబోమని ప్రకటిద్దాం.

 


హోళీ యొక్క ఆచారాలు మరియు ప్రాముఖ్యత.!
.
మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగలలో హోళీ ఒకటి . ఈ పండుగ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. చంద్రమానం ప్రకారం మాస నిర్ణయం రెండు పద్దతులుగా చేస్తారు. మొదటి పధ్ధతి ప్రకారం పౌర్ణమితో నెల పూర్తయి, మరుసటి రోజునుంచీ కొత్త మాసం మొదలవుతుంది. దీన్ని‘పూర్ణి మంత' విధానం అంటారు.ఈ ప్రకారం ఫాల్గుణ పున్నమితో సంవత్సరం ముగిసి మరుసటి రోజునుంచి వసంత ఋతువు ప్రవేశంతో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. వసంతాగమనాన్నీ, కొత్త సంవత్సరాన్నీ ఆహ్వానిస్తూ చేసుకునే పండుగ కనుక ఈ పండుగని వసంతోత్సవం అని కూడా అంటారు.
మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగలలో హోళీ ఒకటి . ఈ పండుగ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. చంద్రమానం ప్రకారం మాస నిర్ణయం రెండు పద్దతులుగా చేస్తారు. మొదటి పధ్ధతి ప్రకారం పౌర్ణమితో నెల పూర్తయి, మరుసటి రోజునుంచీ కొత్త మాసం మొదలవుతుంది. దీన్ని‘పూర్ణి మంత' విధానం అంటారు.ఈ ప్రకారం ఫాల్గుణ పున్నమితో సంవత్సరం ముగిసి మరుసటి రోజునుంచి వసంత ఋతువు ప్రవేశంతో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. వసంతాగమనాన్నీ, కొత్త సంవత్సరాన్నీ ఆహ్వానిస్తూ చేసుకునే పండుగ కనుక ఈ పండుగని వసంతోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ గురించి రక రకాలైన కథలు ప్రాచుర్యంలో వున్నాయి. వాటిల్లో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడూ, అతని తండ్రి హిరణ్య కశిపుల గురించిన కథ ముఖ్యమైనది. హిరణ్య కశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హరి భక్తి నుంచి దూరం చేయలేక, కుపితుడై అతడిని చంపదలచి చితిపై తన సోదరి హోళిక వొడిలో కూర్చోనమని కుమారుని ఆదేశిస్తాడు. మంటల్లో ప్రవేశించినా దహనం కాని విధంగా వరం పొందిన హోళిక నూ, ఆమె ఒడిలోని ప్రహ్లాదుడినీ అగ్ని ముట్టడిస్తుంది. ప్రహ్లాదుని నిర్మల భక్తికి మెచ్చిన నారాయణుడు అతడిని కాపాడగా, వరాన్ని పొందిన హోళిక ఒంటరిగా కాకుండా మరొక వ్యక్తితో కలిసి అగ్నిలో ప్రవేశించినందున అగ్ని దేవుని ఆగ్రహానికి గురై దహనమై పోతుంది. ఆనాటినుంచి నలుగురూ గుమిగూడే ఆవరణలో పెద్ద భోగిమంటను వెలిగించి హోళికను దగ్ధం చేస్తూ చెడుపై మంచి సాధించే గెలుపునీ , భగవంతుని పట్ల భక్తునికి గల అవిరళ భక్తి పొందే విజయాన్నీ పండుగగా జరుపుకోవడం మొదలైనదని చెప్పుకుంటారు. హోళి రోజున ‘హోళికా దహనం' పేర పనికిరాని పాత సామానులనీ కాగితాలనీ మంటల్లో వేసి కొత్త భావాలకూ, మంచి మార్పులకూ స్వాగతం పలుకుతారు.
.

ఆంద్ర ప్రదేశ్ ,కర్నాటక లలో హోళీ పండుగ నాడు బడికి సెలవు . తెలంగాణా ప్రాంతంలో,హైదరాబాదులో హోళీ సంరంభం మిన్నంటే ఉత్సాహంతో ఒక రోజు ముందు నుంచే మొదలవుతుంది . కర్నాటక గ్రామ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి వంటచెరకు పోగు చేసి ' కామ దహనా'నికి వాడడం,చందాలు వసూలు చేసి ఉత్సవానికి ఖర్చు చేయడం పరిపాటి. ఈ రంగుల పండుగ ముఖ్యంగా హిందువులదే అయినా ఈ పండుగ జరుపుకోవడం లో మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాల వారూ ఉత్సాహంతో పాల్గొంటారు. హోళీ సంబరాలు జరుపుకునే వేళ వయసు, స్త్రీ పురుష వ్యత్యాసం,హోదా ,కుల మత భేదాలకు సంబంధించిన సామాజిక కట్టు బాట్లలో సడలింపు కనిపిస్తుంది. ధనిక ,పేద వర్గ విభేదాలు మరచి హిందువులంతా కలసి మెలసి ఈ పండుగ జరుపుకుంటారు. పాత చీపుర్లూ, తట్ట బుట్టలూ, పనికిరాని చెక్క వస్తువులూ , కాగితాలూ , రాలిన ఎండుటాకులూ కుప్పగా పేర్చి దహనం చేస్తారు. హోళీ మంట తర్వాత మిగిలిన భస్మాన్ని బొట్టుగా ధరించి శరీరానికి పులుముకుంటారు. కొత్త చిగుళ్లకూ నవ చైతన్యానికీ స్వాగతం పలుకుతారు.






23 మార్చ్ అక్కన్న మాదన్నల వర్ధంతి (1687)

పదహారశతాబ్దం‌ ఏడు ఎనిమిది దశకాల్లో సుల్తనేట్ పరిధిలోని గోల్కొండ సామ్రాజ్యం‌లో అక్కన్న మాదన్నలు అత్యంత ప్రముఖులు. వీరి ఇంటిపేరు పింగ్లే యనీ (ఇక్కడ పింగళిగా పిలుస్తారు) పూర్వీకులు మరాఠానుండి హన్మకొండకు వలసవచ్చి స్థిరపడినవారనీ చెబుతారు, వీరు స్మార్త నియోగి బ్రాహ్మణులు. (స్మార్త విశ్వాసులు శాఖాహారులు, శివ, వైష్ణవ, సూర్యులను సమానంగా కొలుస్తారు. కాకతీయ త్రికూటదేవాలయాల్లో ఈ దేవతలే కొలువై ఉండేవారు), వీరు భక్తరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నకు మేనమామలు. గోల్కొండ సామ్రాజ్యం‌లో గుమాస్తాగా నియామకమైన మాదన్న తన చిత్త శుధ్ది, అంకితభావం, విశ్వసనీయతలతో అనతికాలం‌లోనే ఉన్నతస్థానాలను చేరుకుంటాడు. తనతోపాటే సోదరుడు అక్కన్నకు కొలువు ఇప్పిస్తాడు.

గోల్కొండ సంపదపై కన్నేసి, ఆక్రమణకు సిధ్ధంగానున్న ఔరంగాజేబును వీలైనంత దూరంగా ఉంచడంకోసం ఢిల్లీకి చెల్లించాల్సిన కప్పాన్ని క్రమంతప్పకుండా చెల్లించేవాడు. అందుకోసం పన్నువసూళ్లను క్రమబద్దీకరించాడు. రైతునుండి వసూలైన పన్ను మధ్యస్థాయి అదికారులవద్ద ఆగిపోకుండా నేరుగా ఖజానాకు చేరేవిధంగా పరిపాలనను సంస్కరింఛాడు. పరమత ద్వేషియైన ఔరంగాజేబుకంటే పరమతసహనాన్ని ఆచరించే గోల్కొండ రాజుల పాలనలోనే తెలుగు రాజ్యం సుభిక్షంగా ఉంటుందని భావించి అవసరమైనప్పుడు మద్దతుపొందడానికి శివాజీతో అబుల్హసన్ తానాషాకు సంధికుదురుస్తారు. ఈవిషయం తెల్సుకున్న ఔరంగాజేబు అక్కన్న మాదన్నలను తానాషానుండి వేరుచేయడానికి మాయోపాయాలు పన్నుతూనే హిందువులకు ముఖ్యస్థానాలను కట్టబెట్టిన తానాషాను ఇస్లాంద్రోహిగా ప్రకటించి గోల్కొండపై యుధ్ధ్దాన్ని ప్రకటిస్తాడు. కొందరు సైన్యాదిపతులను లోబరచుకొని అక్కన్న మాదన్నలను హత్యచేయించి కోటలోదూరి తానాషాను బందీగా తీసుకువెళ్తాడు. అక్కన్న మాదన్నల తలలను తనతో ఢిల్లీకి తీసుకువెళ్ళి సభికుల కేరింతలమధ్య ఏనుగులతో తొక్కిస్తాడు.

మాతృభూమి సుభిక్షతకోసం అహిర్నశలూ శ్రమించి, రాజ్య రక్షణకోసం శ్వాసించిన అక్కన్నమాదన్నలు ఔరంగాజేబు సామ్రాజ్యవాద విస్తరణలో అసువులుబాశారు.

హిందూ, ఇస్లామిక్ క్యాలెండర్‌ల మధ్య తేడాలుండటంతో వీరు మరణించిన తేదీలు మరో రెండున్నాయి. పలు కోణాల్ళొ చరిత్రను పరిశోధించిన యస్ యం ప్రాణ్ రావుగారి “మహామంత్రి మాదన్న’ చారిత్రిక నవలాధారంగా ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. పలు అంశాల్లో పలుకోణాల్లో ఇంకా పరిశోధన, చర్చ జరగాల్సిఉంది. మీకు తెలిసిన విషయాలను మిత్రులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

అక్కరాజు/ అక్కిరాజు ఇంటిపేరుగలవారు అక్కన్న వారసులనీ, మాదరాజు/మాదిరాజు ఇంటిపేరుగలవారు మాదన్న వారసులనీ తెలుగురాష్ట్రాల్లో చెప్పుకుంటారు.
హైద్రాబాద్‌ హరిబౌలి ప్రాంతం‌లో అక్కన్న మాదన్నలు నిర్మించిన మహంకాళీ దేవాలయం ప్రసిధ్ధిగాంచింది. ఈదేవాలయం సుమారు 70 సం. క్రితం పునరుధ్ధరించబడింది. ఇక్కడ నిర్వహించబడే బోనాల పండుగ మిక్కిలి పేరుగాంచింది. గోల్కొండకోటలో అక్కన్న మాదన్నల కార్యాలయాలను ఇప్పటికీ చూడవచ్చు.
 



హోలీ , (22-03-2016)
ప్రకృతికాంత నూతన శోభను సింగారించుకొని కన్నుల పండువైనప్పుడు ఆమెకు స్వాగతం పలకడం భారతీయులు అనాదిగా అనుసరిస్తున్న ఆచారం. ఈ ఆచారపు ఆనంద స్వరూపమే 'హోలీ'. అమితోత్సాహంతో జరుపుకొనే హోలీని 'ఫాల్గుణోత్సవం' అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ ఉత్సవాన్ని మదనోత్సవంగా, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. 'హోలీ' పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం. కృతయుగంలో శిశుఘాతినియైన హోలిక అనే రాక్షసిని రఘునాథుడనే పాలకుడు సంహరించిన ఉదంతాన్ని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించినట్లు భవిష్యత్‌పురాణం చెబుతోంది.
హొలీ అనేది రంగుల పండుగ. వసంతోత్సవం లేదా కామునిపండుగ అని కూడా పిలుస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు.
హోలీ...రంగుల కేళీ!
ఫాల్గుణమాసం... పౌర్ణమిసమయం... చల్లగాలులు వేడెక్కే వేళ... లేలేతచిగుళ్లతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్నీ వసంతరాగాలతో పులకిస్తుండగా... హోలీ వచ్చేస్తుంది... రంగుల వసంతాన్నీ ఆనందాల తుళ్లింతల్నీ వెంటేసుకుని.
చిన్నాపెద్దా అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ రంగునీళ్లల్లో తడిసిముద్దవుతూ కేరింతలతో తుళ్లిపడుతూ చెమ్మకేళీలు ఆడుకునే ఆనందాలహేలే హోలీ లేదా రంగ్‌పంచమి లేదా కాముని పున్నమి. దసరా, దీపావళి మాదిరిగానే దేశవ్యాప్తంగా ఈ సంబరం జరుపుకోవడం విశేషం. పౌరాణిక ప్రాశస్త్యంలో ప్రాంతాలవారీగా తేడాలుంటే ఉండొచ్చుగాక... జరుపుకునే పద్ధతి మాత్రం దాదాపుగా ఒకటే.
మనదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్‌, గయానా, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, మారిషస్‌, ఫిజి దేశాల్లోనూ ఏటా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
రాధాకృష్ణుల చెమ్మకేళి!
బ్రజ్‌ ప్రాంతంలో హోలీ అంటే ప్రేమబాసలూ చిలిపి తగవులూ అయితే మధుర, బృందావనం, నందగావ్‌, బర్సానాల్లో ఈ వేడుక తీరే వేరు. సుమారు 16 రోజులపాటు హోలీ జరుగుతుంది. నందగావ్‌ని శ్రీకృష్ణజన్మస్థలంగానూ బర్సానాని రాధ పుట్టిన ఊరుగానూ భావించి అక్కడ పండగ చేసుకుంటారు. వీళ్లిద్దరి ప్రేమబాసలూ చిలిపితగవులూ అక్కడి జానపదసాహిత్యంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వాటిని ప్రతిబింబిస్తుంది అక్కడి హోలీ పండగ. నందగావ్‌ కృష్ణులు బర్సానాలోని రాధారాణి ఆలయం దగ్గర జెండా పాతి మాదే విజయం అన్నట్లుగా గేలిచేస్తుంటే లావుపాటి కర్రలతో వాళ్లను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు బర్సానా రాధలు. చివరిరోజున ఇరుపక్షాలూ రంగులు చల్లుకోవడంతో ఈ వేడుక ముగుస్తుంది. అందుకే ఈ వేడుకను 'లాత్‌మార్‌ హోలీ' అంటారక్కడ. అంతేకాదు, పాలమీగడవంటి రాధ ఒంటిఛాయతో తన శ్యామవర్ణాన్ని పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటే యశోద రాధ వెుహానికి ఇంత రంగుపూసిందనీ అలా ఈ పండగ వెుదలైందనీ చెప్పే కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి.
హోలికాదహనం
ఇక ఉత్తరభారతంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుందనడానికి సూచనగా ఈ పండగ చేసుకుంటారు. అందుకే హోలీకి ముందురోజు హోలికా దహనం చేస్తారు ప్రహ్లాదుడిని స్మరిస్తూ.
ప్రహ్లాదుడినోట హరినామస్మరణ వినలేని హిరణ్యకశిపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తుంటాడు. ఏదీ ఫలించక చివరకు విసిగిపోయి హోలిక(ప్రహ్లాదుడి అక్క)ఒడిలో కూర్చుని మంటలకు ఆహుతి కమ్మని ఆజ్ఞాపిస్తాడు. హోలిక కప్పుకున్న కంబళికున్న శక్తులవల్ల ఆ మంటలు ఆమెనేమీ చేయలేవు. కానీ ఆశ్చర్యకరంగా ఆ కంబళి జారి ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. హోలిక చనిపోతుంది. అందుకే దానికి హోలికాదహనం అని పేరు.
హోలీని జాతీయ పండగగా జరుపుకునే నేపాల్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా పాల్గొంటారు. తేజోవంతమైన ఈ పండగ దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు వాళ్లు. ఈ పండగజాడలు పలు ప్రపంచదేశాల్లోనూ వివిధపేర్లతో కనిపిస్తున్నాయి.
పేర్లు వేరయినా, పూజలూ ప్రసాదాలూ పిండివంటలూ వేరయినా, జరుపుకునే పద్ధతులు వేరయినా రంగుల పండగలోని పరవోద్దేశం ఒక్కటే... చలికాలం వెళ్లి వేసవి వచ్చే వేళలో వసంతరుతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలీ. వాతావరణం మారే ఈ సమయంలో జ్వరాలూ జలుబులూ వచ్చే అవకాశం ఉంది. అవేమీ రాకుండా ఉండేందుకే వేప, బిల్వ, అగ్నిపూలు... వంటి ఔషధగుణాలున్న ఆకులూ పువ్వుల పొడుల్ని పసుపూ కుంకుమలతోపాటుగా నీళ్లలో కలిపి చల్లుకునే ఈ వేడుక పుట్టుకొచ్చిందన్నది ఆయుర్వేద పండితుల విశ్లేషణ. ఎందుకంటే ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. తరవాత చలువచేసే పానీయాలు తాగి మిఠాయిలు తింటారు. మనదగ్గర శ్రీరామనవమికి బుక్కాపిండి, పసుపునీళ్ల వసంతాల్ని చల్లుకోవడం కూడా ఈ కోవకు చెందినదే.
అయితే ఆనాటి ఆరోగ్యకరమైన సంప్రదాయం క్రమంగా రంగులపండగగా మిగిలిపోయింది. వసంతంలో విరబూసే పూలచెట్లు క్రమంగా అంతరించిపోవడంతో కృత్రిమరంగులు ఆ స్థానాన్ని భర్తీచేశాయి. దాంతో ఈ పండగ ప్రమాదకరంగానూ మారింది. కృత్రిమరంగులవల్ల చర్మక్యాన్సర్లు, ఎలర్జీలు, కళ్లు దెబ్బతినడం వంటి నష్టాలెన్నో. ఇటీవలఆరోగ్యస్పృహ పెరగడం, రంగుల్లోని విషపదార్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో సేంద్రియ రంగులతోనే... చెమ్మకేళీ అంటున్నారంతా. అదే జరిగితే హోలీ... అందరికీ ఆనందాన్ని పంచే అసలు సిసలైన రంగులకేళి!



22 మార్చి ఘులాం యాజ్దానీ జయంతి (నిజాం రాజ్య పురావస్త్తు శాఖ వ్యవస్థాపకులు)

మనవారసత్వం గురించి ఘనంగానూ, గర్వంగానూ చెప్పుకుంటాం, కానీ ఆవారసత్వసంపదను గుర్తించి, వెలుగుకుతెచ్చి, పరిరక్షించినవారిగురించి తరచుగా విస్మరిస్తాం. బీదర్ జిల్లా వారసత్వ సంపదతోపాటు అజంతా, ఎల్లోరాలను గుర్తించి ప్రపంచానికి తెల్యజెప్పిన నాటి నిజాం రాజ్య పురావస్తు సంచాలకుడు పద్మ భూషన్ ఘులాం యాజ్దానీకీ ఇదే అన్యాయం జరిగింది.

ఢిల్లీలో 1885లో జన్మించిన యాజ్దానీ 1914లో హైద్రాబాద్ రాజ్యానికి పురావస్తు శాఖ సంచాలకులుగా ఉపనియామకం (డెప్యుటేషన్) పై నియాకమైనాడు. మూడుదశాబ్దాలకాలం పనిచేసిన యాజ్దానీ నిజాం రాజ్యం‌లో పురావస్తుశాఖను ఏర్పరిచి అభివృధ్దికి విశేషమైన కృషిచేశాడు. తొలిసారిగా 1915లో బీదర్‌ను సందర్శించిన యాజ్దానీ రూ 36 వేలతో హైద్రాబాద్‌నుండి బీదర్‌వరకు రహదారిని నిర్మించాడు. బీదర్‌లొని పురావస్తు క్షేత్రాల పునరుధ్ధరణకోసం ఆయన ప్రతిపాదించిన రూ 2 లక్షల అంచనా వ్యయాన్ని నిజాం ఎటువంటి కోతలులేకుండా ఆమోదించాడు. బీదర్ పరిసరాల్లోని అజంతా, దౌలతాబాద్ వంటి పలు చారిత్రిక ప్రదేశాలను వ్యక్తిగత శ్రధ్ధతో ఘులాం యాజ్దానీ పునరుధ్ధరించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుండీ క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అతని కృషిని గుర్తించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం “ ఓ బీ యి (ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్) బిరుదును ప్రదానం చేసింది.

యాజ్దానీ రాసిన “బీదర్- చరిత్ర, కళాఖండాలు” అనే పుస్తకం నేటికీ ప్రపంచవ్యాప్తంగా లలితకళా విద్యార్ధులకు ప్రధాన గ్రంధం.
తదుపరి తరాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలైన హరూన్ ఖాన్ షేర్వానీ, మహదేవ్ జోషి, ఏకే కులకర్ణి, ట్యుటోనికో డె’ సౌజా, యం ఏ నయీంలకు యాజ్దానీ తొలి గురువు. వీరందరి సమిష్టి కృషితో ‘మధ్య దక్షీణ దేశ చరిత్ర’ వెలుగులోకి వచ్చింది.

నిజాం రాజ్యం‌లోని చారిత్రిక ప్రదేశాలను ప్రపంచానికి తెల్యజెప్పిన ఈ మహనీయునికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అందవలసిన గౌరవం దక్కలేదు. పురావస్తు, చారిత్రిక కార్యాలయాలలో ఒక్క దానికికూడా ఇతని పేరు పెట్టకపోవడం విచారకరం.

అనేక ప్రభుత్వ సంస్థలు ఇప్పటికీ ఉమ్మడి (రాష్ట్రల) సంస్థలుగానే ఉండటంవల్ల తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలకు చెందిన పేర్లను చేర్చలేకపోతున్నామని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

అతని జయంతి సందర్భంగా ఘులాం యాజ్దానీని స్మరించుకోవడం మన కనీస కర్తవ్యం.


 
21 మార్చి అంతర్జాతీయ వర్ణవివక్ష నిర్మూలనా దినోత్సవము
దక్షిణాఫ్రికాలోని షర్పెవిలే అనే నగరం‌ళొ వర్ణవివక్షా చట్టానికి వ్యతిరేకంగా మార్చి 21వ తేదీ (1960)న నల్ల జాతీయులు చేస్తున్న ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 69 మంది అక్కడికక్కడే మరణించారు. వర్ణవివక్షణను నిరసిస్తూ ఆ సంఘటన సంస్మరణార్ధం దక్షిణాఫ్రికాలో సెలవుగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షాదినంగా జరుపుకోవాలని 1966లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను కోరింది.
ప్రత్యక్షంగా వివక్షలేవీ కన్పించనప్పటికీ అనేక ప్రత్యామ్నాయ రూపాల్లో నేటికీ అది కొనసాగుతూనే ఉంది. ఈర్షాసూయ ద్వేషాల్లెని శాంతియుత సమాజాన్ని నిర్మించాలంటే జాతి వివక్షతతోపాటు కుల మత లింగ వర్ణ వివక్షతలను సైతం పారదోలాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

 
రపంచ నిద్రా దినోత్సవం World Sleep Day 2016 (మార్చినెల రెండవ పూర్తివారం‌లో శుక్రవారం)

నిద్ర, ప్రపంచ వ్యాప్తంగా పలువురికదొక వ్యధ. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతోపాటు ఆస్తులు, అంతస్తులు, సతీ, సుతుల్ అందరూ ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 45% మంది నిద్రాదేవి ఆదరణను నోచుకోవడం లేదు. ‘నిద్రలేమి’ ప్రాంత, వర్ణ, జాతి, వయోభేదాలు లేకుండా ప్రపంచాన్నంతా పీడిస్తున్న ఏకైక వ్యాధి. మనోవ్యధలూ, తనూ (తనువు) బాధలూ అన్నీ ఆ దేవత నిరాదరణ వల్లనే. మనోరుగ్మతలకూ, తనూ రుగ్మతలకూ ప్రగాఢ నిద్రయే దివ్యావౌషధమని, నిద్రను ఆహ్వానించి, ఆస్వాదించినప్పుడే ఆనందంగానూ, ఆరొగ్యంగానూ ఉంటామని ప్రపంచ నిద్రా ఔషధ సమాజంవారు ప్రకటిస్తున్నారు. ప్రగాఢ నిద్రతోనే ప్రపంచ శాంతి, సౌభాగ్యవంతమైన సమాజం విలసిల్లుతాయని ఈ సమాజం ప్రవచిస్తూంది. నిద్రను అవగతం చేసుకోవడమూ, నిద్రాలేమిని నివారించడమూ అన్నీ మనం నిద్రను అర్ధం చేసుకోవడం‌లోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచ నిద్రా సమాజం 2008 నుండి మార్చినెల పూర్తి రెండవ వారం‌లో శుక్రవారం రోజున సుఖ నిద్ర ఆవశ్యకతను ప్రపంచం దృష్టికి తేవడంకోసం “ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నది. “ సుఖ నిద్ర మనం అందుగలిగే స్వప్నం” అనే నేపధ్యంతో 2016 నిద్రా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవ తేదీ గురించి కొంత వివరణ అవసరం. మార్చి నెల 1వతేదీ ఆదివారంతో మొదలౌతే నిద్రాదినోత్సవం రెండవ శుక్రవారం అంటే 13వ తేదీన జరుపుకుంటారు ( ఇది 2015 సం.లో సంభవించింది). సోమవారంతో 1వ తేదీ ప్రారంబమౌతె 19 వ తేదీన నిద్రా దినోత్సవం జరుపుకుంటారు (ఇలా 2010లో సంభవించింది). అంటే ప్రపంచ నిద్రా దినోత్సవం మార్చినెలలో 13 వ తేదీనుండి 19వ తేదీలతేదీల మధ్యలో (రెండు తేదీలను కలుపుకొని) సంభవిస్తుంది.

ఆయుర్వేదం‌లో నిద్ర
సౌభాగ్యవంతమైన జీవితానికి నిద్ర మూలసథంభం వంటిది. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యం. నిద్రావస్థలోనే శరీరం అరోజులో జరిగిన చిన్నచిన్న ఇబ్బందులను మరమ్మత్తులను చేసుకుంటుంది. సంపూర్ణ నిద్రలోనే మెదడు భావోద్వేగాలూ సమతుల్యతను సాధిస్తాయి.

యునానీ వైద్యం లో నిద్ర
మానవుడి ఎదుగుదలకు అవసరమైన పోషక పధార్ధాల సంస్లేషనం, కండరాల పెరుగుదల, జీవకణాల మరమ్మత్తు, హార్మోన్ల విడుదల వంటివన్నీ నిద్రావస్థలోనే జరుగుతాయి

నిద్రలేమికి కారణభూతాలు: వృధ్యాప్యం, కాలాతీత భోజనం, శారీరక పరిసరాల పరిశుభ్రత లోపించడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ధూమ మధ్యపానాలు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం.

నిద్రలేమితో మనదేహం‌లో ప్రారంభం‌లో కొలువయ్యే అవాంచిత అతిదులు
మానసిక కుంగుబాటు, తెలియని భయం, ఉద్వేగం, నొప్పి, పనిని దాటవేయడం లెదా అతిగాపనిచేయడం వంటి రుగ్మతలు సంభవిస్తాయి

మనకు సంభవించే వ్యాధులకు ముందుగా సుఖనిద్రతో చికిత్సతో ప్రారంభిద్దాం. సగటు మానవుడికి రోజూ 6-8 గంటల నిద్ర అవసరం. సుఖనిద్రకోసం ప్రపంచ నిద్రా ఔషధ సమాజం వారు సూచించిన కొన్ని చిట్కాలు:

ఆహారానికీ నిద్రకుమధ్య కనీసం రెండుగంటల తేడా ఉండాలి. అంటే మనం పడుకొనే సమయానికి ఆహారం సగం జీర్ణం కావాలి. తీసుకునే ఆహారంవిషయం‌లోను కొన్ని నియమాలు (చిత్రం‌లో చూడండి)

తినేటప్పుడు, నిద్రకుపక్రమించడానికి కనీసం అరగంటముందు అన్ని రకాల ఎలక్ట్రానిక్/సమాచార ఉపకరణాలకు (టీవీ, కంప్యూటర్, టాబ్, మొబైల్) ముఖ్యముగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. ఈ సమయం‌ కుటుంబ సభ్యులు, ఆత్మీయ సన్నిహితులతో గడపండి. అవకాశముంటే ఫోన్లను ఆపేయండి లేదా నిశ్శబ్ద స్థితిలో ఉంచండి.

నిద్రకు ముందు కొంత సమయంపాటు కళ్ళు మూసుకొని సుందరదృశ్య్యాన్ని లేదా మీ ఆరాధ్య దైవాన్ని తలచుకొండి.

ఇవన్నీ పాటిస్తే సుఖనిద్ర మీ సొంతం. మూడొంతుల ఆరోగ్యం మీ డిపాజిట్. ఈ విషయాలను మన ఆప్తులు, ఆత్మ్మీయులతో చర్చించి ఆచరణ ప్రారంభిద్దామా?



13 మార్చి బూర్గుల రామకృష్ణారావు జయంతి (11 Mar Birth Anniversary of Burgula Ramakrishna Rao)

బూర్గుల రామకృష్ణరావు 1899 మార్చి 13న జన్మించారు. వీరి ఇంటి పేరు పుల్లంరాజు వారైనప్పటికీ స్వగ్రామమైన బూర్గుల పేరుతోనే వీరు ప్రఖ్యాతిగాంచారు.

బూర్గుల రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. మరాఠీ, కన్నడిగ, తెలంగాణా ప్రాంతాలతో కూడిన హైదరాబాదు రాష్ట్రానికి ప్రజలతో ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి.

హైదరాబాదు హైకోర్టులో న్యాయవాది జీవితం ప్రారంభించి అగ్రస్థాయికిచేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైనవారితో కలసి ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం‌లలో పాల్గొన్నారు. రావిచెట్టు రంగారావు స్థాపిత తొలి తెలుగు గ్రంధాలయమైన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు కార్యదర్శిగానూ, అధ్యక్షుడిగానూ సేవలందించారు.

హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. నల్గొండ జిల్లా దేవరకొండలో (1931) జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు ఆయన అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలలో పాల్గొని కారాగారంపాలైనాడు. పోలీసు చర్య (1948) తరువాత వెల్లోడి ముఖ్యమంత్రిగా ఏర్పడిన సైనిక ప్రభుత్వం‌లో బూర్గుల రెవిన్యూ, విద్యాశాఖల మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.

హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ఎన్నికలు (1952)జరిగాక ఏర్పాటైన ప్రజాప్రభుత్వంలో పూర్తి మెజారిటీ లేకున్నప్పటికీ, మంత్రివర్గ సహకారం లోపించినప్పటికీ పరిపాలనదక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.

హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, కోస్తా, రాయలసీమలతో కలిపి (1956లో) ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినపుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో బూర్గుల తొలుత కేరళకూ, తదుపరి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా 1948లో హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం (నిజాం అప్పుడు రాజ్‌ప్రముఖ్) ఆదేశాలు ధిక్కరించి అందరికన్నా ముందే సందర్శించి ఆగ్రహానికి గురయ్యారు. అప్పుడే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసిన విధానం ప్రశంసనీయ మైనది. రాజకీయ రంగంతోపాటు సాంఘిక సాంస్కృతికరంగాల్లో వీరి సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజంలకు అధ్యక్షులుగానూ, చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగానూ ఎనలేని సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యునిగానూ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్‌ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.

బూర్గుల చేసిన పలు రచనలలో ‘పారశీక వాఞ్మయ చరిత్ర’ పేరు పొందినది. వీరు రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' సంపుటిగా ప్రచురితమైంది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), అనేక గ్రంథాలు వెలువరించడమే కాక ఎన్నో కావ్యాలకు పీఠికలతోపాటు పలు అనువాద రచనలు కూడా చేశారు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యారు.

తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రా తెలంగాణాల విలీనాన్ని కాంగ్రేస్ పార్టీ అధిష్టానం ప్రోద్బలంతో అంగీకరించి అపవాదును మూటగట్టుకున్నారు

సాహిత్య, సాంస్కృతిక, ప్రజా, న్యాయ శాస్త్ర, గ్రంధాలయోద్యమ రంగాలలో అయన చేసిన కృషికి ప్రశంసాపూర్వకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం 1953లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టానూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం 1956లో డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టానూ అందజేసి తమను తాము గౌరవించుకున్నాయి.
సాహిత్య, రాజకీయ, ప్రజాసేవ, గ్రంధాలయ రంగాలకు జీవితాన్ని అంకితం చేసి తన 68వ ఏట సెప్టెంబర్ 14 (1968) న మరణించిన ఈ మహనీయుడికి నివాళులర్పించడం మనందరి కనీస విధి.



12 మార్చ్: పిడికెడు ఉప్పు- తట్టెడు మట్టి

భారత జాతీయ కాంగ్రేస్ 1929లో దేశానికి 26 జనవరి 1930 తేదీన సంపూర్ణ స్వాతంత్రమివ్వల్సిందేననీ తీర్మానించి ఆరోజున దేశమంతా స్వాతంత్ర్యం జరుపుకున్నారు. ఇందుకుకిట్టని బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలు తయారుచేసుకొనే ఉప్పుమీద పన్ను విధించింది. ఉప్పుచేసుకొనేవారినుండి బలవంతంగా పన్ను వసూలుచేయడం లేదా నిర్భందించడమో చేశారు. వీటన్నింటింకి పౌరోల్లంఘనమే (సివిల్ డిజ్ఒబీడియంస్) మాత్రమే సరియైన మార్గమని భారత పౌరులు భావించారు. ప్రజల్లో రేకెత్తుతున్న వ్యతిరేకతను గుర్తించిన గాంధీ పౌరోల్లంఘనద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి సమాధానమివ్వడానికి సమయం ఆసన్నమైందనీ, ప్రజలనుముందుకు నడిపింఛాలనీ నిశ్చయించుకున్నాడు.

మానవ జీవితానికి ఉప్పు అత్యంత అవసమైన లవణం. దీని తయారీపై పన్ను వేయడమంటే ప్రత్యక్షంగా ఉప్పు రైతులను, పరోక్షంగా ప్రజలపై ఆర్ధిక భారన్ని మోపడమె. భారత జాతీయ కాంగ్రేస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించాలనీ, ఇందుకు గాంధీజీ నాయకత్వం వహించాలనీ తీర్మానించింది. ఈ కార్యక్రమ జనసమీకరణకు వెళ్ళిన సర్దార్ వల్లభాయీ పటేల్‌ను బ్రిటిష్ప్రభుత్వం మార్చి 7వ తేదీన అదుపులోకి తీసుకున్నది.

12 మార్చి 1930: ఉదయం 6.30 గం. బక్కపలుచగానున్న 61 సం.ల వృధ్ధుడైన మహాత్మాగాంధీ పూజాదులు ముగించుకొని 78 మంది అనుచరులతో తన సబర్మతి ఆశ్రమం‌నుండి 390 కిమీ దూరం‌లోని సముద్రతీరానగల ఉప్పుక్షేత్రానికి పాదయాత్రన బయలుదేరాడు. ప్రతీ గ్రామం‌లో ప్రజలనుండి స్వాగతహారతులు అందుకుంటూ 24 రోజులు ప్రయణించి ఏప్రిల్ 5 రాత్రికి దండిక్షెత్రం చేరాడు. మరుసటి రోజు ఉదయం 6 గం.లకు ఒక ఉప్పుక్షేత్రం‌లో పిడికెడు ఉప్పు తీసుకొని ‘ప్రజల పిడికిల్లోని ఉప్పు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకిలించబోతున్నద’ని ప్రకటించాడు.

మహాత్ముడు ఆచరించిన అహింసాయుత సత్యాగ్రహ పోరాటమార్గం అమెరికాలో మొన్న మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్‌కూ, నిన్న దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాకు, నేడు తెలంగాణా అవతరణకూ మార్గదర్శకమైంది.

ప్రజాబీష్టనికి వ్యతిరేకంగా సీమాంధ్ర హైద్రాబాద్ రాష్ట్రాల విలీనం ఆరు దశాబ్దాలకాలం‌లో ఎంతో విషాదాన్నీ, విధ్వంసాన్నీ మిగిల్చింది. తెలంగాణా జీవనానికి ఆదరువైన చెరువుల పరిస్థితి తలచుకుంటే గుండె చెరువౌతుంది. గంగాళం‌లా నీటిని నిల్వచేసే చెరువులు తాంబాళలయ్యయి. చెరువుల నిర్వహణలేక భూగర్భ జలాలు అడుగంటటంతోపాటు తెలంగాణా వ్యవసాయరంగం అస్తవ్యస్తమైంది. ఆస్తులతోపాటు సాదుకోలేక కన్నబిడ్డలను సైతం అమ్ముకోవడం, గల్ఫ్ ప్రాంతాలకు వలసలు పోవడంతో తెలంగాణా అతలాకుతలం అయ్యింది. అణుబాంబుకంటే ఎక్కువ విధ్వంసాన్ని చవిచూసింది.

కాళొజీ, జయశంకర్‌ల సిధ్ధాంతమే ఆయుధంగా తెలంగాణా ప్రజలు కేసీఆర్ నాయకత్వం‌లో పుష్కరకాలం పోరాడి తెలంగాణాను సాధించుకున్నారు. తెలంగాణా బతుకుదెరువైన చెరువుల పూటికతీతనూ, పునర్నిర్మాణాన్నీ తెలంగాణా ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ పేరుతో చేపట్టింది.

మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని కేసీఆర్ తన 61వ ఏట ఇదేరోజు మార్చి 12 (2015)న సదాశివపేట (మెదక్‌జిల్లా) పాతచెరువునుండి లాంచనంగా ప్రారంభించారు.

ఎనభైఐదు ఏళ్ళక్రితం గాంధీజీ పిడికిల్లోని ఉప్పు బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలిస్తే, నేడు కేసీఆర్ తట్టెడుమట్టితో ప్రారంభించిన మిషన్ కాకతీయ తెలంగాణా కరువునూ, పేదరికాన్నీ పారదోలనుంది.
మిషన్ కాకతీయ కార్యక్రమాల్లో మన ప్రత్యక్ష ప్రమేయమేమీ లేకపోవచ్చు. పునర్నిర్మాణం, పూటికతీత జరిగే చెరువులవద్దకు మనమిత్రులు, కుటుంబ సభ్యులతో వెళ్ళి విశేషాలను తెల్సుకోవడం, చర్చించడం, చెరువుతో తెలంగాణా బతుక్కుగల అవినాభావ సంబంధాన్ని అర్ధంచేసుకోవడం, అర్ధం చేయించడం నేటి కర్తవ్యం.
పంచ భుతాల్లో ఒకటైన నీటి సం‌రక్షించి భావితరాలకు అందజేయడంకొసం జరుగుతున్న యజ్ఞమిది. ఇందులో భాగస్వాములు కావడానికి అందరం ప్రయత్నిద్దాం.


దేవులపల్లి కృష్ణశాస్త్రి
(కండ్లకుంట శరత్ చంద్ర)
కృష్ణశాస్త్రి కులం కోయిల కులం, కృష్ణశాస్త్రి మతం హృదయమతం.కృష్ణశాస్త్రి మార్గం స్వేఛ్చ మార్గం ! " నేను హృదయవాదిని, నాకు వేదాంతం,తర్కం తలకెక్కవ్ ! " అన్నారు కృష్ణశాస్త్రి. అప్పటివరకూ పద్యా కవిత్వమే కవిత్వం అనుకునే వారికి వచనంలోనూ కవిత్వం రాయగలమని నిరూపించిన కృష్ణశాస్త్రి. 1897 లో జన్మించినఈ కవి 'స్వేచ్చ'యే తన కవిత్వపు పునాదిగా చేసుకుని కవిత్వం రాసాడు. " ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై , ననులేత రెమ్మనై ,సెలయేటిలో పాటనై, తెరచాటు తేటినై , నీలంపు నిగ్గునై..." " జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అని రాముడు, లక్ష్మణునడితో అంటాడు . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ..." అంటాడు. దేవులపల్లి, దేశభక్తిని గుర్తుచేస్తూ.
1921 లో ఆరంభించి,1925 లో పూర్తి చేసిన అయన "కృష్ణ పక్షం" కవిత సుగంధాలు , నేటికీ ఇగిరిపోలేదు. మానవతావాదం , భక్తి వాదం ,దేశ భక్తి, వేదన, ప్రకృతి ఆరాధన ... ఇవీ అయన కవితలలోని అంశాలు.
రెండు ప్రపంచ యుద్దాల వల్ల ఏర్పడిన ఆర్దిక సంక్షోభాలు,1922 లో.. అంటే 25 ఏళ్ళ వయసులో భార్య మరణం , సామజికంగా అలముకున్న నిరాశ... ఇవన్ని ఆయన కవిత్వంలో విషాదలుగా ప్రతిబింభిస్తాయి.అందుకే P.B Shelley లాగా ఈయన కవిత్వంలో హృదయాన్ని తట్టే Melancholy వుంటుంది.ఈయనను ' ఆంధ్ర షెల్లీ' అని పిలవ సాగారు.
" కృష్ణపక్షం" లో వేదననూ, విషాదాన్ని పలికించాకా "ప్రవాసం" " ఊర్వశి" రాసాడు. 'హృదయనాళం తెగెయె, హృదయధనము తొలగిపోయెను,జీవిత ఫలము స్రుక్కి నేలబడె' అంటూ "కృష్ణ పక్షం" లో రాస్తే .. "పాటయై పక్షియై, ఆశయై,హయియై ,దేసదిసల మిరునో దివ్య పడమంటునో" అని రాసాడు. ఊర్వశి లో. "ప్రేయసి ! ప్రేయసీ ఓ యమవస్యా తమస్విని !గగన సీమంతునీ! నా సఖీ! నీ దీర్ఘాధమిల్ల నీ ల వల్లీచ్ఛాయ పోడిచికొని, నిదుర విడిచి పూవులు నేడు ..." అంటాడు " ప్రేయసీ !ప్రేయసీ !" అనే కవితలో .
1925 లో " కృష్ణపక్షం " రాగానే విమర్శకులూ, పద్యకవులూ ఈయన కవిత్వాన్ని చీల్చి చెండాడారు . కవిత్వాన్ని భ్రష్టుపట్టించాడన్నారు . నెలకు రెండు పక్షాలు . ఒకటి కృష్ణపక్షం రెండు శుక్లపక్షం. కృష్ణశాస్త్రి చీకటి నిండే కృష్ణ పక్షాన్ని తన కవితా సంపుటి పేరుగా పెట్టాడని .. అదంతా చెత్త కవిత్వమని చెప్పేలా ఒకాయన " శుక్లపక్షం " అనే వెక్కిరింపు కావ్యం రాసాడు. ఆ కావ్యం ఎవరికీ ఎక్కలేదు కానీ కృష్ణ పక్షం అజరామరమయ్యే కీర్తి సంపాదించుకుంది. కృష్ణ శాస్త్రి ఏనాడూ విమర్శకులకి సమాదానం ఇవ్వలేదు. యువకులు మాత్రం అయన కవిత్వపు శైలిని , ఆయన గిరజాల జుట్టు.. శాలువతో కూడిన అయన ఆకారాన్ని అనుకరించడం మొదలుపెట్టారు.
కృష్ణ శాస్త్రి గారు ఎన్నో సభలలో తియ్యగా కవిత్వ గానం చేసారు.1964లో ఆయన గొంతు ,కాన్సర్ వల్ల మూగదయ్యింది.ఐతే ఆయన కలం ఆగలేదు . కవిత్వ పరిమళాలను విరజిమ్మింది.ఆయన కవిత్వంపై ఎందరో పి.హెచ్.డి లూ చేసారు .మల్లేశ్వరిలో "ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు .." రాజమకుటంలో సడిసేయకోగాలి.' సుఖదుఃఖలలో " ఇది మల్లెల వేళాయని , ఇది వెన్నెల మాసమని ..." ఉండమ్మ బొట్టుపెడతాలో " రావమ్మా మహా లక్ష్మి రావమ్మా .." ఏకవీర లో "ప్రతి రాత్రి వసంత రాత్రి ,ప్రతి గాలి పైరగాలి " భక్తతుకారంలో " ఘన ఘన సుందరా కరుణా రసమందిరా ""శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో " నా పేరు బికారి నా దారి ఎడారి .." సీతా మహలక్ష్మిలో " మా విచిగురు తినగానే కోయిల పలికెన " గోరింటాకు లో " గోరింట పూచింది కొమ్మాలేకుండా " కార్తీకదీపం' ఇలా ఎన్నో సినిమాలలో హిట్ సాంగ్స్ .రాశి తక్కువే కానీ వాసి ఎక్కువ.
ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి "కళ ప్రపూర్ణ " కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పద్మభూషణ్ అవార్డు పొందారు.
1980 లో కృష్ణ శాస్త్రి మరణించినపుడు " తెలుగుదేశపు నిలువుటద్దం బ్రద్దలయ్యింది. షెల్లీ మళ్ళీ మరణించాడు . వసంతం వాడిపోయింది అన్నాడు శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రికి ఓ స్మృత్యాంజలి ఘటిస్తూ....
 




10 మార్చ్ కెంద్రీయ పారిశ్రామిక రక్షణా దళాల వ్యవస్థాపనా దినోత్సవం (10 Mar Central Industrial Security Forces Raising Day)

దేశ ప్రగతికి సరిహద్దుల రక్షణ ఎంత అవసరమో దేశం‌లోనున్న ఆస్తుల సమ్రక్షణ కూడా అంతే అవసరం. దేశప్రగతికి ఊతమిచ్చే మౌలిక సదుపాయాలను సమకూర్చే పరిశ్రమల పరిరక్షణ మరీ ముఖ్యం. మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56) ప్రాధమిక రంగమైన వ్యవసాయం పై కెంద్రీకరించగా రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామికీకరణపై (1956-61) దృష్టి సారించింది. పారిశ్రామిక మౌలిక రంగాలు 1961 వరకు నిలదొక్కుకున్నాయి. తదుపతి చైనా, పాకిస్తాన్ యుధ్ధ్దాలు, అమెరికా రష్యాల మధ్య ప్రచ్చన్న యుధ్ధం. ఈ పరిస్థితుల్లో ప్రజా రంగ సంస్థలు, ప్రైవేటు రంగ పరిశ్రమలను పరిరక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే ప్రతిపాదన బలంగా ఉండటం వల్ల పార్లమెంటు చట్టం ద్వారా 1969 సం. మార్చి నెల 10వతెదీనుండి కెంద్రీయ పారిశ్రామిక రక్షణ దళాల వ్యవస్థాపనను అమోదించింది.

సీ ఐ యస్ యఫ్ సిబ్బంది దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో భిన్న వాతావరణాల్లో నెల్కొల్పబడిన అణువిద్యుత్ కెంద్రాలు, రోదసీ కెంద్రాలు, కరెన్సీ ముద్రణా కెంద్రాలు, నూనె బావులు, నూనె పరిశుధ్ధి కెంద్రాలు, నౌకాశ్రయాలు, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాలు, విమానాశ్రయాలు, ధర్మల్, హైడ్రో విద్యుత్ కెంద్రాలవంటి 300 పైగా ప్రభుత రంగ సంస్థలకు రక్షణ కల్పిస్తూంది. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేటు రంగం‌లోని భారీ పరిశ్రమలతోపాటు పలురాష్ట్రాల శాసనసభా భవనాలకు, ప్రభుత్వ రనాణా సంస్థలకు సేవలందిస్తున్నాయి.

ఈ సంస్థ సేవలు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు ఏమాత్రం కాలయాపన లేకుండా రంగం‌లోదిగి విపత్తులనుండి ప్రజలను ప్రజల ఆస్తులను కాపాడుతుంది. అవసరమైఅనప్పుడు శాంతి భద్రతల నిర్వహణకు సైతం వీరి సేవలను ఉపయోగించుకుంటారు.

పేరుకుమాత్రమే సీఐయన్‌యఫ్ సహాయ సైన్యంగా (పారా మిలిటరీ ఫోర్స్‌గా) పిలుస్తారు కానీ భారత సైనికులకు వర్తించే సౌకర్యాలన్నింటినీ వీరికి కల్పిస్తారు

దేశాభివృధ్దిలో భాగమైన పరిశ్రమలకు రక్షణతోపాటు ప్రకృతి విపత్తులు, మానవకారక ప్రమాదాలనుండి ప్రజలను కాపడే కెంద్రీయ పారిశ్రామిక రక్షణా దళాలకు జేజెలు చెబుదామా!


8 మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (2016) [8 Mar International Women’s Day 2016]

వెనకటికి ఒకాయన “నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటే మరికొందరు “స్త్రీబుధ్ధీ ప్రళయాంతకం” అంటూ అసలు ఆడవాళ్ళకు బుధ్ధే లేదని చెప్పజూశారు. కొద్దికాలానికి మరొకాయన “కార్యేషు దాసీ, కరణేషు మాతా” అంటూ ఆమెకుండాల్సిన లక్షణాలను వివరించాడు. ఆతర్వాత. ఇంకోగురువుగారు “వాళ్ళు పుట్టిందే నీకు సేవచేయడాన్నికంటూ” ప్రవచిస్తే మరో పెద్దాయన “వాళ్ళు నీకెన్నటికీ సమానం కారన్నాడు”

యుగాలు, కాలాలు, తరాలు మారుతున్నకొద్దీ ఆమెపట్ల కరుడుగట్టిన దృక్పధం‌లో వచ్చింది. ఆమె ఉనికిని గుర్తించినా, స్థానాన్ని అంగీకరించినా తన స్థాయికి సమానమని మాత్రం ఒప్పుకోవడం లేదు.

ఆకాశం‌లో సగం నీదే అంటూ పట్టాలు రాసిచ్చినా ఆమ్నియోసెంటేసిస్‌ హత్యలూ, ముళ్లపొదల్లోనూ, మున్సిపల్ డ్రైనేజీల్లో వదలడాలూ, ఆసిడ్ ప్రేమలూ, అక్రమరవాణాలూ, అందరూ ఉండికూడా అనాధ శరణాలయాలకి వదిలేయడాలు జరిగిపోతూనే ఉన్నాయి.

‘వాళ్ళు చట్టసభలో 33% కాదు కనీసం 12%మందికూడా లేర’ని మన దేశ ప్రధమ పౌరుడు ఆవేదన చెందాడు. చట్టసభలో చక్రం తిప్పే పెద్దాయన కనీసం మహిళాబిల్లు మాటకూడా ఎత్తలేదు.

లింగ సమానత్వమంటూ వస్తే, గిస్తే క్రీస్తు శకం 2095 తర్వాతప్రారంభమై 2133 వరకు పూర్తిస్థాయికి చేరుకోవచ్చునని World Economic Forum (అంటే మరో 80 ఏళ్ళకన్న మాట) అంచనా వేసి, ఆ లక్ష్యసాధనకోసం కార్యాచరణ ఇప్పటినుండే ప్రారంభం కావాలని సూచించింది.

అందుకోసం లింగ సమానత్వ ప్రతిజ్ఞచేసూ, అవగాహన పెంచుతు, ఆచరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీ పురుషులిరువురూ చేయాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో అత్తకు కోడలు, కోడలికి అత్తా సమానం కారు. ఇల్లాలికి ఆడపడచులూ, వైస్ వర్సా సమానంగా చూడలేకపోతున్నారు.

ఈ ప్రతిజ్ఞను ప్రతీ కార్యాలయం, విద్యాలయం, పబ్లిక్ ప్లేసులతోపాటు ఇంట్లోకూడా రాసిపెట్టుకుంటే మంచిది. ఈ ప్రతిజ్ఞనలా వేలాడదీయడం మాత్రమే కాకుండా ఆచరించాలి.
ప్రతిజ్ఞ

నేను బాలికలు, స్త్రీలు తమ లక్ష్యాలను, ఆకాంక్షలను చేరుకోవడం‌లో తోడుంటాను.

నా చేతనాచేతనావస్థలేవైనా స్త్రీలపట్ల వివక్ష ప్రదర్శించను

నేను లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే నాయకత్వానికే మద్దతిస్తాను.

నేను స్త్రీల సేవలను పురుషుల సేవలకు సమానంగా గౌరవిస్తాను

నేను అంతర్గ్రాహ్య మార్గదర్శకత్వంతో మహిళా సమానత్వంకోసం సర్ధుకుపోయే ధోరణితో వ్యవహరిస్తాను.

ఈ సందర్భంగా (వాస్తవానికి ఏ సందర్భం‌లోనైనా) కాళోజీ మాటలను స్మరించుకోవాలి.

“నా ఒక్కసిరా చుక్క లక్షమెదళ్ళకు కదలిక’ లార్డ్ బైరన్ మాటలనుటంకిస్తూ ప్రజాకవి కాళొజీ

“మరి నేనొలకబోసిన సిరా సీసాలకొద్దిగాదు పీపాలకొద్దీ
ఏఒక్క మెదడు కదిలినట్టు లేదు –
మొదట నా మెదడులో ఉంటేగా కదలిక- మరోమెదడును కదిలింఛడానికి’

ముఖ పుస్తక మిత్రులందరికీ మరొకమారు “అంతర్జతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు”


3 మార్చ్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ వన్యప్రాణీ దినోత్సవం (3 Mar UN World Wildlife Day)
ప్రకృతి వరప్రసాదమైన సుందర, వైవిధ్యభరిత జంతు, వృక్షజాలాలమధ్య పలురూపాల్లో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకోవడంవల్ల వన్యప్రాణి పరిరక్షణతో సమాజానికికలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి అవకాశం ఉంది. అలాగే వన్యప్రాణుల క్షీణతవల్ల ఏర్పడే విస్తృత ఆర్ధిక, పర్యావరణ మరియు సాంఘికదుష్ప్రభావాలను తెల్యజేస్తూ వాటిపట్ల నేరాలకు వ్యతిరేకంగా పోరాటంచేయాల్సిన అవసరన్ని మనకు గుర్తుచేస్తుంది.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జంతు, వృక్షజాలాలతో అనాదినుండి మానవజీవితానికి, జీవనానికీ గల అవినాభావ సంబంధాన్ని తెలుపుతూ ప్రకృతి సమతుల్యత, దాని ఆవశ్యకతపై ప్రజాబహుళ్యానికి అవగాహన పెంచుతుంది. అలాగే వన్యప్రాణులపై జరుగుతున్న నేరాలపట్ల సమాజఁ ప్రదర్శిస్తున్న ఉదాసీనతవల్ల ఆర్ధిక, పర్యావరణ, సామాజిక రంగాలపై చూపించె పర్యవసనాన్నీ, దుష్ప్రభావాన్నీ గుర్తుచెస్తుంది.

వన్యప్రాణ సంపదలో అంతర్లీనంగా పర్యావరణ, జన్యు, సామాజిక, ఆర్ధిక, శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక, వినోదపరమైన విలువలు నిబిడీ కృతమై ఉన్నాయి. అందువల్ల ఐక్యరాజ్య సమీతిలొని సభ్యదేశాలు, అంతర్జాతీయ సంస్థలు, నాగరిక సమాజం, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలు నేటి అవలోకనలో (observation) భాగస్వాములౌతున్నారు. స్థానికి సమాజసమూహం సహకారంతోనే వన్యప్రాణుల వేటనూ, అక్రమ వ్యాపారాన్నీ నిరోధించగలం. సినీనటుడు సల్మాన్ ఖాన్ తన బృమ్దంతో రాజస్థాన్‌లో నల్లజింకల వేటకు వెళ్ళినప్పుడు స్థానిక బిష్ణోతెగవారే నిలువరించి, నిర్భందించిన విషయం పలువురికి గుర్తుండేఉంటుంది

అంతరించిపోతున్న వన్యప్రాణుల వ్యాపారనిషేధ కార్యాచరణను ఐక్యరాజ్యసమితి 1973వ సంవత్సరం‌లో మార్చినెల 3వ తేదీన ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని 2014 సం.నుండి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము,.
“వన్యప్రాణి భవితవ్యం మనచేతుల్లోనే ఉంది” అనే నేపధ్యం‌తొ ఈ సంవత్సరపు వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. వన్య సంపదలో మనకు తెలిసినవీ, తెలియనివి అన్నీ కూడా తీవ్ర ప్రమాదం‌లో ఉన్నాయి. వన్యప్రాణులవేటతోపాటు వాటిని ఇతారదేశాలకు తరలించే పలు అంతర్జాతీయ నేర సంస్థల ప్రభావం వల్ల నామమాత్రంగా మిగిలిన ఏనుగులు, పంగోలిన్లు, ఖద్గమృగాలు, షార్క్ చేపలు, పులులతోపాటు పలు అరుదైన వృక్ష జాతుల మనుగడ ప్రమాదం‌లో పడుతున్నది.

విచక్షణతోను, తార్కికంగానూ ఆలోచిస్తే “వన్యప్రాణి భవితవ్యం మనచేతుల్లోనే ఉంది” అని చెప్పడంకంటే మానవుడి భవితవ్యమే మన చేతుల్లో ఉంది. ప్రత్యక్షంగా వన్యప్రాణుల మనుగడ ప్రమాదం‌లో పడుతున్నదంటే పరొక్ష్కంగా మానవాళి జీవితం ఇంకా ప్రమాదం‌లొ పడిందన్నమాటే. చత్రజాతులు అంతరిస్తే వన్యప్రాణులూ, వృక్షసంపదా ఒకదానివెనుక ఒకటి వేగంగా అంతరిస్తాయి. అప్పుడు పర్యావరణం‌లోని పొరలన్నీ బలహీనపడటం వల్ల సూర్య రశ్మి మానవాళిని మాడ్చేస్తుంది.

విద్యార్ధులకు విషయ పరిజ్ఞానం కల్గించడం ద్వారానూ, సామాజిక మాధ్యమాలద్వారానూ విస్తృత ప్రచారం కల్పించి మానవాళీ భావి తరాలనూ రక్షించాల్సిన బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది.

ఈ దిశగా కార్యోన్ముఖులం కావడమే మనందరి కర్తవ్యం

No comments:

Post a Comment