Sunday 1 November 2015

Happy Days for the month of 11/2015 (1November World Vegan Day),(19 Nov World Toilet Day)(21 Nov World Television Day ) karthika puranama

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - స్పెషల్ డేస్ 

సర్వేజనా సుఖినోభవంతు 



తెలుగు తల్లికి మంగళం అంటు మన భావకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గ్రే రచించిన గేయం

తెలుగు తల్లికి మంగళం
మా కల్పవల్లికి మంగళం
కొలుచు మా యెదనిలుచు
మారాజ్ఞీమతల్లికి మంగళం

ప్రాతక్రొత్తల కౌగిలింతల
ప్రసవమగు బంగారు కాంతుల
భావికాల స్వర్గమమరుచు
ప్రౌడ ప్రతిభకు మంగళం

నాగరకతను వలచి మెచ్చిన
నాడు నాడులు తరలివచ్చిన
భోగభాగ్యము లంద జూపే
రాగ రహితకు మంగళం

వేద వేదములన్ని తరచి
వాద భేధములన్ని మరచి
స్వాదు ధర్మ పథమ్ము పరచు
విశాల శీలకు మంగళం

నాకమందిన పగటి వేళ
నరకమంటిన కారులేల
ఏకగతి తెలుగమ్మ నడిపిన
ఏక సారథి కెపుడు మంగళం

రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
 
మొన్న బాలల దినోత్సవం నాడు బాలనయ్య బాలక్కయ్య నడిపిన బాలానందం గూర్చి చర్చించుకున్నాం కదా.. అందులో ప్రారంభములో రారండోయ్ అంటూ.. కార్యక్రమం అయ్యాక పోదామా పోదామా అంటు పిల్లలు పాడిన పాట సాహిత్యం ఇది.

ప్రారంభములో

రారండోయ్ .. రారండోయ్
బాల బాలికలు రారండోయ్
బాల వినోదం వినరండి
బాల బాలికలు రారండోయ్
బాల వినోదం వినరండి
హైదరాబాదు బాలలము
జై జై మంటూ పిలిచారు
జై జై మంటూ రారండి
రేడియో ప్రోగ్రాము వినరండి

ర్యక్రమం అయ్యాక పోదామా పోదామా

జాలీగా ఆటలు మన పాటలు మనమాటలు
బిర బిర బిర బిర పోదామా
చర చర చర చర పోదామా
పిల్లలందరం మన ఇళ్ళకు మన ఇళ్ళకు
గబ గబ గబ గబ పోదామా


కార్తీక పౌర్ణమి విశిష్టత
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’.
 
పౌర్ణమి... ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే... ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెనె్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.
 
మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.
 
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
 
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.
 
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.
కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.



కార్తీకపురాణం 23వ అధ్యాయం : శ్రీరంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తిపొందుట

అగస్త్యుడు తిరిగి అత్రి మహామునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ ముని పుంగవా! విజయలక్ష్మి వరించాక పురంజయుడు ఏం చేశాడో వివరిస్తారా?” అని కోరాడు. దీనికి అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు. ”కుంభ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతమాచరించడం వల్ల అసమాన బలోపేతుడై అగ్నిశేషం, శత్రు శేషం ఉండకూడదని తెలిసి… తన శత్రురాజులందరినీ ఓడించాడు. నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలాడు. తన విష్ణు భక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాన, భక్తి ప్రియవాది, తేజోమంతుడు, వేదవేదాంగవేత్తగా విరాజిల్లాడు. శత్రురాజ్యాలను జయించి, తన కీర్తిని దశదిశలా చాటాడు. శత్రువులు సింహస్వప్నమై… విష్ణు సేవాధురంధురుడై, కార్తీకవ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి, అరిషడ్వర్గాలను జయించాడు. అయినా… అతనిలో తృప్తి లోపించింది. ఏ దేశాన్ని, ఏ కాలంలో, ఏ క్షేత్రాన్ని ఏవిధంగా దర్శించాలి? శ్రీహరిని ఎలా పూజించి కృతార్థుడనవ్వాలి? అని విచారిస్తూ గడిపేవాడు. అలా శ్రీహరిని నిత్యం స్మరిస్తున్న అతనికి ఓ రోజు అశరీర వాణి పలకరించింది” అని అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు…
పురంజయుడితో అశరీరవాణి ఇలా అంటోంది… ”ఓ పురంజయా! కావేరీనదీ తీరంలో శ్రీరంగ క్షేత్రముంది. దాన్ని రెండో వైకుంఠమని పిలుస్తారు. నీవు అక్కడకు వెళ్లి, శ్రీరంగనాథ స్వామిని అర్చించు. నీవు ఈ సంసార సాగరం దాటి మోక్షప్రాప్తిని పొందగలవు” అని పలికింది. అంతట పురంజయుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, సపరివార సమేతంగా బయలుదేరి, మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ… ఆయా దేవతలను సేవిస్తూ, పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తూ… శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తుండగా… శ్రీరంగనాథ స్వామి మధ్యలో కొలువయ్యారు. శేషశయ్యపై పవళిస్తున్న ఆయనను గాంచిన పురంజయుడు పరవశంతో చేతులు జోడించి… ”దామోదరా… గోవిందా… గోపాలా… హరే కృష్ణా… హే వాసుదేవా! దాసోహం… దాసోహం…” అని స్తోత్రం చేశాడు. కార్తీకమాసమంతా శ్రీరంగంలోనే గడిపాడు. ఆ తర్వాత వారు అయోధ్యకు బయలుదేరారు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీకమాసం చేయడం… వ్రత మహిమలతో అతని రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లారు. పాడిపంటలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలకు లోటు లేకుండా పోయింది. అయోధ్యానగరం దృఢతర ప్రాకారాలు కలిగి, తోరణ యంత్ర ద్వారాలతో మనోహర గృహగోపురాలు, పురాదులతో, చతురంగ సైన్య సంయుతంగా ప్రకాశించుచుండె. అయోధ్యానగరంలోని వీరులు యుద్ధనేర్పరులై… రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరం విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరంలోని మహిళు, యువతులు హంసగజామ ఇనులూ, పద్మపత్రాయతలోచనలు, రూపవుతులు, శీలవతులని, గుణవతులని ఖ్యాతి గడించారు.
శ్రీరంగంలో కార్తీకవ్రతమాచరించి, ఇంటికి క్షేమంగా చేరిన పురంజయుడిని ఆ పుర ప్రజలు మంగళ వాద్యాలతో ఆహ్వానించారు. అలా కొంతకాలం ఐహికవాంఛలను అనుభవించిన పురంజయుడు ఆ తర్వాత వాటిని వదులుకుని, తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి, వానప్రస్థాశ్రమం గడిపాడు. జీవితాంతం కార్తీక వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ… అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకున్నాడు.
”కాబట్టి ఓ అగస్త్యా! కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైంది. దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలి. ఈ కథ చదివినవారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది” అని అత్రి మహర్షి వివరించారు.
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య: త్రయోవింశోధ్యాయ సమాప్త:
23వ రోజు పారాయణం సమాప్తం


కార్తీక పురాణం 22వ అధ్యాయం : పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమాచరించుట

అత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెబుతున్నాడు….
పురంజయుడు వశిష్టులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచియై దేవాలయానికి వెళ్లి, శ్రీమన్నారాయణుడిని షోడశోపచారాలతో పూజించాడు. శ్రీహరిని గానం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయమైన వెంటనే నదికి పోయి, తిరిగి స్నానమాచరించి తన ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి, పురంజయుడి వద్దకు వచ్చి… ”ఓ రాజా! విచారించకు… నువ్వు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యాన్ని తీసుకుని, యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో పోరాడు” అని చెప్పి పంపాడు. దెబ్బతిని క్రోదంతో ఉన్న పురంజయుడి సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడసాగింది. పురంజయుడు, అతని సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు. అంతేకాకుండా… శ్రీమన్నారాయణుడు పురంజుడి విజయానికి అన్నివిధాలా సహాయపడ్డాడు. ఓటమిపాలైన కాంభోజాది భూపాలరు ”పురంజయా… రక్షింపుము… రక్షింపుము” అని కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు. పురంజయుడు విజయలక్ష్మితోకలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్లాడు.
శ్రీహరిని నమ్మినవారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజయుడి వృత్తాంతం నిరూపించింది. అంతకు ముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్యకశిపుడు ఇచ్చిన విషం అమృతతుల్యమైంది. ఎన్నో సందార్భల్లో అధర్మం ధర్మంగా మారింది. దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మమవుతుంది. తాడు కూడా పాములా కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీస్నానమొనర్చి, దేవాలయంలో జ్యోతిలను వెలిగించి దీపారాధన చేసినట్లయితే…సర్వ విపత్తులు తొలగిపోతాయి. అన్ని సౌక్యాలు సమకూరుతాయని అగస్త్యుల వారికి అత్రి మహర్షి వివరించారు.
ఇతి స్కాంధపురాణాంతర్గతేన వశిష్ట ప్రోక్త: కార్తీక మహత్య: 22 అధ్యాయ: సమాప్త:
22వ రోజు పారాయణం సమాప్తం

కార్తీక పురాణం 21 వ అధ్యాయం : పురంజయుడు కార్తీక ప్రభావం

అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.
ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను.
ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నామాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి… రేపు అలా చేసినట్లయితే… పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.
శ్లో// అపవిత్ర: పవిత్రో పవిత్రోవా సర్వావస్థాంగతోపివా
య్ణ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా భంతర శుచి||
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, ఏకవింశోద్యాయ సమాప్త్ణ
ఇరవయొక్కటో రోజు పారాయణం సమాప్తం



కార్తీక పురాణం 20వ అధ్యాయం : పురంజయుడు దురాచారుడగుట

చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ గురువర్యా! కార్తీకమాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలున్నాయా? అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది” అని కోరాడు. దానికి వశిష్టులవారు మందహాసంతో ”ఓ రాజా! కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రి మునికి చెప్పిన విషయం వివరిస్తాను” అని ఇలా చెప్పసాగారు.
పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి… ”ఓ అత్రి మునీ! నీవు విష్ణువు అంశలో పుట్టావు. కాబట్టి నీకు కార్తీక మహత్యం ఆమూలాగ్రంగా (ఆది నుంచి అంతం వరకు) తెలుసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు” అని కోరాడు. దానికి అత్రి మహాముని ”ఓ కుంభసంభవా! కార్తీక మాసానికి సమాన మాసం లేదు. వేదాల్లో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడికంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా… కార్తీకంలో నదీస్నానం చేసినా.. శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా… దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసముంది. చెబుతాను విను… త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశపురాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పువ చ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై… దుష్టబుద్ధి కలవాడై.. దయాదాక్షిణ్యాలు లేక… లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి, వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకొచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ… ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టీకాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి, అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళౄలను తీసుకుని అయోధ్యను చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి, యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చసేది లేక… తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే… తన శక్తి బలహీనంగా ఉన్నా… తుదికంటా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్రసమన్వితమైన రథాన్ని ఎక్కి, సైన్యాధిపతులను పురికొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్దుడయ్యాడు. యుద్ధభేరీ మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా? అన్నట్లు పెద్దఎత్తున హుంకరించారు. శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం వింశాధ్యాయ: (20వ అధ్యాయం) సమాప్త:
20వ రోజు పారాయణ సంపూర్ణం 

  కార్తీకపురాణం 19వ అధ్యాయం : చాతుర్మాస్య వ్రత ప్రభావం

నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ”ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవైన ఓ నందనందనా… మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయా! మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్దరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా… ఎన్ని శాస్త్రాలను విన్నా… నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయడగా… శ్రీహరి చిరునవ్వుతో…. ”జ్ఞానసిద్ధా! నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో” అని పలికెను. అంతట జ్ఞాన సిద్ధుడు ”ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు” అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు ”ఓ జ్ఞాన సిద్ధుడా! నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదేకాకుండా, మరో వరం కోరుకో… ఇస్తాను. ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాఖములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తిగలవారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు.
తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీపురుష బేధం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు.
ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీకమహత్యం పందొమ్మిదో అధ్యాయం సమాప్తం
పందొమ్మిదోరోజు పారాయణం సమాప్తం

కార్తీకపురాణం 18వ అధ్యాయం : సత్కర్మనుష్టాన ఫల ప్రభావం

ధనలోభుడు తిరిగి ఆంగీరసులవారితో ఇలా అడుగుతున్నాడు…. ”ఓ మునిచంద్రా! మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది. జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిశ్యుడను. తండ్రి-గురువు-అన్న-దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీవంటి పుణ్యమూర్తుల సాంగథ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే… అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా? అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి, ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విషదీకరించండి” అని కోరాడు.
దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు… ”ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను” అని ఇలా చెప్పసాగెను…
”ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ, ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడేజాతివాడు? ఎలాంటి కర్మలు ఆచరించాలి? అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక, సత్కర్మలనాచరించినా, అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా… వైశాక మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా… మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా… అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాత:కాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలాచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాత:కాలంలోనే స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మబ్రష్టుడవుతాడు. కార్తీకమాసంలో అరుణోదయస్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీకమాసంతో సమానమైన నెలగానీ, వేదాలతో సరితూగే శాస్త్రంగానీ, గంగాగోదావరులకు సమాన తీర్థాలుగానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖమూ, ధర్మంతో సమానమైన మిత్రుడూ, శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీకమాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు” అని వివరించెను.
దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నఇస్తున్నాడు…. ”ఓ మునిశ్రేష్టా…! చాతుర్మాస్య వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు…” అని కోరాడు.
ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు…. ”ఓయీ…! చాతుర్మాస్య వ్రతమనగా మహా విష్ణువు, మహాలక్ష్మీదేవితో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున నిద్రలేస్తారు. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా… ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను.
తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా… ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, కోటిసూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి… ఏమి తెలియనివాడిలా మందహాసంతో ‘నారదా క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్టానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా?’ అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ‘ఓ దేవా… ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా… నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ, అవి పూర్తికాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము’ అని ప్రార్థించెను.
జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది, లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షుఉలున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు, అతను ముసలిరూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ‘ఈ ముసలివానితో మనకేమి పని’ అని ఊరకుండిరి. గర్విష్టులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి, ‘వీరిని ఎలా తరింపజేయాలి?’ అని ఆలోచిస్తూ… తన నిజరూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ధరించి, లక్ష్మీదేవితోను, భక్తులతోనూ, మునిజన ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంఉటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారయణుడిని దర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి, ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు…
శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||
శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం
త్వాం త్రైలోక్య కుటుంబినిం శర సిజాం వందే ముకుంద ప్రియం||
ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టా దశాధ్యాయం – పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ


కార్తీకపురాణం 17వ అధ్యాయం :                ధనలోభికి తత్వోపదేశం
అప్పుడు ఆంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. ”ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు.
”కర్మల వల్ల ఆత్మ దేహదారణ సంభవిస్తున్నది. కాబట్టి, శారీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా… ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు.
దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు.
అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు ”ఈ దేహం అంత్ణకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఎదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయడగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తాదశాధ్యాయం – పదిహేడవ రోజు పారాయణ సమాప్తం


--((*))--

కార్తీకపురాణం 16వ అధ్యాయం : స్తంభదీప ప్రశంస
తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నాడు… ”ఓ మహారాజా! కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నెలలో స్నాన, దాన, వ్రతాదులను చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో… అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలరోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోటవద్దగానీ, భగవంతుని సన్నిధిలోగానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమిరోజు నదీస్నానమాచరించి, భగవంతుడి సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు, నారీకేళ ఫలాలు దానం చేసినట్లయితే… చిరకాలం నుంచి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది.
సంతానం ఉన్నవారు ఇలా చేస్తే… వారికి సంతాన నష్టమనేది ఉండదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం వెలిగించినవారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకాశదీపంగానీ, స్తంభదీపంగానీ పెట్టి, నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యాలు కలిగి, వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిదాన్యంగానీ, నువ్వులుగానీ ప్రమిద అడుగున పోయాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది… చెబుతాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగాడు….
దీపస్తంభం.. విప్రుడగుట
రుష్యాగ్రగణ్యుడైన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి దగ్గర్లో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదికాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కినవారిని చూసి… ”ఓ సిద్ధులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి, దానిపై దీపం పెడదాం. అంతా కలిసి అడవికి వెళ్లి, నిడుపాటి స్తంభం తీసుకువద్దాం” అని కోరారు. అందుకు అంతా సంతసించి, పరమానందభరితులై అడవికి వెళ్లి, చిలువలు, వలువలు లేని ఓ చెట్టును మొదలు నుంచి నరికి, దాన్ని తీసుకొచ్చి, ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యముంది, ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి, అందులో వత్తిని వేసి, వెలిగించారు. ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు. అంతలో ”ఫళఫలా”మనే శబ్ధం వచ్చింది. వారు అటు చూడగా… వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది. దీపం కూడా ఆరిపోయి, చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. మునులంతా అతన్ని చూసి, ఆశ్చర్యంతో ”ఓయీ… నీవెవరవు? నీవీ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ కథేంటి?” అని ప్రశ్నించారు.
దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి, ”పుణ్యాత్ములారా! నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను. ఒక జమిందారుగా సకలైశ్వర్యాలతో తలతూగాను. నాపేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలేక ప్రవర్తించాను. దుర్భుద్ధుల వల్ల వేదాలను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయకుండా ఉంటిని. నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా… వారితో నా కాళ్లను కడిగించి, ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి, నానా దుర్భాషలాడేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హనీంగా చూసేవాడిని. జనాలంతా నా చేష్టలకు భయపడేవారు. నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను చేసే పాపకార్యాలకు హద్దులేకపోయింది. ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు. ఇంత దుర్గార్గుడిగా, పాపిగా జీవితం గడిపి, అవసాన దశలో చనిపోయాను. ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి, లక్ష జన్మలలో కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, అయిదువేల జన్మలు తొండగా, అయిదు వేల జన్మలు పేడ పెరుగుగా, తర్వాత వృక్ష జన్మమెత్తి అరణ్యంలో కూడా ఉన్నాను. అయినా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నా రూపమెత్తి, జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నించండి” అని వేడుకొన్నాడు.
ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు. ”ఆహా! కార్తీకమాసం మహిమ ఎంత గొప్పది? అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యంకాదు. కర్రలు, రాళ్లు, స్తంభాలు కూడా మన కళ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే ఈ స్తంభానికి ముక్తికలిగింది” అని మునులు అనుకుంటుండగా… ఆ పురుషుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు… ”ఓ మునులారా…! నాకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉందా? ఈ జగంలో ఎల్లరకూ కర్మబంధం ఎలా కలుగుతుంది? అది ఎలా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి” అని ప్రార్థించారు. అంత అక్కడున్న మునులంతా… తమలో ఒకరగు అంగీరసమునితో ”స్వామీ…! మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి” అని కోరిరి. అంతట ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపాడు.
ఇట్లు స్కాంధ పురాణాంతర్గతమై, వశిష్టులవారిచే చెప్పబడిన కార్తీకమహత్యమందలి పదహారో అధ్యాయం సమాప్తం


కార్తీకపురాణం 15వ అధ్యాయం : దీప ప్రజ్వలనం - ఎలుకకు పూర్వజన్మ స్మృతి

తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను.
”ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను…
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.
అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.
చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు.
స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణ సమాప్త్ణ 15వ రోజు పారాయణం సమాప్తం
మ|| సదయా ఇంద్రియ ధేనువుల్ విషయ ఘాస గ్రాసలో లమ్ము లై
బ్రదు కుం బిడులు బట్టి నిన్మరిచి పోవంబోవ ప్రాయం పుప్రో
ద్ద దేడిందన్ పయిగమ్ము చికటిలలో నల్లాడవే సుంత నీ
మృదవౌ మోవిని పిల్ల గ్రోవి నీడలేని వేణు గోపాలకా||
కార్తీక పురాణం 15వ అధ్యాయం: దీప ప్రజ్వలనం-ఎలుకకు పూర్వజన్మ స్మృతి
కార్తీకపురాణం 


 14వ అధ్యాయం : ఆబోతుకు అచ్చువేసి వదులుట

మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.
కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||
”కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు.
కార్తీక మాస శివ పూజ కల్పము
1 ఓం శివాయ నమ్ణ ధ్యానం సమర్పయామి
2 ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం సమర్పయామి
3 ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న సంహాసనం సమర్పయామి
4 ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమ్ణ అర్ఘ్యం సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమ్ణ స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమ్ణ గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమ్ణ అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమ్ణ దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమ్ణ దీపం సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమ్ణ నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమ్ణ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమ్ణ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.
ఇట్లు స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీ మహత్యం… పద్నాలుగో అధ్యాయం సమాప్తం
పద్నాలుగో రోజు పారాయణం సమాప్తం
 
 --((*))--

కార్తీకపురాణం 11వ అధ్యాయం : మంథరుడు - పురాణ మహిమ

తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు… ”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…
పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.
మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.
ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు. కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు, కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు.
మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ”అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథాచేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతుఆరు. నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది.
ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది. విష్ణుదూతలతో ”ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.. ”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడోవాడు పులిజన్మను పూర్తిచేసుకున్నవాడు కాగా… నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు.
విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణుదూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.
”ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.
ఇది స్కాంధపురాణాంతర్గతంలోని కార్తీక పురాణం పదకొండో అధ్యాయం సమాప్తం…
హరి: ఓం….
 

 --((*))--
 కార్తీక పురాణము 8వ అధ్యాయము (శ్రీహరినామస్మరణాధన్యోపాయం)-

వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది - నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనరబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను" యని కోరెను.

అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు.

సాత్త్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము.ఆ ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ, యమున,గోదావరి కృష్ణనదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ దేవాలయములయందూ - వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.

రాజస ధర్మమనగా - ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగును.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

అజామీళుని కథ

పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతు లన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాబుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి.ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు, దుష్టసావాసములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై, మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి, మద్యం సేవించుచు, ఒక ఎరుకలజాతి స్త్రీని వలచి, నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే భుజించుచుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినయెడల యీ విధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా, వానిబంధువు లతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుచుచు ఒక్కక్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్లుచూ, "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" యని స్మరించిన యెడల తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననిమాత్ర మాతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమీళుడు భయము చెంది కుమారునిపై నున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" యనుచునే ప్రాణములు విడిచెను. అజామీళుని నోట "నారాయణా" యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి "ఓ యమభటులారా! వీడు మావాడు. మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి" యని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకొనిపోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమిగాన, వానిని మాకు వదలు" డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్పదొడంగిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఎనిమిదో యధ్యాయము
ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
 
21 నవంబర్ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం (21 Nov World Television Day )
సాంకేతికాభివృధ్ధి సమకాలీన సమాజాన్ని శాసిస్తున్నది. పని, వినోదం, విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు, ప్రయాణాల వంటి దినచర్యలెన్నింటినో నేటి సమాచార సాంకేతిక శాస్త్రం నియంత్రిస్తున్నది.

టెలివిజన్ ద్వారా అనుభవం‌లోకి వచ్చిన విషయాలెన్నో మనలను ప్రభావితం చేస్తూ మనవ జీవితాలకు ఒక రూపాన్నిస్తున్నాయి, అవి కొన్నిసార్లు విపరీతపరిణామాలకు దారితీస్తున్నప్పటికీ టెలివిజన్ మనకు బోధించడం, తెల్యజెప్పడం, సమాచారాన్నివ్వడం, ప్రభావితం చేయడం వంటి పలుకోణాల్లో కొత్త విలువలనెన్నింటినో అనుభవం‌లొకి తెస్తున్నది ఐక్యరాజ్య సమితి 1996వ సంవత్సరం నవంబర్ 21, 22 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగానున్న మీడియా ప్రముఖులతో దూరదర్శన్ వేదికనొకను మొదటిసారిగా నిర్వహించింది. వేగంగా మారుతున్న ప్రపంచం‌లో పెరుగుతున్న టెలివిజన్ ప్రాముఖ్యతనూ, మీడియా, బుధ్ధిజీవులు, ఐక్యరాజ్య సమితిలు పరస్పరం సహకరించుకోవాల్సిన విధి, విధానాల గురించి చర్చించుకున్నరు. ఈ సమావేశం స్ఫురణగా ప్రతీ నవంబర్ 21 వ తేదీన ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నిర్వహిస్తారు.

మనం నిర్ణయాలు తీసుకొనే క్రమం‌లో దూరదర్శన్ పాత్ర గణనీయంగా పెరుగుతున్నది. ప్రజాభిప్రాయాన్ని నిర్దేశించే ప్రధాన సాధనంగా టెలివిజన్ ప్రస్తుతిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచ రాజకీయాల గతిని శాసించే టెలివిజన్ పాత్రను మనం విస్మరించలేము.

నైతిక విలువలు ప్రస్తాపించాల్సిన టెలివిజన్ ఛానెళ్ళు తమ తమ సొంత అజెండాలతో ఇతరులపై దాడి చేస్తున్నాయి. మహాకవి శ్రీ శ్రీ ‘పత్రికలు- పెట్టుబడిదారుల విషపుత్రికలుగా (పత్రికలంటే ఇప్పుడు అన్ని రకాల ప్రసార మాధ్యమాలు) వర్ణిస్తే, ప్రజాకవి కాళొజీ ప్రసార మాధ్యమాలను “కావల్సినవాడి తల కడుక్కో – కానీ కానివాడి మీదెందుకు వుత్స (మూత్రం)” అంటూ మోటుగా దునుమాడాడు. ఈపదాలు మరీ దురుసుగా ఉన్నాయని అభిమానులు అంటే ‘కానీ కానివాడి మీదెందుకు కక్ష’ గా చదువుకోమన్నారు.

వాస్తవాలు తెలిసిన మనం మనకుటుంబం వీక్షించే ఛానళ్ళు, వాటి రాజకీయ విధేయత, వాటి కార్యక్రమాలలో సామాజిక విలువలగురించి కుటుంబ సభ్యులతో చర్చించాలి. పిల్లలను టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉంచే బదులు వారు వీక్షించిన కార్యక్రమాలు, వాటి వాస్తవికత, వాటిల్లో ప్రతిక్షేపించిన విలువ గురించి చర్చకు ప్రోత్సహించి వారి అభిప్రాయాలను సరిచేయాలి. విజ్ఞతతో కూడిన సమాజ నిర్మాణం‌లో భాగస్వాములం కావాలి.

ప్రసార మాధ్యమాలకు సంబంధించిన ఇతర దినోత్సవాలు: 29 జనవరి: జాతీయ పత్రికా దినోత్సవం/ 4 ఫిబ్రవరి: ఫేస్‌బుక్ దినోత్సవం/ 13 మార్చి: ప్రపంచ రేడియో దినొత్సవం/3 మే: ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం/ 15 నవంబర్: జాతీయ ప్రెస్ కౌన్సిల్ దినోత్సవం

మీ అభిప్రాయాలు పంచుకోవల్సిందిగా కోరుతున్నాను.

 19 నవంబర్ ప్రపంచ శౌచాలయ దినోత్సవము (19 Nov World Toilet Day)

బహిర్‌మలవిసర్జనాన్ని అంతమొందించడం నేటి సమాజపు నైతికావశ్యకత. కేవలం శౌచాలయాలవసతిలేమికారణంగా బాలికలు, మహిళలు కామాంధులచేతుల్లో గాయపడటం, అత్యాచారానికి గురికావడం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. ఈలేమిని సామూహికంగా ఆలోచించి కార్యాచరన రూపొందించాలి. గతసంవత్సరం తెలంగాణా ప్రభుత్వం “స్త్రీల భద్రత, రక్షణలకోసం సిఫార్సులు చేయడానికి” నియమించిన స్మితా సభర్వాల్ కమిటీ కూడా అత్యాచారాల నిరోధానికి శౌచాలయాల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు వందశాతం శౌచాలయాలను సాధించినందుకు అభినందిద్దాం.

ప్రపంచ వ్యాప్తంగా 2.5 బిలియన్ ప్రజలకు సరియైన పారిశుధ్ధ్య, శౌచాలయ వసతుల లేమివల్ల ఆరోగ్యం, గౌరవం, భద్రత, పర్యావరణం, ఆర్ధిక మరియు సాంఘిక అభివృద్ధిలపై నాటకీయమైన పరిణామాలను, ప్రభావాన్ని చూపుతుంది.
.
శౌచాలయ వసతుల లేమికారణంగా బాలికలు, మహిళలు లైగింక దాడులకు గురౌతున్నందున “సమానత్వం, గౌరవం- లైంగిక దాడులు, పారిశుధ్యం‌లకుగల వినాభావ సంబంధం” అనే అంశాన్ని ఈ సంవత్సరపు అనుష్టానంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

పారిశుధ్యం మానవ హక్కు
పారిశుధ్యం సమాజాభివృధ్ధికి సమంజసమైన పెట్టుబడి
పారిశుధ్యం గౌరవాన్ని, సమానత్వాన్ని, భద్రతను కల్గిస్తుంది
పారిశుధ్యం చక్కని ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం
పారిశుధ్యం పరిశుభ్రమైన పర్యావరణాన్ని కొనసాగిస్తుంది

“ఇక మనం నిరీక్షించేదిలేదు” అనే టాగ్‌లైన్‌తో ఈ సంవత్సరపు ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

“అందరికీ పారిశుధ్యం” జులై 2013లో ఐక్యరాజ్య సమితి తీర్మానించిన అంశంపై సభ్యదేశాలన్నీ ధృఢమైన నిబధ్ధతతో ఉన్నప్పటికీ ఐక్యరాజ్యసమితి సాధించాల్సిన సహస్రాబ్ది లక్ష్యాలలో “పారిశుధ్యం” చివరి స్థానం‌లో ఉన్నది. ఈ అంశంపై జన జాగృతి పెంచడంకోసం “బహిర్ మలవిసర్జన” అనే అంశంపై ప్రపంచం మౌనం వీడాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ గత సంవత్సరకాలంగా ప్రపంచదేశాలు పర్యటిస్తున్నారు.

ప్రపంచ శౌచ సంస్థ (WTO) ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యం‌లో 2001వ సంవత్సరం నవంబర్ 19వతేదీన స్థాపించబడింది. అదేరోజున సింగాపూర్‌లో ప్రధమ ప్రంపంచ శౌచ సమ్మేళనం జరిగింది. తిండి, బట్ట, ఇల్లుతో పాటుగా శౌచాలయంకూడా మానవుని ప్రాధమిక హక్కుగా ప్రపంచ శౌచ సంస్థ సమావేశం‌లో సభ్యదేశాలన్నీ ఆమోదించాయి. ఆకాలం‌లో ‘శౌచాలయమ’నేది ఒక నిషిధ్ధమైన విషయమైనప్పటికీ. ‘పారిశుధ్ద్యం’ అనే పదాన్ని మీడియా పట్టించుకోనప్పటికీ యుయన్‌ఓ ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రపంచ శౌచాలయ సంస్థ నీరు- పారిశుధ్యం అనేరెండు విషయాలపై దృష్టిపెట్టినప్పటికీ దురదృష్టవశత్తూ పారిశుధ్యం పక్కనపడి, ‘నీటి’ అంశమే సిమ్హ భాగమైంది. దేశ, స్థాయీ తరతమ బేధాలులేకుండా ప్రపంచ పౌరులందరూ శౌచాలయం, పారిశుధ్యం, పరిశుభ్రమైన నీటి ఆవశ్యకతగురించి చర్చించాలి. తోటివారికి ముఖ్యంగా మురికివాడల్లో నివసించేవారికి అవగాహన కల్పించాలి.

భూగోళంపై నివసించే ప్రతీపౌరుడికీ సరిపడే మంచినీటి లభ్యత ఉన్నప్పటికీ అసమంజస ఆర్ధిక విధానాలూ, నిస్సార నిర్హేతుక అవస్థాపనల (poor infrastructure) కారణంగా లక్షలకొద్దీ పౌరులు ప్రత్యేకించి బాలలు నిస్సార పారిశుధ్యము, అపరిశుభ్రమైన జీవన పరిస్థితులతోపాటు శుభ్రమైన తాగునీటి లభ్యతలేక మరణాలబారిన పడ్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవడం నేటి నాగరిక సమాజపు నైతిక బాధ్యత. ఈ దిశగా ఆలోచించడం మన కనీస బాధ్యత.

 

16 నవంబర్ ఆదిరాజు వీరభద్ర రావు జయంతి (1890)

తెలుగుభాష ప్రత్యేకించి తెలంగాణా భాషా సంస్కృతుల పరిరక్షణకూ, పునరుజ్జీవానికీ జీవితకాలం కృషి చేసిన మహానుభావుడు ఆదిరాజు వీరభధ్రరావు. ఖమ్మం జిలా మదిర తాలుకాలోని దెందుకూరు గ్రామం‌లో లింగయ్య, వెంకటమ్మ దంపతులకు 16 నవంబర్ 1890 సం॥ లో జన్మించాడు. చిన్నవయసులోనే తండ్రి చనిపోవడం, ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పెదనాన్న రామకృష్ణారావువద్ద కొణిజెర్ల, చింతకాణి (ఖమ్మం జిల్లా) లో ప్రాధమికవిద్య పూర్తిచేసుకొని హైద్రాబాదులోని దూరపు బంధువు, తెలంగాణాలొ గ్రంధాలయ బాంధవుడు ఐన రావిచెట్టు రంగారావు వద్దకు వెళ్ళారు. చాదర్ఘాట్ హైస్కూల్లో మెట్రిక్ పూర్తి చేశారు. తీవ్రమైన అనారోగ్యం వల్ల పై చదువును కొనసాగించలేదు. కృష్నదేవారాయాంధ్ర భాషానిలయం రూపకల్పననుండి, రూపుదిద్దుకొనేవరకు క్రియాశీలమైన సేవలనందించారు. తదుపరి గ్రంధపాలకులుగాను, కార్యవర్గ సభ్యుడుగానూ, కార్యదర్శిగాను అంకితభావంతో పనిచేశారు.

తెలుగు భాషకు గ్రంధాలయంతోపాటుగా పుస్తక ప్రచురణకూడా అవసరమనిభావించి కొమర్రజు వెంకట లక్ష్మణ రావు (శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వ్యవస్థాపకుల్లో ఒకరు) చొరవతో విజ్ఞాన చంద్రికా మండలి 1905 సం॥లో స్థాపించారు. మండలికి రావిచెట్టు రంగారావు కార్యదర్శిగా ఆయన స్వగృహం‌లోనే పుస్తక ప్రచురణ కార్యకలాపాలు జరిగేవి. నిజాం ప్రభుత్వ నిఘా ఎక్కువ కావడంవల్ల 1908 సం॥లో ప్రచురణా కార్యకలాపాలను మద్రాసు మార్చడంతో వీరభద్ర రావు కూడా మద్రాసు వెళ్లాడు. లక్ష్మణ రావుతోపాటు పలువురు ప్రసిధ్ధరచయితలు, పరిశోధకులు, పండితులతో కల్గిన పరిచయం ఆయనను గొప్ప రచయితగాను, పరిశోధకునిగానూ, చరిత్రకారునిగానూ తీర్చిదిద్దింది.

మద్రాసునుండి 1914లో హైద్రాబాద్ తిరిగివచ్చిన పిదప తొలుత మహబుబ్ కాలేజీలోనూ, తదుపరి తను విద్యాభ్యాసం చేసిన చాదర్ఘాట్ హైస్కూల్లోనూ, నారాయణగూడా బాలికోన్నత పాఠశాలోనూ తెలుగు పండితునిగా పనిచెశారు. తెలుగు పురాణ కధలన్నీ అతిశయోక్తులని ఒక క్రిష్టియన్ విద్యార్ధి అపహాస్యం చేయడంతో గ్రీకు ఇతిహాసాలను అధ్యయనం చేసి “గ్రీకు పురాణ గాధల”నే పుస్తకాన్ని రాశారు. అతిశయొక్తులన్ని ఇతిహాసాల్లోను ఉన్నాయని నిరూపించారు.

వీరభద్రరావు ఇతర రచనలు: జీవిత చరిత్రావళి, షితాబ్‌ఖాన్ చరిత్ర, ప్రాచీనాంధ్ర నగరములు, మన తెలంగాణము, లలిత కధావళి. తెలంగాణా తల్లికి నిండైన సేవలందించిన వీరభద్రరావు 28 సెప్టెంబర్ 1973 సం॥లొ మరణించారు.

శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపకులలోనూ ప్రధములైన రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణ రావుల ఆశయాలైన గ్రంధాలయ నిర్వహణ, పుస్తక రచన, ప్రచురణలలొ శ్వాసించి జీవించిన వీరభద్ర రావును ఘనంగా స్మరించుకుందాం.


1 నవంబర్ ప్రపంచ స్వచ్చ శాఖాహార దినోత్సవము (1November World Vegan Day)
స్వచ్చ శాఖాహారానికి (వెగాన్- vegan) శాఖాహారానికి (వెజిటేరియన్- vegetarian) ల తేడాను మనకంటే పాశ్చ్యాత్యులు స్పష్టంగా వివరిస్తారు. ఉపరితలంగా చూస్తే ఇద్దరూ మాంసాహారాన్ని త్యజిస్తారు. వెగాన్లు జంతువులకు సంబంధించిన ఎటువంటి ఉత్పత్తులనూ అంటే పాలు, గుడ్డు, జున్ను, చివరకు జంతు చర్మాలతో చేసిన వస్తువులను కూడా ఉపయోగించరు. ఇది వారి తాత్విక చింతన, జీవన విధానం. భూతదయ, జీవవైవిధ్య పరిరక్షణ వంటివాటికంటే ఎక్కువగా జంతువులకు గల హక్కులను గౌరవించడం వీరికి ప్రభానాంశం.
ఇక శాఖాహారుల ఆహార వ్యవహార నియమాలు ఇంత ఖచ్చితంగా ఉండవు. వీరిలో అధికశాతం వైద్యులసలహామేరకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా శాఖాహారానికి పరిమితమైనవారు.
అమెరికా తదితరదేశాలకు వెళ్ళిన భారతీయులు తొలుత ఈసందిగ్ధానికి గురౌతారు. హోటళ్ళకెళ్ళినప్పుడు తమ వెగాన్ లేదా వెజిటేరియన్ ప్రాధమ్యాన్ని తెల్యజేయాలి.
వెగాన్ (స్వచ్చ శాఖాహారం) భావనను నవంబర్ 1వ (1944) తేదీన బ్రిటిష్ వెగాన్ సొసైటీ సహవ్యవస్థాపకుడైన డోనాల్డ్ వాట్సన్ ‘వెగాన్’ అంటే “పాల ఉత్పత్తులను నిసర్జించిన శాఖాహార”మని నిర్వచించాడు. ‘జంతువులను బాధించని జీవన విధానమని’ 1951లో ప్రపంచ స్వచ్చ శాఖాహార సంఘం తమ సిధ్ధాంతమని వివరిస్తూ ‘గుడ్డు, తోలు సంచులవంటి వినిమయ వస్తువులనుకూడా ఉపయోగించకూడ’దని తమ సభ్యులను కోరింది. జీవప్రాణుల హక్కులతోపాటు గౌతముడు, ఉపనిషత్తులు ప్రవచించిన ‘అహింస’ మానవుని జీవనవిధానంకావాలని ప్రచారం చేశారు.
ప్రపంచ స్వచ్చ శాఖాహార సంస్థ ఐదు వసంతాలు/అర్ధ శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే క్రమం‌లో 1994 నవంబర్ 1వ తేదీన ‘ప్రపంచ స్వచ్చ శాఖాహార’ దినోత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించింది. ఈరెండు దశాబ్దాల కాలం‌లో స్వచ్చ శాఖాహారంపట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్గించడంవల్ల స్వచ్చ శాఖాహారాన్ని జీవన విధంగా స్వీకరించినవారి సంఖ్యపెరిగింది.
మాంసాహారాన్నీ, జంతుసంబంధిత ఆహారాన్నిపూర్తిగా నిసర్జించలేనివారు కనీసం ఈ రోజున్నైనా ‘స్వచ్చ శాఖాహారా’న్ని స్వీకరించాలని ‘ప్రపంచ స్వచ్చ శాఖాహార సంస్థ’ విజ్ఞప్తి చేస్తున్నది. తొలుత నెలకొకరోజుతో శాఖాహారం ప్రారంభించి పక్షం రోజులు, తదుపరి వారంరోజులు ఆపై ప్రతీరోజూ క్రమంగా దశలవారీగా శాఖాహారం నుండి స్వచ్చశాఖాహారానికి మారి సంపూర్ణ స్వస్థతతో జీవితకాలాన్ని పెంచుకొని ఆనందంగా జీవించాలని సూచిస్తున్నారు.
ప్రయత్నిద్దామా మరి!

No comments:

Post a Comment