Thursday 2 June 2016

జనరల్ ఎస్సేస్ (Birthdays)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ- జనరల్ ఎస్సేస్ 

image not displayed
సర్వేజనా సుఖినోభవంతు




23 జూన్ అంతర్జాతీయ ఒలంపిక్స్ దినోత్సవం (23 Jun International Olympics Day)

ఒలంపిక్స్ దినోత్సవం, ఒలంపియాడ్ దినము- ఈ రెండింటితో పలువురు గందరగోళ పడతారు. ఇది ఒలంపిక్స్ దినోత్సవం. విషయాలవారీగా, అంశాలవారీగా పోటీలు నిర్వహించే సంస్థలు గణీత ఒలంపియాడ్, సంగీత ఒలంపియాడ్ వంటి పేర్లతో నిర్వహించుకుంటాయి. ఒలంపిక్స్ దినోత్సవాన్ని అంతర్జాతీయ ఒలంపిక్స్ సమితి ఆధ్వర్యం‌లో ఆయాదేశాల జాతీయ ఒలంపిక్స్ కమిటీలు నిర్వహిస్తాయి.

స్టాక్ హం (స్వీడన్ రాజధాని)లో 1947 సం. జరిగిన 41 వ సమావేశం‌లో జెకోస్లేవియాకు చెందిన డాక్టర్ గ్రస్, ‘ఒలంపిక్ క్రీడలనే భావాన్ని ప్రపంచ ప్రజానీకం‌లోకి తీసుకువెళ్ళడంకోసం ఒలంపిక్స్ దినొత్త్సవం జరుపుకోవాలని’ సూచించాడు. కొన్నినెలల తర్వాత స్విజర్‌లాండ్‌లోని సెయింట్ మోరిజ్ పట్టణం‌లో జరిగిన 42 వ సమావేశం‌లో ఈ ప్రతిపాదన కార్యరూపం దల్చింది. దానికణుగుణంగా ఆధునిక ఒలంపిక్ క్రీడల వ్యవస్థాపకుడు క్యూబర్టిన్ ఈక్రీడల పునరుధ్ధరణకు పూనుకున్న జులై 23వ తేదీ (1894) ని అంతర్జాతీయ ఒలంపిక్స్ దినోత్సవంగా నిర్ణయించారు.
తొలి ఒలంపిక్స్ దినోత్సవం 23 జూన్ 1948లో జరిగింది నాటి అంతర్జాతీయ ఒలాంపిక్స్ కమిటీ అద్యక్షుడు సిగ్ఫిడ్ ఎడ్‌స్టమ్మ్ క్రీడలు, క్రీడాస్ఫూర్తిపట్ల యువతనుద్దేశించి సందేశమిచ్చాడు.
ఒలంపిక్స్‌ను నాలుగేళ్లకోసారి జరిగే మొక్కుబడి కార్యక్రమం మాదిరిగా కాకుండా ప్రపంచ శాంతి సాధనంగానూ, ఉద్యమంగానూ నిర్వహించడం కోసం ఒలంపిక్స్‌ దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనీ, యువతనూ, విద్యార్ధులనూ, ప్రత్యేకింఛి మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలనీ సభ్యదేశాలను కోరింది.
ఒలంపిక్స్ పట్ల , క్రీడల పట్ల యువతను జాగృతం చేయడానికి జాతీయ ఒలంపిక్స్ సంఘాలు ప్రతీ సంవత్సరం ఈరోజున ఒలంపిక్ పరుగును నిర్వహిస్తాయి.
(LSD Vs MLD) ఒలంపిక్స్ దినోత్సవం కేవలం పరుగులకే పరిమితంకాకుండా ఒలంపిక్ క్రీడలకు మూలభావనలైన “కదులు (move- M), అభ్యసించు(learn- L), కనుగొను (discover- D), సంక్షిప్తంగా MLD నేటిసమాజం‌లోని జాతి, మత, లింగ, సామాజిక అభిజాత్యాలవంటి LSD (Lysergic Acid Diethylamide- అత్యంత శక్తివంతమైన మత్తుమందు) కు విరుగుడుగా వర్ణించారు. గతం‌లో ఎటువంటి క్రీడా నెపధ్యం‌లెనివారు కూడా క్రీడాకారులుగా ఎదగవచ్చుననీ, ఆరోగ్యవంతమైన జీవితంతోపాటు శాంతియుత సమాజాన్ని కూడా నెలకొల్పవచ్చుననీ వివరీంచారు.
యోగా క్రీడలతోపాటు ప్రకృతి విధ్వంసక వినిమయ సంస్కృతిని నిసర్జించినప్పుడే ఆరోగ్యకరమైన, శాంతియుత సమాజం నిర్మితమౌతుంది.

ఆధునిక ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమైన 6 ఏప్రిల్ (1896) తేదీని “అంతర్జాతీయ క్రీడల ద్వారా శాంతి దినోత్సవంగా ఐక్య్యరాజ్య సమితి నిర్వహిస్తుంది.

బారత హాకీ మాంత్రికుడు ధ్యాంచంద్ జయంతియైన ఆగస్ట్ 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము.



14 జూన్ ప్రపంచ రక్త దాతల దినోత్సవం (14 World Blood Donor Day)
శరీరానికి రక్త ప్రసరణ ఊపిరితితులద్వారా జరిగుతున్నదని ఆంగ్ల వైద్యుడు విలియ హార్వేకు పూర్వపు వైద్య శాస్త్రవేత్తలు భావించేవారు. గుండె, రక్త ప్రసరణకు సంబంధించి పలుకోణాలలో మానవ శరీరాన్ని అధ్యయనం చేసిన విలియం హార్వే శరీరానికి రక్త ప్రసరణ గుండేద్వారా జరుగుతున్నదని 1628లో ప్రకటించాడు.

రక్తం‌లోని వైవిధ్యాన్ని గమనించి ఎ, బి, ఓ గ్రూపులుగా గుర్తించిన వైద్యుడు, నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ లాండ్‌స్టెయినర్ జయంతియైన జూన్ 14వ (1868) తేదీని ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సంస్థలు 2004 సంవత్సరం‌లో చేసిన విజ్ఞప్తి 2005 సంవత్సరం‌నుండి కార్యరూపం దాల్చింది. స్వచ్చందంగా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా రక్త దానానికి ముందుకు వచ్చి అవసరాలకు సరిపడినంతగా అందిస్తున్న దాతలందరికీ ఈరోజున ధన్యవాదాలు చెబుతారు.

రక్తదాతనుండి సేకరించిన రక్తం‌లో బాగాలైన ఎర్రరక్త కణాలు, ప్లాస్మా, తెల్ల రక్త కణాలను రక్త ఉత్పత్తులు (blood product) అంటారు. సాధారణంగా రక్తాన్ని యధాతధంగా ఇతరులకు ఎక్కించరు. శాస్త్రీయ విధానాల్లో రక్తం‌లోని భాగాలను విడగొట్టీ రక్త గ్రహీతకు అందజేస్తారు.

18 నుండి 60 సం. వయసు, 45 కిలోల కంటే ఎక్కువ బరువుగల వ్యక్తులెవరైనా మూడునెలలకోసారి ఒక యూనిట్ (350 మి.లీ) రక్తాన్ని దానంచేయవచ్చు. అంటే సంవత్సరం‌లో నాలుగుసార్లు రక్తదానం చేయవచ్చూ. శరీరం కోల్పోయిన రక్తాన్ని తిరిగి 24 గం.ల్లో సమకూర్చుకుంటుంది. అలాగే కోల్పోయిన హీమోగ్లోబిన్‌ను తిరిగి 18 వారాల్లో సమకుర్చుకుంటుంది.

మనదేశ జనాభా నూటా ఇరవై కోట్లు ఉన్నప్పటికీ విచక్షణకలిగిన విద్యవంతులున్నప్పటికీ ప్రతీ సంవత్సరం మనకు 30 లక్షల యూనిట్ల రక్తం కొరతగాఉంటూంది. సగటున ప్రతీ సం. ఒక కోటీ ఇరవై లక్షల యూనిట్ల రక్తం అవసరం కాగా 90 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే సేకరించబడుతున్నది.

సేకరించిన రక్తం నిలువ్ ఉండేదికేవలం 35 నుండి 42 రోజులే. ఎప్పటికప్పుడు రక్తపు నిల్వలను కొనసాగింఛాలి. భారతీయులలో మరో 2% పౌరులు రక్తదానానికి ముందుకు వస్తే ఆపద్ సమయాలలో ఎటువంటి కొరతాలేకుండా ప్రాణాలను నిలబెట్టవచ్చూ. పౌరుల్లో రక్తదానం ఒక జీవన విధానం కావాలి. రక్తదానంపట్ల పిల్లలకు , విధ్యార్ధులకు సానుకూల దృక్పధాన్ని చేకూర్చవలసిన బాధ్యత తలిదండ్ర్లులు మరియు ఉపాధ్యాయులదీ.

సంబంధిత ఇతర తేదీలు: మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
1 అక్టోబర్ జాతీయ స్వచ్చంద రక్త దాత దినోత్సవం
   



12 జూన్ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (12 Jun World Day Against Child Labor)

“పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా! పాలు మరిసి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గలా జీతగాడా!! “ సుద్దాల హన్మంతు రాసిన ఈపాట తెలంగాణా సాయుధపొరాటం‌లో శ్రామిక వర్గాన్ని ఒక ఊపు ఊపింది. కమ్యునిస్టు పార్టీ నిర్వహించే సభల జనసమీకరణకోసం పాడిన ఈ పాటను సభకార్యక్రమం‌లోనూ సభికులు పాడించుకునేవారు. ఎనభయ్యవ దశకం‌లో ఆల్ టైం రికార్డ్‌గా నిలిచిన ‘మాభూమి’ సినిమాలో గాయని సంధ్య పాడిన ఈపాట సూపర్ హిట్. తెలంగాణా సాయుధపోరాట తదుపరికాలం‌లో యజమానులు, దోపిడీ రూపం మారాయి కానీ బాలల వెతలు తీరలేదు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ 2008లో గణాంకాల ప్రకారం 5-17 సం మధ్య వయస్కులైన బాల కార్మికులు సంఖ్య 25 కోట్ల నుండి 30 కోట్లు. అడపాదడపా తేలికైన పనులు చేసే పిల్లలను మినహాయిస్తే 15 కోట్ల మందికి పైగా ఉంటారని వివరిస్తూంది. వీరిలో అత్యధికులు వ్యవసాయ రంగంలో నియమిత వేళలకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్నారు. వారు విద్య, ఆరోగ్యం, అవసరమైన విరామం, మౌలిక స్వేచ్చ వంటివాటికి దూరమై బాలలుగా తమ హక్కులతోపాటు భావి జీవితాన్ని కూడా కోల్పోతున్నారు. బలవంతపు చాకిరీ, ప్రాణాపాయకరమైన పరిశ్రమలలో పనిచేయడం, బానిసత్వం, మత్తు పధార్ధాల రవాణా వంటి అనైతికమైన/ ఆసాంఘీక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి లాగటంవంటి వాటితో పాటు కొన్నిదేశాలు పిల్లలను బాల సైనికులుగాసైతం నియమించుకుంటున్నాయి. పేదరికం, సామాజికరక్షణ, సరియైన విద్యావసతులు లేకపోవడం, కొన్ని కర్మాగారాలలో యోగ్యమైన వసతుల లేమివల్ల వయోజనులు నిరాకరించడంతో పిల్లల ఇందులో కూరుకుపోతున్నారు..భారతదేశంలో అత్యధిక బాల కార్మికులు దళిత, గిరిజన, బహుజనులే.

అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రాయోజితం చేసిన ప్రపంచ బాల కార్మికుల దినోత్సవాన్ని 2002 సం||లో మొదటిసారిగా నిర్వహించారు. జన బాహుళ్యంలో జాగరూకత పెంచడంతో పాటు బాలకార్మిక వ్యవస్థను అడ్డుకోవదానికి కృషిచేయాలని సభ్యదేశాలను కోరింది. పనిలో చేర్చుకోవడానికి కనీస వయసునిర్దేశించడంతో పాటు ప్రమాదకరమైన పరిశ్రమలలో బాలలు పనిచేయడాన్ని నిషేధించింది. పిల్లలకు పౌష్టిక ఆహారం అందివ్వాలని నిర్దేశించింది. ఇది కార్యక్రమంగా కాకుండా స్వచ్ఛంద సంస్థల ఉద్యమం తీరున ఉండాలని ఆకాంక్షించింది. ఇందులో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వేతర సంస్థలు, సమాజం, ఉద్యోగులూ ఆందరూ కలసి రావాలని కోరింది.

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం వీటిని వ్యతిరేకించడమే కాకుండా బడిఈడుపిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలనీ, వారికి నాణ్యమైన విద్య అందించడం అత్యంత ప్రాముఖ్యమైందనీ భావిస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం కావడానికి కూలంకుషంగా సమీక్ష అవసరమని సూచించింది.

బాల కార్మికులను విడిపించడానికి మీరు తీసుకోవాల్సిన చిన్న శ్రమ కేవలం ఒక్క ఫోన్ కాల్ చేయడమే. నిరక్షరాస్యులు సైతం గుర్తుంచుకోగల్గే విధంగా పది, తొమ్మిది. ఎనిమిది (1098) నెంబరుకు ఫోన్ చేసి మీకు తెల్సిన బాలకార్మికుల గురించి చెబితే ప్రభుత్వ యంత్రాంగం తనపని తాను చేసుకుపోతుంది. మీ వివరాలు బయటికి రావు. ఈ ఫోనుకు బిల్లు/ ఛార్జీ కూడా ఉండదు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణాకు బాలకార్మిక వ్యవస్థ ఒక రాచపుండు. దీన్ని తొలగించి ఇటువంటి అమానవీయ పధ్ధతులను అరికట్టడంలో మనమందరం భాగస్వాములం కావాలి.

విజ్ఞులైన పౌర సమాజం ఈ దురాచారాన్ని అరికట్టడంలో భాగస్వాములు కావాలి.


11 జూన్ గిరి క్రాంతి ప్రదాత హెమెండెర్ఫ్ వర్ధంతి ( 11 Jun DA Haimandarf)
వియెన్నా (అస్ట్రియా) లో 1909 సం. (22 జూన్) జన్మించిన క్రిష్టఫర్ వన్ ఫరో హెమన్‌డర్ఫ్ వియెన్నా విశ్వవిద్యాలయం‌నుండి మానవ పరిణామ శాస్త్రం‌లో(ఆంధ్రోపాలజీ) పీ హేచ్‌డీ పట్టా తీసుకున్నాడు. అమెరికాలొని రాక్‌ఫెలర్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విఖ్యాత మానవ పరిణామ శాస్త్ర అధ్యాపకుడు బ్రోనిస్‌లా మాలినోవ్‌స్కి వద్ద అధ్యయనం చేశాడు.

హెమన్‌డెర్ఫ్ దంపతులు 1935-36 కాలం‌లో రాక్‌ఫెలర్ ఫౌండేషన్ ఆర్ధికసహాయంతో భార్తదేశం‌లోని ఆదివాసీల పరిణామక్రమాన్ని అధ్యయనం చేయడానికి వచ్చారు. తొలుత ఈశాన్య రాష్టాల్లోని నాగాలపైనా, తదుపరి నాటి అవిభక్త మద్రాస్ రాష్ట్రం‌ గోదావరి జిల్లా గొండులపైనా పరిశోధనలు చేశారు. నాగాలాండ్‌లో నివాసమేర్పర్చుకున్న హెమన్‌డెర్ఫ్ దంపతులు ఐదునెలల్లోనే నాగాల భాషను నేర్చుకొని ద్విభాషి సహాయం‌లేకుండా స్థానికులతో సంభాషించగల్గారు. పరిశోదకులకైనా, సామాజిక కార్యకర్తలకైనా స్థానికంగా నివసింఛడం, స్థానిక భాషలో ప్రావీణ్యత అవసరమని నొక్కి చెప్పేవాడు.

నాటి హైద్రాబాద్ రాజ్యం‌లోని ఆదిలాబాద్ ప్రాంతం‌లో జోడేఘాట్ (కెరామెరి మండలం) కొమురం భీం నాయకత్వం‌ వహించగా జరిగిన భీకరపోరాటం‌లో భీం మరణించాడు. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణపరిస్థితులు నెలకొనటానికి క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపి తగు సూచనలు చేయవలసిందిగా నిజాం కోరాడు. ఆదిలాబాద్ జిల్లాకు 1941లో చేరుకున్న దంపతులు మార్లవాయి గ్రామసర్పంచ్ లచ్చుపటేల్ నిర్మించిన ఓ గుడిసెలో తమజీవనం ప్రారంభించారు. పరిశోధకులజంట త్వరలోనే స్థానిక సంప్రదాయాలను మర్యాదలను నేర్చుకొని చెంచు, రాజగొండు తెగలపై అధ్యయనం చేశారు. విశేషమెమంటే హెమన్‌డెర్ఫ్ దంపతులను రాజగొండులు స్థానికులుగానే ఆదరించారు.

హెమన్‌డెర్ఫ్ దంపతులు గిరిజనుల జీవన సరళిపై తమ పరిశీలనను 3650 పేజీలలో, 100 గంటల (16 యం యం) చలన చిత్రాల్లోనూ, 10000పైగా చాయాచిత్రాలలోనూ నమోదు చేశారు.

లండన్‌కు తిరిగివెళ్ళిన హెమన్డెర్ఫ్ లండన్ విశ్వవిద్యాలయం‌లో ప్రాచ్య మరియు ఆఫ్రికా ప్రాంతాల అధ్యయన కెంద్రానికి ప్రధానాచార్యులుగా సేవలందించాడు.

గిరిజనాభివృధ్ధి అంటే వేష భాషలు మార్చుకొనే ఆదునీకరణ కాదనీ వారి సాంస్కృతీ సాంప్రదాయలను కొనసాగిస్తూనే విద్యార్జన ద్వారా మేధోపరమైన అభివృధ్ధిని సాధించడమనీ, తమ తదుపరి తరాలవారిని ఉన్నత తీరాలకు చేర్చదమనీ హెమన్‌డెర్ఫ్ దంపతులు చెప్పేవారు. మౌఖికంగా కొనసాగుతున్న వారి భాషను దేవనాగరి లిపిద్వారా అక్షరాస్యులని చేసి విద్యావంతులుగా తీర్చిదిద్దారు. గిరిజన ప్రాంతాలకు వలసలను అదుపుచేయాలనీ, గిరిజనుల భూములకు సంబంధించినంతవరకు చట్టాలు కఠినంగా ఉండాలనీ సూచించాడు.

అర్ధశతాబ్ది క్రితం హెమండేర్ఫ్ దంపతులు గిరిజనులపై చేసిన పరిశోధనలూ, జటిల సమస్యలకు సూచించిన పరిష్కార మార్గాలూ నేటికీ మార్గదర్శకం, అనుసరణీయం. ఇంగ్లండుకు తిరిగి వెళ్ళినతదుపరికూడా హెమెన్‌డెర్ఫ్ దంపతులు తరచుగా మార్లవాయికి వచ్చేవారు. పరిస్థితులు మెరుగుపడకపోవడం పట్ల చింతించేవారు.

హెమెన్‌డెర్ఫ్ మరణానంతరం (1995) అతనికుమారుడు నికోలస్ హెమన్‌డెర్ఫ్ లండన్‌నుండి ఆస్తికలను (2012 ఫిబ్రవరి 25 వ తేదీన) తన తల్లి బెటీ హెమన్‌డెర్ఫ్ సమాధిపక్కనే సమాధి చేశారు. బెటీ హెమన్‌డెర్ఫ్ 1987 సం. జనవరి 11 తేదీన హైద్రాబాద్‌లో మరణించింది.

“భారత గిరిజనులతో జీవనం” అతని ఆత్మకధ. ఆ దంపతులకు నివాళులర్పించడం మన కనీస బాధ్యత
   



10 జూన్ పైడిమర్రి వెంకట సుబ్బారావు శత జయంతి (10 Jun Birth Centenary of Pydimarri Venkata Subba Rao)

జాతీయగేయం (వందమాతరం) జాతీయ గీతం (జనగణమన) దేశఔన్నత్యాన్ని తెలిపితే ప్రతిజ్ఞ దేశంపట్ల పౌరవిధులనూ, బాధ్యతలనూ తెల్యజేస్తుంది.

ప్రమాణం, ప్రతిజ్ణ వంటి పదాల అర్ధం ఒకటే ఐనప్పటికీ సాధారణంగా భగవంతుని సాక్షిగా లెదా సమక్షం‌లో స్వీకరించడాన్ని ప్రమాణం (ఓత్) గా నిర్వచిస్తారు (న్యాయ స్థానాల్లో సాక్షులు, అధికారక బాధ్యతలు స్వీకరించేటప్పుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు). ప్రతిజ్ఞ మరింత విస్తృతమైనది.

పలుదేశాల్లో విద్యార్ధులు, పౌరులు రాజ్యాంగంపై కాకుండా ఆదేశపు రాజు, రాణి లేక రాజవంశ సంక్షేమంకోసం ప్రతిజ్ఞ చేస్తారు. మనదేశ ప్రతిజ్ఞలో దేశానికీ, పౌరులకోసం ప్రతిజ్ఞ చేస్తాం

దేశ ప్రతిజ్ఞను 1962 సం.లో తొలుతగా తెలుగు భాషలోనే రూపొందించినవాడు పైడిమర్రి వెంకట సుబ్బారావు అనే తెలంగాణా బిడ్డ. అప్పుడాయన విశాఖ పట్నం‌ జిల్లా ఖజానా కార్యాలయం‌లో పనిచేస్తుండేవారు. తనకు సన్నిహితుడైన కాంగ్రేస్ నాయకుడు తెన్నెటి విశ్వనాధంకు చూపించగా ఆయన నాటి విద్యామంత్రి పీవీజీ రాజు తీసుకెళ్ళాడు. పాఠశాలలో ప్రతిజ్ఞ చదవడం ప్రారంభించింది మొదట విశాఖపట్నం‌ 1963లో. తెలుగులో రాయబడ్డ జాతీయ ప్రతిజ్ఞ్జ భారతభాషలన్నింటిలొకి అనువదించబడి 1965 గణతంత్ర దినోత్సవం నుండి దేశవ్యాప్తంగా ఆచరణలొకి వచ్చింది. గత సంవత్సరం విశాఖపట్నం‌లో ‘ప్రతిజ్ఞ’ స్వర్ణోత్సవాలు నిర్వహించారు.

పైడిమర్రి వెంకట సుబ్బారావు స్వస్థలం నల్గొండ జిల్లా ఆనేపర్తి. ఆయన జననం 10 జూన్ 1916 (మరణం 1988). నేటికి సరిగ్గా 100 సంవత్సరాలు. జాతీయగేయంతో పాటు రచయిత బంకించంద్ర చటర్జీ, జాతీయ గీతంతోపాటు రచయిత రవీంద్రునిపేరు కన్పిస్తాయి కానీ విద్యార్ధులు రోజూ చదివే ప్రతిజ్ఞ రాసినవారి పేరు ఇటీవలివరకు కనిపించేది కాదు. తెలంగాణా ప్రభుత్వం అధికారం‌లోకి వచ్చినప్పడినుంది ఈయన పేరును ప్రచురిస్తున్నారు. పైడిమర్రి బహుభాషా కోవిదుడు. ఆయన రాసిన కాలభైరవుడనే నవల ప్రజాదరణ పొందింది.

అంతేకాదు, ప్రతిజ్ఞను పాఠ్యపుస్తకాల్లోచేర్చిన విషయంకూడా ఆయనకు తెల్యదు. పదవీ విరమణ తర్వాత ఒక రోజు ఆయన మనమరాలు ‘ప్రతిజ్ఞ’ ను తనకు నేర్పించమంటూ పుస్తకం ఇచ్చినప్పుడు ఆశ్చర్య పోవాల్సివచ్చింది. తొలుత ప్రతిజ్ఞ రచయిత తానేనని పైడిమర్రి గారు చెప్పుకున్నా ఎవరూ నమ్మలేని పరిస్థితి. భారతప్రభుత్వం రికార్డుల్లో ఆయనపేరు నమోదైవుండటం వల్ల రచయిత ఆయనేననే విషయం ప్రాచుర్యం‌లోకి వచ్చింది.

ఆయన విగ్రహాన్ని పార్లమెంటులోనూ, అసెంబ్లీ ఆవరణల్లోనూ స్థాపించి పోస్టల్ స్టాంపును విడుదల చేయాలి. భారతజాతితోపాటే ఆయన రాసిన ప్రతిజ్ఞ కొనసాగుతుంది కావున ‘పద్మ విభూషన్’ పురస్కరించాలి. తెలంగాణా ప్రభుత్వం హైద్రాబాద్ టాంక్‌బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
నేడు ఆయనను ఘనంగా సంస్మరించుకోవాల్సిన సందర్భం.
  




9 జూన్ అంతర్జాతీయ అభిలేఖాగార దినోత్సవం (9 Jun International Archives Day)

యునెస్కో ఆధ్వర్యంలో అంతర్జాతీయ అభిలేఖాగార సంస్థ సమావేశమైన జూన్ 9 వతేదీ (1948) అంతర్జాతీయ అభిలేఖాగార దినోత్సవంగా జరుపుకుంటారు.

అభిలేఖాగారాన్ని పలువురు గ్రంధాలయంగా భావిస్తారు. ఈ రెండింటికీ గల మౌలికమైన తేడాలను తెలుసుకుందాం
పాఠకుల ఉపయోగంకోసం సేకరించబడ్డ ముద్రిత అముద్రిత (రాత పత్రికలు) గ్రందాలను, (కొన్నిసార్లు అంతర్జాల సమాచారంకూడా కావచ్చు) గ్రంధాలయం‌లో ఉంచుతారు. పాఠకులు వీటిని అక్కడే చదువుకోవచ్చు. అనుమతించిన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళవచ్క్చు.

అభిలేఖాగారం కూడా ప్రజలకోసం రూపొందించిందే. ఇందులో పుస్తకాలకు బదులుగా ఒక వ్యవస్థకు సంబంధించిన పురాతన దస్త్రాలుంటాయి, ముద్రిత, అముద్రిత విషయాలు ఏ రూపం‌లోనైనా అంటే వ్రాత ప్రతులు, ఉత్తరాలు, చాయా చిత్రాలు, కొన్నిసార్లు దృశ్య శ్రవణ చిత్రాల రూపం‌లో కూడా ఉండవచ్చు.. సాధారణంగా ఈ పత్రాలను ఇంటికి తీసుకెళ్ళడానికి అనుమతించరు. నామ మాత్రపు రుసుముతో నకళ్ళు అందజేస్తారు.

అబిలేఖాగారాలలో కళారుపాలు, పుస్తకాలు, దినచర్యలు, వీటితోపాటు అంకరూపం‌లో కూడా పరిశోధకులకు అందుబాటులో ఉంటాయి. అవి సహజంగా అరుదైనవిగా ఉంటాయి

అభిలేఖగారం‌లోనుండేవి అత్యంత అరుదైన డాక్యుమెంట్లు, వాటిని నేటితరాలకేకాక భవిష్యత్ తరాలకుకూడా అందజేయాల్సిఉన్నందున ఆడాక్యుమెంట్ల సం‌రక్షణకు కృషిచేస్తారు.

గ్రంధాలయం‌లో ఒకపుస్తకం చినిగిపోతే గ్రంధపాలకుడు మరో పుస్తకం కొనే అవకాశం ఉంది. కానీ అబిలేఖాగారం‌లో ఒక పత్రం ధ్వంసమౌతె మరోపత్రాన్ని సేకరించే అవకాశం లేదు.

ఒక గ్రంధాలయం‌లో విభాగంగా ఒక అభిలేఖాగారం ఉండవచ్చు. అలాగే ఒక అభిలేఖాగారం‌లో ఓ గ్రంధాలయం ఉండవఛ్చు. కానీ అవి ఒకటి కావు. దేనిప్రతిపత్తి దానికదే.

స్వాతంత్ర్య సమరయోధులు, కొందరు జవాన్లు, ఉద్యమకారుల వద్ద వారి పోరాటకాలానికి సంబంధించిన పత్రాలు లభ్యమౌతాయి. వీటిని సమకూర్చినట్లయితే చరిత్రలోని పలుసమస్యలను పరిష్కరించవచ్చు. అనేక గుణపాఠాలను నేర్చుకోవచ్చు

గ్రంధలయాలను సాధారణంగా పాఠకులు సందర్శిస్తారు. అభిలేఖాగారాలను ముఖ్యముగా పరిశోధకులు, అవసరాలమేరకు ప్రభుత్వాధికారులు సందర్శిస్తారు.

జాతీయ గ్రంధాలయ దినోత్సవం (14 నవంబర్), అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (18 మే), అంతర్జాతీయ అభిలేఖాగార దినోత్సవం (9 జూన్) రోజులలో ఆయా స్థలాలకు విద్యార్ధులను సందర్శింపజేస్తే వారికి తేడా అర్ధం కావడంతో పాటు ఉపయోగించే విధానం కూడా తెలుస్తుంది.

ఈరోజు అభిలేఖాగారాన్ని సందర్శించి అభిలేఖాగారకులకు శుభాకాంక్షలు చెబుదాం.
   
   

   




2 జూన్ అంతర్జాతీయ వేశ్యల దినోత్సవం (2 Jun International Sex Workers Day)

వేశ్యలకో దినోత్సవమా? వారిని తలుచుకోవడమా? వారు సమాజానికి చెసిన సేవలేమిటి? వాళ్ళు ఉధ్దరించిందేమిటి? సుఖరొగాలను అంటగట్టినందుకా? లక్షాధికారులను సైతం బిక్షగాళ్ళను చేసినందుకా? సహజంగా, సామాన్యంగా ఎదురయ్యే ప్రశ్నలు. అంతర్జాతీయ వేశ్యల దినోత్సవం రోజున ఒక్కసారి వాళ్ళగురించి మానవీయ కోణం‌లో సావధానంగా ఆలోచిద్దాం.
వేశ్య, వెలయాలు, రండీ, బిచ్ ఇలా ఏ పేరుతో పిలిచినా, అపహాస్యం చేసినా ఆదిమకాలం‌నుండి ఆధునికకాలందాకా ఆమెవ్యధలో మార్పులేదు. అలానె మోసగించబడుతూంది, అవమానించబడుతూంది.

వేశ్యలు, వేశ్యావృత్తి నైతికత గురించి చర్చకు అంతులేదు.ఆదిమకాలం నుండి ఆధునిక కాలందాకా పురుష దురహంకార ఫలితంగానే వేశ్యా వృత్తి ఉద్బవించింది, కొనసాగుతున్నది. ఐచ్చికంగా వేశ్యావృత్తి స్వీకరించిన వారి సంఖ్య అత్యల్పం, పురుషాధిక్య వ్యవస్థకు బలియైన వారి సంఖ్య అత్యధికమనేది సామాజిక సత్యం. ఈవ్యవస్థ అంతంకావడానికి క్రియాశీలమైన పరిష్కారం లభించేదాకా ఇది కొనసాగుతుందనెది వాస్తవం.

ప్రపంచ వ్యాప్తంగా 4కోట్ల 20 లక్షలమంది వేశ్యలున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా. మనదేశం‌లో వీరి సంఖ్య20 లక్షలుంటుందని భారత మహిళా శిశు సంక్షేమం శాఖ అంచనావెసింది. ఈసంఖ్యకు మరో 25% ఆదనంగా చేర్చుకోవచ్చని స్వచ్చంద సంస్థలు చెబుతున్నాయి.

అభివృధ్ధి చెందిన దేశాల్లో ఈవృత్తి అధికులకు ఐచ్చికమైతే భారత్ వంటి 3వ ప్రపంచదేశాల్లో అత్యధికశాతం నిర్బంధంగా ఈ
వృత్తిలో కొనసాగుతున్నారే. వీరిలో 90%మంది బడుగు బలహీన వర్గాలవారు మరియు 15 సం.లోపే ఈ వృత్తిలోకి నెట్టబడ్డవారు. ఉపాధి, ఉద్యోగంకోసం నమ్మివచ్చిన ఈ ఊబిలో దిగబడ్డవారు కొందరైతే, కుటుంబ అవసరాలకోసం ఈఆపదలో పడ్డవారు మరికొందరు. కొద్దికాలం క్రితం విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ కేసులో అత్యధికులు రాజకీయనాయకులేనని, వారి ప్రోద్బలంతోనే ఈ వ్యాపారం విస్తరించిందని పోలీసులు నివేదించిన విషయం మిత్రులకు గుర్తుండే ఉంటుంది.

వేశ్యల ప్రధాన సమస్య వారి ఆరోగ్యముతోపాటు లైంగిక, శారీరక హింసనుండి రక్షణ. అత్యధికశాతం విటులు కండోమ్‌లు వినియోగించడానికి ఇష్టపడరనీ, లైంగిక చర్యలో లైంగిక హింసకూడా ఉంటుందనీ, ఆహింసను అంగీకరించకపోతే ఆవేశ్యావాటిక యజమాని వద్ద ఉండే రౌడీల హింస ఇంకా దారుణంగా ఉండటంవల్ల విటుడి హింసను భరిస్తున్నారనీ, రక్షిత సంపర్కానికి నోచుకోక రోగాలబారిన పడుతున్నారనీ పలు స్వచ్చంధ సంస్థలు నివేదిస్తున్నాయి.

వీరిసంతానానికి తండ్రిపేరు నమోదుచేయాల్సిందా అధికారులు ఒత్తిది చేయవద్దనీ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వీరికి సంతాన హక్కుని కాపాడాలనీ, ఆ సంతానాన్ని స్వచ్కంద సంస్థలద్వారా వృధ్ధిలోకి తేవాలనీ పలు అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వాలకు సూచించాయి.

ఫ్రెంచి పోలీసులు 1970వ దశకాలలో వేశ్యావ్యాపారాన్ని అత్యంత గుట్టుగా సాగింఛాల్సిందిగా వేశ్యలపై ఒత్తిడి చేయడంతో వేశ్యలపై దాడులు పెరిగి కొందరు హత్యకు గురికాబడ్డారు. అత్యధికులు లైంగికహింసకు గురికాబడడంతో ల్యొన్ నగరం‌లోని వేశ్యలంతా సెయింట్ నిజియర్ చర్చివద్ద ది. 2 జూన్‌న గుమిగూడి వారం‌రోజులపాటు నగరాన్ని నిర్బంధించారు. చర్చి, పొలీసులు, ప్రజాప్రతినిధులు చర్చలు జరుపడంతో మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2వ జూన్‌తేదీన ‘అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల దినోత్సవాన్ని’ నిర్వహించి మానవీయ పరిస్థితుల ఆవశ్యకతగురించి నొక్కి చెబుతారు.

లైంగిక స్వేచ్చగురించి యువతలో స్వీయ క్రమశిక్షణ అలవడినప్పుడే వేశ్యావృత్తి నిర్మూలించబడుతుంది. అప్పటివరకు దయనీయమైన పరిస్థితుల్లోనున్న వేశ్యల సంక్షేమం గురించి సమాజం ఆలోచించకతప్పదు.
 




కేసీఆర్ గురించి మాకివెల్లి

పరిపాలకుడికి రెండు లక్షణాలుండాలి. సింహం లాగా బెదిరించాలి – నక్కలాగా ఉచ్చులను పసిట్టాలి – మాకివెల్లి (ప్రిన్స్‌)
చాణిక్యుడు ఆదిమ కాలపు రాజనీతి తత్త్వవేత్త. రాజనీతి పాలనగురించి చాణిక్యుడు చెప్పినవన్నీ నేటికీ అక్షర సత్యాలుగా ఋజువౌతున్నాయి.
నికోలో డి బెర్నర్డో డే మాకివెల్లి ఇటలీకి చెందిన రాజకీయ తత్త్వవేత్త, ఆధునిక రాజనీతికి సంబంధించి అతడు రాసిన ‘ద ప్రిన్స్’ ప్రామాణికగ్రంధం.
పరిపాలకుడికి సిం‌హంతోపాటు నక్కలక్షణాలనుకూడా కలిగిఉండాలని (1513లో) చెప్పాడు. నిజం కదా!! సిం‌హం‌లా బతికిన యన్టీఆర్ నక్కలా పసిగట్టలేక వేటగాళ్ళ ఉచ్చుకు బలైపోయాడు.
**@@
‘ద ప్రిన్స్’ రాసి ఐదు శతాబ్దాలు గడిచాక ‘ చంద్రబాబు ట్రిక్కు, చంద్రశేఖర్ క్లిక్కు, రేవంతు బిక్కు’ సంఘటన జరిగింది.
ఇప్పుడు మాకివెల్లి జీవించిఉంటే తన పై సూత్రానికి ఏ వాక్యం చేర్చి ఉండేవాడు?
నాకు తోచిన విషయాన్ని మీముందు ఉంచుతున్నాను. మీకు నచ్చితే మీ మిత్రుల అభిప్రాయం తెల్సుకోవడం కోసం షేర్ చేయండి.
“పాలకుడు సిం‌హం, నక్క లక్షణాలతోపాటు ఉచ్చులువేయగలగే వేటగాడి లక్షణాలను కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఆరాజ్యం సుభిక్షంగా ఉంటుంది”
మీ అభిప్రాయం చెప్పి మీ మిత్రులకు షేర్ చేయండి

గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు :(1883-1951)

శిసుర్వేత్తి పశుర్వేత్తి - వేత్తి గాన రసం పణిః అన్నారు మన పెద్దలు.. సంగీతాన్ని పిల్లలు , జంతువులే కాడి చివరకు పాములు కూడా మైమరచి వింటాయని దీని అర్థం. దేవ భూమి అయిన ఈ భరత భూమి లో వెలసిన వేదాలలో సామ వేదం ఒకటి.ఇందులో సకల సంగీత రహస్యాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతారు. సకల సంగీత రసాలను ఔపోసన పట్టి అనేక విధాల సాధన చేసి ఈ మానవ జాతిని అనేక రకాల వ్యసనాల నుండి కోలుకునేట్టు చేసిన ఘనత సంగీతానికి ఉందంటే అతిశయోక్తి కాదు. చివరకు కొన్ని అంతు చిక్కని వ్యాధులు కూడా మధురమైన సంగీతం వింటే నయమయ్యాయని.. చివరకు పంట పొలాలకు, జంతువులకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తే మంచి పలితాలు ఉంటాయని ఎందఱో పరిశోదజ్ఞులు కూడా సశాస్త్రీయంగా తెలియజేసారు. తెలుగు నాట ఆది నుండీ ప్రజ్ఞ కలిగిన కళాకారులకు కొదువ లేదు.. ఆంద్ర రాష్ట్రములోని శ్రీకాకుళములో శ్రీ పారుపల్లి శేషాచలం అనే విద్వత్తు కలిగిన మహనీయునికి ద్వితీయ పుత్రునిగా శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు డిసెంబర్ 5 1883 న జన్మించారు. చిన్న నాటి నుండీ ఆయనకు సంగీతం అంటే మక్కువ ఎక్కువ. దీనిని గమనించిన ఆయన తండ్రి ఆయనకు సంగీత విద్యనూ గరపిరి.

శ్రీ రామకృష్ణయ్య పంతులు గారి తండ్రి శేషాచలం గారు బ్రహ్మ జ్ఞానం తెలిసిన వారు. వారు సన్యాసాశ్రమము స్వీకరించగా కుమారుడు అయిన పంతులు గారి మీద కుటుంబ భారం పడగా ఆయన పెద్ద కళ్ళేపల్లిలో ఠాణేదారుగా చిన్నతనమునన్దే ఉద్యోగములో చేరి ఒక వైపు ఉద్యోగ భారము మోస్తూనే మరో వైపు సంగీత సాధన చేసారు. కొన్నాళ్ళకు కళోపాసకులైన పంతులు గారు ఉద్యోగ విరమణము చేసి సంగీత విద్యను కూలంకషంగా గరపనెంచి నాదనిధి త్యాగరాజ స్వామి ప్రశిష్యులైన ఆకుమడుల వెంకట సుబ్బయ్య గారి శిష్యుడైన శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి వద్ద శిష్యరికం చేసి నాదోపసనలోని మెలకువలను నేర్చుకున్నారు. వీరి ఆలాపన లోని గాన సౌరభమ్ వింటే ఆనాటి చిన్న పిల్లలు కూడా ఏడ్పు ఆపి వినేవారని.. చివరకు పక్షులు జంతువులూ కూడా ఆ శ్రావ్య సంగీతానికి మైమరచి పోయేవని ప్రతీతి. శ్రీ సుసర్ల దక్షిణామూర్తి అతి గొప్ప సంగీత మేధావుల్లో ఆ కాలములో ఒకరు.. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, శరభ శాస్త్రి, వైద్యనాథ అయ్యరు వంటి వారు వారి సమకాలీనులు మరియు సహాధ్యాయులు కూడా. సరే సుసర్ల వారి మీదనే శంకరాభరణం చిత్రం తీసారని అందరూ అంటారు.. నిజమో కాదో నాకు తెలియదు

సంగీత గాన కళలో అమిత ప్రతిభ సంపాదించిన శ్రీ పంతులు గారు దేశ వ్యాప్తముగా అనేక సభలలో తమ సంగీత కళచే ఆనాటి శ్రోతల వీనుల విందు చేసి తన్మయులను చేసారు. తిరువయ్యూరులో జరిగే సంగీత సభలలో కూడా తమ సంగీత విద్వత్తును ప్రదర్శించి మెప్పులు పొందారు. వీరు ఫిడేలు వాద్యము, వాయులీనము, కంజీర, మురళి, మృదంగము వంటి వాద్యములను వాయించుటలో ప్రతిభ కలిగినవారు. చివరకు గాన కళమీదనే ఆయనకు ఎక్కువ మక్కువయై జంత్ర గాత్ర సమ్మేళన పద్దతులు విడచి అనేక గాన సభలలో పాడి ప్రశంసలు పొందారు . వారికి తెనాలిలో ఆనాటి ఆంగ్ల పాలకులు స్వర్ణ పతకమును కూడా బహూకరించి వారి గానకళను వేనోళ్ళ కొనియాడారు. విశ్వదాత శ్రీ కాశీనాథుని నాగేశ్వర రావు వీరి గానాన్ని విని పరవశులై వారికి ఆరోజుల్లోనే అతి పెద్ద సన్మానము చేసి తమ కళారాధనను చాటుకున్నారు. శ్రీ పంతులు గారి గాన సభలకు ఆనాటి ప్రసిద్ధి పొందిన సంగీత గాయక రత్నాలు ఎందఱో ఎటువంటి ఈర్ష్య లేకుండా వచ్చి ఆసీనులై వారి గానాన్ని ఆస్వాదించే వారంటే వారి ప్రతిభ ఎటువంటిదో తెలుసుకోవచ్చు,ఆనాడు గొప్ప సంగీతజ్ఞులుగా పేరు పొందిన గాయకులూ కూడా వారికి సన్మానము చేసి స్వర్ణ పతాకాలు అందజేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. అఖిల భారత సంగీత సభలలో కూడా అనేక సార్లు గానం చేసి ప్రశంసలతో బాటు స్వర్ణకంకణ బహుమతులు పొందారు.

ఆ తరువాత తెలుగు నేల మీద అనేక మంది శిష్యులకు సంగీత పాఠాలు చెప్పి ఎందరినో సంగీతజ్ఞులుగా తీర్చి దిద్దారు. శ్రీ పంతులు గారి ఇంటిలో పని చేసే వారికి కూడా అమిత సంగీత జ్ఞానం ఉండేదంటే నమ్మండి. శిష్యులకు గురుకులరీతిలో సంగీత శిక్షణ ఇస్తూ వారిచే స్వరాలూ , సాధన చేయిస్తూ వేద పాఠములవలే పునశ్చరణ చేయిస్తూ వారితో బాటే పనులు చేస్తూ అమిత శ్రద్ధతో ఆప్యాయతతో తన దగ్గరకు వచ్చిన శిష్యులకు సంగీత విద్యా దానం చేసేవారు. నాకు వారసులు లేకున్ననేమి నా శిష్యులందరు నా పుత్రులకంటే మిన్న అని వారిని అమిత ఆదరణతో చూసుకుని సంగీత కళను నేర్పారు. వీరికి అమిత గురుభక్తి.. తమ గురువులైన సుసర్ల వారి చిత్ర పటానికి వ్రుద్దాప్యములో కూడా సాష్టాంగము చేసి తమ గురుభక్తిని చాటుకునేవారు.

మన ఆంధ్రులకు రేడియో స్టేషన్ వచ్చేందుకు శ్రీ పతులు గారు చేసిన కృషి అద్వితీయం. వీరు ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకయే త్యాగరాజ సంగీత పరిషత్తును , సంగీత కళాశాలను స్థాపించి ఆనాటి రేడియో స్టేషన్ ద్వారా అనేక సంగీత కార్యక్రమాలు రూపొందించారు. విజయవాడ రేడియో స్టేషన్ లో వీరి సంగీత కార్య క్రమాలు ఉన్నవో లేవో తెలియదు గానీ మా తాత గారు వీరిని గూర్చి మహా గొప్పగా చెప్పేవారు.. మా ఊరిలో మొదరి సారిగా మా తాత గారు రేడియో కొన్నారుట. ఆ కార్యక్రమాలను వినడానికి మాటాడే మిషన్ వచ్చిన్దిరోయ్ అని ఎంతమందో వచ్చేవారట. శ్రీ పంతులు గారి సంగీత కార్యక్రమాలు డిల్లీ కేంద్రం నుండి కూడా ప్రసారం అయ్యాయిట ఆరోజుల్లో. వారి విద్వత్తు తెలిసిన అనేకమంది తమిళ గాయకులు వారితో అయ్యా మీరు బ్రాహ్మలే కదా మీ పేరును రామకృష్ణన్ అయ్యర్ గా పేరు మార్చినచో మీరు ఇంకా అమిత పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు అని చెప్పగా వారు చిరు నవ్వు నవ్వి నేను తెలుగు వాడిని.. నా సంగీతం, జీవితం తెలుగు వారికే , తెలుగు నేలకే అంకితం అని చెప్పి తాను తెలుగు వానిగా చెప్పుకునేన్దుకే గర్విస్తాను అని సమాధానం చెప్పారట. వారికి ఎన్ని పేరు ప్రతిష్టలు వచ్చినా ధనార్జన మీద అసలు మమకారము లేదు.. వారి షష్టి పూర్తి మహోత్సవాలను ఆనాటి సంగీత పిపాసులు శిష్యులు ఎంతో ఘనంగా చేసారట. 1951 లో వారి గురువులైన సుసర్ల దక్షిణామూర్తి గారి ఆరాధన చేయుచుండగా ఆ రోజు తూర్పు దిశగా నిలబడి నమస్కార భంగిమలో ఉన్న గురువుగారు ఎంతకూ రాక పోయేసరికి శిష్యులు వెళ్లి చూడగా వారు సంగీత సరస్వతిలో ఐక్యం అయ్యారని తెలుసుకుని అమిత దుఃఖ భరితులై అంతిమ శ్వాసలో ఉన్న గురువుగారికి తులసి తీర్థము పోయగానే ఒక వెలుగు ఆయన శరీరం నుండి బయటకు వెడలిందిట.

శ్రీ పంతులు గారు ఎందరినో శిష్యులను గొప్ప సంగీతజ్ఞులుగా తీర్చి దిద్దారు.. వారిలో మంగళంపల్లి బాలమురళి కృష్ణ , అద్దంకి శ్రీరామ శర్మ, చిలకపూడి వేంకటేశ్వర శర్మ , మద్దుల పల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి, మంగళంపల్లి పట్టాభిరామయ్య, వంకదారి వెంకట సుబ్బయ్య గుప్త, వంకమామిడి వీర రాఘవయ్య, సింగరాజు సూర్యనారాయణ రాజు, నేతి శ్రీరామ శర్మ, శ్రీమతి జూలూరి అరుంధతి, టి కె యశోదా దేవి, జి వి రామకుమారి, శ్రేమతి ఎస్ ఎస్ రాజ రత్నం వంటి ఎందఱో ప్రతిభావంతులు దేశ వ్యాప్తంగా అనేక సంగీత ప్రదర్సనలు ఇచ్చి గురువుకు తగ్గ శిష్యులుగా పేరు బడసారు.



31 మే పొగాకు నిర్జన దినోత్సవం ( 31 May World No Tobacco Day)
ఖగపతి యమృతము తేగా / భుగభుగమని పొంగి చుక్క భూమినిరాలెన్/
పొగచెట్టై జన్మించెను/ పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ (కన్యాశుల్కం‌లో గిరీశం)

రాహుకేతువులు సూర్యచంద్రులను ఆక్రమించి విశ్వానికి గ్రహణం పట్టిస్తాయనే పురాణకధల్లో నిజమెంతో కానీ ధూమ, మధ్యపానాలు రెండూ రాహుకేతువుల్లా ప్రపంచ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
జనాభాతోపాటు ధూమపానం‌, పొగాకు వినియోగంలోనూ మనం చైనా వెనకనే ఉన్నాం. పురుషులసంఖ్య 57% - స్త్రీల సంఖ్య 11%. వినియోగం ఇలానే కొనసాగితే 2020 వరకు సాలునా 15లక్షలమంది స్వర్గానికెళతారన్నది గణాంకాలు చెప్పే నిష్ఠుర సత్యం. ధూమపానం చేసేవారికంటే నిష్క్రియాత్మక (పాసివ్) ధూమపాన బాదితుల సంఖ్య సగటున దాదాపు నాల్గింతలుంటుంది. పాసివ్ స్మోకర్స్‌గా బలయ్యేవారిలో మీరు, నేను, మన కుటుంబ సభ్యులు ఉండవచ్చు. పొగాకు వాడకాన్నినియంత్రించకపోతే సంవత్సరానికి 8 లక్ష్లమంది, రోజుకు 2200మంది, అంటే గంటకు 90మంది కేవలం పొగాకు వాడకం వల్ల సంక్రమించే వ్యాధులతో మరణిస్తారు. కాబట్టి ధూమపానం, పొగాకు వినియోగం సమాజానికి సామూహిక శత్రువు.
ఒక్కో సిగరెట్‌పై మూడు రూపాయల పన్ను పెంచితే ఎకాఎకిన 30లక్షల మంది ధూమపానానికి దూరమౌతారన్న ప్రభుత్వ ఆశలు అడియాసలయ్యాయి. సిగరెట్లను మానేసినవారు ఇతర పొగాకుఉత్పత్తుల వినియోగానికి మారారు. సిగరెట్టు తయారయ్యే క్రమం‌లో 600 వందలకు పైగా విషపూరిత రసాయనాలు కలుస్తాయి. ధూమప్రియులకు వాస్తవంగా జరిగే ఉపద్రవం వీటివల్లనే.
ఇటువంటి విధిలేని పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం పొగాకు చట్టాలను మార్చాల్సివఛ్చింది.
పొగతాగడం నిషేధం నుండి పొగాకు వినియోగం నిషేధంగా మారింది.
పొగాకు ఉత్పత్తుల కొనుగోలు కనీస వయసు 21 సం.లకు పెంచారు.
విడి సిగరెట్ల అమ్మకం పై నిషేధం
బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన జరిమానా రూ. 200 నుండి రూ. 1000కి పెంపు
హోటళ్ళు రెస్టరెంట్లలో ధూమపాన ప్రదేశాల తొలగింపు
పొగాకు సాగు, శుధ్ధి, తయారీలో 18 సం.లోపు పిల్లలను వినియోగించడం నిషేధం.
పొగాకు చట్టాల ఉల్లంఘన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు
చట్ట ఉల్లంఘన జరిమానా రూ. పదివేలనుండి ఒక లక్షకు పెంపు
పొగాకు ఉత్పత్తులు నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేదం.
మధ్య, ధూమపానాలతో యువత రుజాగ్రస్తం అయ్యిందంటూ విచారం వెలిబుచ్చీన సర్వోన్నత న్యాయస్థానం “మీఆదాయం కోసం జనాలు రోగాలను తెచ్చుకోవాలా?” అంటూ ప్రభుత్వాలకు కర్రుగాల్చిపెట్టింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకపు ఉత్పత్తుల అమ్మకంతో వచ్చే ఆదాయం రూ. 2, 500 కోట్లయితే, దాని బాధితులకు ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పధకాలపైచేసే ఖర్చు రూ. 2776 కోట్లు.
ధూమపానాన్ని మానేయడం ఎలా?
పరిస్థితులు గమనించిన మనమిత్రుడొకరు ధూమపానాన్ని, పొగాకు ఉత్పత్తులను మానేయ్యాలనుకుంటున్నారు. వీటిలో మొదటిది కోల్డ్ టర్కీ విధానం: మానేయాలనిపించినపుడు ఒక్కసారిగా మానేయడం, ఇది అత్యుత్తమమైన విధానం – ఐతే పలువురి విషయం‌లో ఇది సాధ్యం కాకపోవచ్చు.
క్రమంగా మానేయడం: క్రమంగా సిగిరెట్ల సంఖ్యను తగ్గించడం, సిగరెట్టును చేతిలో పట్టుకొని కొంతకాలం గడపడం, తదుపరి పెదాలమధ్య్య అట్టే పెట్టుకొని అంటించకుండా మరికాసేపు సాగదీయడం. సిగరెట్పెట్టెను, లైటర్/ అగ్గిపెట్టెను, యష్ ట్రేను వేర్వెరు ప్రదేశాల్లో ఉంచదంవల్ల ఈవిధానం‌తో విజయం సాధించవ్వచ్చు. తను సాధించే నిలకడను మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు చెబుతుండాలి. ధూమపానం అలవాటున్న ఇతర మిత్రులను కొంతకాలం కలవపోవడం మంచిది. ఎప్పటికప్పూడూ సిగరెట్ల సంఖ్యను తగ్గించే లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, మిత్రులకు, కుటుంబ సభ్యులకు తెల్యజేసి వారి ప్రోత్సాహాన్ని పొందటం, రొటీన్‌కు భిన్నంగా వ్యాపకాలను పెంచుకోవ్డం వల్ల ధూమపానానికీ పొగాకు ఉత్పత్తులకూ దూరం కావచ్చు. మధ్యలో వైద్యులను సంప్రదించి సలహాలు పొందటం వంటివాటితో ధూమపానాన్ని నిసర్జించవచ్చు.

ధూమపానాన్ని వదిలేయడంవల్ల మీ ఆరోగ్యంతో పాటు మీకుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడ్తుంది.
మీతోపాటు, మీ కుటుంబ సభ్యుల జీవితకాలం పెరుగుతుంది. హృద్రోగం, పక్షవాతం, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇంకా ముఖ్యమేమిటంటే సిగరెట్లకు తగలేసే డబ్బులు మిగులుతాయి.
పొగాకుపరిస్థితి ఇలాఉంటే గిరీశం అలా చెప్పాడేమిటనే సందేహం వస్తుంది. గిరీశం చెప్పినట్టుగా అది అమృతం కాకపోయినా సిగరెట్ల స్థాయిలో అపాయకరం కాదు. కొలంబస్ అమెరికా వెళ్ళడానికి పూర్వం అమెరికాలోని గిరిజనులు ప్రకృతి సిధ్ధమైన పొగాకును వైద్యం‌లోనూ గాయాలపై రసం వేయడం, మెత్తగానూరి గాయాలపై రాయడంతోపాటు మతసంబంధమైన ప్రక్రియల్లోనూ వాడేవారు. సహజసిధ్ధమైన పొగాకు కాలినప్పుడు వచ్చే పొగ తేలికపాటి మత్తు కల్గించేదని, ఆకులను ఉడికించి తాగితే ఆహ్లాదకరంగా ఉండేదని కొలంబస్ తన యాత్రా స్మృతులలో రాసుకున్నాడు.

అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ వ్యాధిగ్రస్తులకు పొగాకును ఉపయోగించిన వైద్య ఉత్పత్తులు సత్వర ఉపశమనం కల్గించేవని వైద్యశాస్త్రం చెబుతుంది.
పొగాకు వ్యాపార పంటగా మారే క్రమం‌లో అనేక జన్యుమార్పిడులకు గురైంది. ప్రస్తుత కాలాల్లో స్వచ్ఛమైన, సహజమైన పొగాకు లభించడం అసంభవమని వ్యవసాయ శాస్త్త్రవేత్తలు చెబుతున్నరు. ప్రకృతిలోని ప్రతీజీవి పుట్టుకకు ఒక పరమార్ధం ఉంటుంది. ఆ జీవి మానవుడికి ఎలా పనికి వస్తుందో తెలుసుకోవాలి. మాంసాహార మొక్కలుకూడా మానవాళి సౌభాగ్యానికి ఉపయోగపడ్తాయి.
పొగాకును వినియోగాన్ని నిషేధించినా ఆ పంటను ఔషధ తయారీకి ఉపయోగించే విధంగా పరిశోధనలు సాగించడంవల్ల పొగాకు రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది.
ధూమపానాన్ని మానేద్దామనుకున్న వారికి తోడుగా ఉందాం!





డ్రగ్స్ గురించి సినిమానటులను, మరికొందరిని విచారిస్తున్నారు, ఫలితమేమన్న ఉంటుందా ?


కర్తవ్యమ్, సంకల్పం, నిర్ణయం, గూర్చి ఎవరైనా వివరించండి ?
స్త్రీ భర్తతో సుఖం పంచుకొని 9 నెలలు బిడ్డను మోసి పృథ్విపై కనడం కర్తవ్యం
విద్యనేర్పించి, ఉద్యోగం కల్పించి, వివాహం చేయటం,  సంకల్పం
వృద్ధాప్యంలో పిల్లల భవిషత్తు, తమ భవిషత్తు, దేవునిపై ఉంచి జీవించటం నిర్ణయం

ధర్మబద్ధంగా జీవిస్తూ , న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహిస్తూ, సత్యవాక్కు గా జీవించటమే పురుషుని కర్తవ్యమ్
భార్య బిడ్డలకు ఎటువంటి కష్టము రాకుండా జాగర్తపడటం, వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవటమే సంకల్పం
అందరి మాటల మర్మాన్ని గ్రహించి ఆవేశం చెందకుండా అందరి మనస్సు శాంత పరుచుటే నిర్ణయం


పెళ్లి అయినవారికి, పెళ్లి కానివారికి మధ్య ఉండే తారతమ్యం ఏమిటో తెలుపగలరా ?

*హితము, మితము, అమితము గురించి వివరించండి ?
 హితమైనదానిని భుజించుట,  మితముగా భుజించుట, అమితముగా భుజించితే అనారోగ్యులవుతారు.                

* పుణ్య పాపాలలో సమాన వాటాదారులెవరో వివరించగలరా?
మంచి.- చెడు,  పనిచేసేవాడు, ఆపనిని చేయించే వాడు, ప్రేరేపించేవాడు, అంగీకరించేవాడు ఈ నలుగురికి పుణ్య పాపాలలో సమాన వాటాలు ఉంటాయి.

* మానవులకు ఉత్తమ మైన దేదో వివరించగలరా ?
మానవులకు ఉత్తమ శీలంతో సమానమైన మరో ఆభరణముకాని, సంతోషముతో సమానమైన మరొక ధనము కానీ జగత్తులో లేదు.

* నేత్రము, తపస్సు అనే పదాలను వివరించ గలరా ?
విద్య తో సమానమైన నేత్రము లేదు, సత్య వాక్కుతో సమాన తపస్సు  లేదు.

* సుఖము, దు:ఖము అనే పదాలను వివరించగలరా ?
 ఖర్మ ఫల త్యాగముతో సమానమైన సుఖము లేదు, భౌతికప్రేమతో సమానమైన దుఃఖము లేదు.

* ముఖ పుస్తకము వల్ల ఉపయోగము ఉన్నదా ! ఉంటే క్లుప్తముగా వివరించ గలరా?

 *మనిషి జీవితంలో "శక్తి, ధనము, సమయం " ఎంతవరకు ఉపయోగపడతాయి? ( యవ్వనంలో, మధ్యవయస్సులో, వృద్ధాప్యంలో)    
!!మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్యవయసులో అయితే డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా కష్టపడే శక్తి ఉండదు.!!
                                                                                                                                                                                                                                            





1 comment: