Tuesday 26 March 2024

మనసమ్మెడి రవళితగా   

క్షణమొక సఖ్యత పిలుపుకు క్షేమము కొరకే 

వణకు చమట లూరుకళలు   

వినదగు దువ్వుచు నె కొంత విస్తరి ఐగుతాం  


నయన మూలాంచలములు స్విన్నంబు లయిన

గాల మేసేటి యీ ప్రాలు గాలికులుకు      

కారణంబెయ్యది వినోద కంటకంబు 

తనువు మార్చలేనివయసు తనము చేష్ట    

  

వనితాబిగువుల కళ కను

గొణలను వాత్త్సల్యరసము కురియగ ప్రేమా  

కనుగొని ముద్దాడి చనువు 

కొనియెను తృణపరిమళముతొ గుర్తింపు కళల్    

    

సొగసు కళలకు బడలిక సొలుపు లేక 

కోక తడియారక  ఎగసి కోర్క పొగరు 

మగువ తెగువును ముద్దాడి మెడల లేక  

మరల యెంతటిప్రేమార్ద్ర మామెమనసు!          


ఓరగ చూపుల సొగసులు

వరమై లలిత సుఖజూపు వరదై పొంగెన్ 

తరుణము తరించ పిలుపై 

కరువేతీర్చుము వలువలు కేళీ పిలుపున్

 

***

*దివ్యత్వం*

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.  కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.

ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.

దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.

శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.

ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.

ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.

శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.

మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.

ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.

పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.

శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.

నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.

జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.

మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.

దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.

దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.

ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెళ్ళివిరియాలని ఆయన అభిలాష.

***

*ఆత్మ*

1) విడిచిపెట్టటానికీ వీలులేనిది..పట్టుకొనటానికీ వీలులేనిది.

మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం.. అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం... ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను.. ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను.. చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.

అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా.. నన్ను నేనే పట్టుకోవటం ఎలా.. నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం.. కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు.. విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది.

2) మనోవాచాం అగోచరం:-

మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో ఒక వ్యక్తియో ఒక విషయమో ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు వ్యక్తీ కాదు విషయమూ కాదు భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి మనస్సు ఆలోచించ గలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే అసలు విషయమే కాదు గదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియ లేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా.. కాదే. అది తెలిసిన దానికి తెలియని దానికి వేరైనది గదా కనుకనే మనస్సుకు అందదు. అగోచరం. మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్ద శక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం.. కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలు అన్నింటికి అగోచరమే.

ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః..." అని. కళ్ళు, వాక్కు, మనస్సు అక్కడకు పోలేవు అని. ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి.. మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా.. చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.

3) అప్రమేయం:-

సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.

ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ.. ఇంతేగదా.. అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా.. రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను.  మరి కొలవగలరా. సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం. కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.

4) ఆద్యంత రహితం:-

పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ, అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.

5) మహ:-

తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు. 

6) అహం పూర్ణం బ్రహ్మ:-

అట్టి పరిపూర్ణ బ్రహ్మమును, పరమాత్మను, శుద్ధ చైతన్యాన్ని నేనే, నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన.. అంతే.

***

No comments:

Post a Comment