Tuesday 2 June 2020

***



తెలుగు వారి బాపూ దర్శకత్వంలో వచ్చిన తొలిసినిమా " సాక్షి ". అప్పట్లో బాపూగారి బొమ్మగా తెలుగువారి నలరించిన నటి ' విజయనిర్మల '. ఆమె నాకు గుర్తుండి బాపూ, రమణల తొలినాళ్ళలో వచ్చిన సినిమాల్లో సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు సినిమాల్లో కధానాయికగా నటించారు. అందుకే బాపూబొమ్మ అంటే విజయనిర్మల గారిని చెప్పుకోవచ్చు. సాక్షి సినిమాలో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. పులిదిండి అనే గ్రామ వాతావరణంలో అద్భుతంగా చిత్రీకరించబడిన యీ సినిమాలో కృష్ణ గారి నటన అంత ఆకట్టుకొనేలా లేకపోయినా బాపూ దర్శకత్వప్రతిభకు, రమణగారి మాటపట్టుకు తోడు విజయనిర్మల గారి నటన యీ సినిమా విజయానికి ముఖ్యకారణమని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆరుద్ర గారు వ్రాసిన " అమ్మకడుపు చల్లగా", "ఎవరికి వారే యీ లోకం " అనే పాటలు ఆ రోజుల్లో ప్రజలను బాగా అలరించాయి. అమాయకుడు, వెర్రిబాగులవాడైన కృష్ణ ఆ ఊరివాళ్ళని హడలెత్తించే జగ్గారావు చేసిన హత్యను చూస్తాడు. జగ్గారావుని చూసి జడుసుకొనే ఆ ఊరి పెద్దలంతా అతని పీడ వదిలించుకొందుకు కృష్ణని కోర్టులో సాక్ష్యం చెప్పమని, అతనికి హాని జరగకుండా చూసుకొంటామని భరోసా యిస్తారు. కృష్ణ సాక్ష్యంతో జైలుపాలైన జగ్గారావు తప్పించుకొని సాక్ష్యం చెప్పిన కృష్ణని చంపటానికి తన గ్రామం వస్తాడు. ప్రాణభయంతో సాక్షి కృష్ణ పెద్దలను ఆశ్రయిస్తే అందరు అతనికి తమ యింట్లో నీడనివ్వరు, ఊరంతా తమ యిళ్ళలో దూరి దాక్కుంటారు. ఆ సమయంలో జగ్గారావు చెల్లెలైన విజయనిర్మల ఆ అమాయకుణ్ణి కాపాడటం కోసం ఆ ఊరి గుడిలో తాళి కట్టించుకొంటుంది. ఆ సందర్భంలో బాపూ గారు పాటను చిత్రీకరించిన తీరు చూడవలసినదే! ఆరుద్రగారియీ పాటను మహదేవను గారు స్వరపరచగా సుశీల పాడారు. చూడండి!

అమాయకుణ్ణి కాపాడటం కోసం ఆ ఊరి గుడిలో తాళి కట్టించుకొంటుంది. ఆ సందర్భంలో బాపూ గారు పాట సాక్షిగా 

అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళూ తోడుగా, నీడగా !

నా మెడలో తాళిబొట్టు కట్టరా!
నా నుదుట నిలువుబొట్టు పెట్టరా!
నీ పెదవి మీద చిరునవ్వు చెరగదురా
నా సిగపువ్వుల రేకైనా వాడదురా! వాడదురా!
బతకరా బతకరా పచ్చగా!

నల్లని ఐరేనికి మొక్కరా!
సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా
నా నల్లపూసలే నీకు రక్షరా! రక్షరా!
బతకరా బతకరా పచ్చగా!

నా కొంగు, నీ చెంగు ముడి వేయరా!
నా చేయి, నీ చేయి కలపరా!
ఏడడుగులు నాతో నడవరా!
ఆ యముడైనా మన మద్దికి రాడురా! రాడురా!
బతకరా బతకరా పచ్చగా! ~ అమ్మ కడుపు ~

(ఇందులో ఆరుద్రగారు "ఐరేని " అన్నపదం వాడారు.అంటే పెళ్ళిలో రంగు వేసిన కుండల దొంతర అని అర్ధం)
Saakshi - Telugu Songs - Amma Kadupu - Krishna - Vijaya Nirmala
Watch Krishna Vijaya Nirmala's Saakshi Telugu Old Movie Song With HD Quality Music - K V Mahadevan L...


No comments:

Post a Comment