Friday 28 May 2021

_

Feb 18, 2020 - This Pin was discovered by Út PhÚc. Discover (and save!) your own Pins on Pinterest.


శ్రీగురుభ్యోనమః🙏

భక్తులతో సాంగత్యం చేస్తే, మనకు ఉండేటటువంటి సంసారబాధలన్నీ కూడా క్రమముగా మనకి అంటని  ఒక స్థితి వస్తుంది. భగవత్ భక్తుల జీవితాల్ని తీసుకుంటే అపారమైనటువంటి కష్ట నష్టములుంటాయి. కష్టనష్టముల యందు భావన లేకుండా, భగవంతుని యందు భావన కలిగి ఉండడము చేత, ఆ కష్టము ఒక దూదిపింజ వలె, ఒక చెదిరిపోయిన మేఘము వలె వెళ్ళిపోతుంది.

దృష్టి సమస్య మీద కాక, దైవము మీద ఉంటుంది కాబట్టి, ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత భగవంతుడు స్వీకరిస్తాడు.

యజ్ఞార్ధము, పురుషార్ధము, స్వార్ధము మూడున్నాయి.

యజ్ఞార్ధము: ఇతరుల శ్రేయస్సు కోసమే నేను బ్రతుకుతాను అనే దీక్ష పట్టిన వానికి  తన జీవితము మీద తనకు స్వామిత్వము వస్తుంది. నీ జీవితానికి నువ్వే రాజువైపోతావు. ఋషులు ఒక సూక్తినిచ్చారు.

 నిష్కారణముగా ఇతరుల శ్రేయస్సు కొరకై పనిచేసేవారు నిష్కారణముగా ఆనందంగా ఉంటారు.

*🧘‍♂️సహనమే సంస్కారం..!🧘‍♀️*_

*_-[అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం]-_*

*_మన భారతీయ సనాతన సంప్రదాయాలు మనకు నేర్పినది ఏమిటి ? మనిషై పుట్టిన వానికి సహనం, శాంతం అవసరమని మన పూర్వీకులు నేర్పించారు. జీవితంలో ఆధ్యాత్మిక లక్షణాలను నేర్చుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి._*

*_చాలామంది ఎన్నో ముఖ్యమైన విషయంలలో 'అది నాకు సంబంధించింది కాదు' అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. ఇందులో గమ్మత్తేమిటంటే తను అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.._*

_*సహనం అంటే ఏమిటి?*

*_నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం, పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది._*

*_మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంటుంది. అందుకేనేమో తత్వవేత్తలు సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నను ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనం అవసరం._*

*_సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర పురాణాలే మనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టిలో కలవడం లాంటివి ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞత అని అంటాడు._*

*_కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కనపెడితే విజ్ఞతతో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వలన భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది._*

*_సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదానుగ్రహానికి చేరువ చేస్తుంది. మనిషికి విలువైనదేదీ తొందరగా దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు._*

*_కష్ట, నష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో జీవిస్తున్న మనిషి ద్వంద్వ వైఖరి లేకుండా చిత్త శుద్ధి ఎంతో అవసరం. స్పృహతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణానికి బొమ్మ, బొరుసూ అంటు ఉంటాయి._*

*_మనిషి అన్ని తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజమే కానీ, ఎదో అదృశ్యశక్తి అనేది పరిస్థితుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి యొక్క మంచి ఆలోచనలు సహనంతో ముడిపడి ఉంటాయి, ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి._*

*_ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు అని ఉదాహరణగా చూసుకోవచ్చును. అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు._*

*_మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే అన్నిమతాలు సహనాన్నే బోధిస్తాయి. వాటిని చదవడం, వినడంతో సరిపోదు హితభోదలు చేసే గ్రంథాల మర్మం కనుగొన్న వాడే సహనాన్ని అర్ధం చేసుకోగలడు !_*

*_మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఈ విషయంలో మనిషి తప్పు కాని మతం కాదు, కులంకాదు గుణం ప్రధానం. సహనం ఉన్న వానికే తానేమిటి, తన కుటుంబం, ఊరు, దేశం గురించి ఆలోచన, విచక్షణలు కలుగుతాయి !!_*


--(())--

నిత్య సూక్తి

శిల్పి ఒక రాతిలో ముందు మూర్తిని కల్పన చేస్తాడు. తన మనస్సులో ముద్రించుకొన్న మూర్తిని ఆ రాతిమీద ప్రతిబింబింపచేస్తాడు.

రాతిలో కేవలం సుందరమూర్తిని మాత్రమే దర్శిస్తూ మూర్తి కాకుండా ఉన్న రాతిని తొలగించి వేసి అందమైన మూర్తిని తయారుచేస్తాడు.

సత్య సాక్షాత్కారము అవడానికి ఇదే దారి. సాధకుడు ఈ విధంగానే ముందు సత్యాన్ని అన్నింటిలో చూడటం మొదలుపెడతాడు.

రాతిలో మూర్తిని దర్శించినట్లు సత్యాన్ని అనుభవం పొందుతాడు. దానితో అసత్యరూపంలో ఉన్నదంతా దానికదే ప్రక్కకి వెళ్ళి పోతుంది.అప్పుడు సత్యమైన సుందర మూర్తి స్వరూపం వస్తుంది.

--(())--

*శ్రీగురుభ్యోనమః*

*వసంత ఋతువు నందలి ఉత్తరార్ధము వైశాఖమాసము. ఈ మాసము అత్యంత ప్రతిభావంతమైనది. సంవత్సరమునకు అభిజిత్ లగ్నము వంటిది. జ్యోతిషమున ఈ మాసమును వృషభమందురు. వృషభమనగా సూర్యకిరణము.*

*ఉభయసంధ్యల యందు ఆ కిరణముల ప్రభావమును ప్రార్ధనా మార్గమున గాని, ధ్యానమార్గమున గాని అందుకొనుట సాధకుని విధి. ఋషులు సహితము దైవబలమును పొందుటకు ఈ మాసమందలి సూర్యకిరణములను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధింతురు.*

*వైశాఖ మాసమునకు మధుమాసమని పేరు. ఆరోగ్యము, యశస్సు, బలము, దివ్యానుభూతిని కలిగించు ఈ మాసముననే గౌతమ బుద్ధుడు, శంకరాచార్యుల వారు, ఆంజనేయస్వామి జన్మించినట్లుగా చరిత్ర తెలుపుచున్నది. మాసాధిపతియగు శుక్రుడు అంతరంగమున అంతర్లోకములను ఆవిష్కరించి, సత్సాధకులకు తగిన రీతిని ఉన్నతి కల్పించుగాక!*

--(())--

*🧘‍♂️ఆత్మ-పరమాత్మ🧘‍♀️*

ఓంశ్రీమాత్రే నమః

 *ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?*

*నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా...*

*సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం.*

*ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట. వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి.*

*దీనికి తోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట. అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి.*

 *ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయినందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించి నట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుషుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మల కలయిక గాఢ నిద్రలో కలుస్తాయన్నమాట.*

*ఓం నమః శివాయ*:

*🧘‍♂️శరీరము-ఆత్మ🧘‍♀️*

ఓంశ్రీమాత్రే నమః

  *“దేన్నయితే మనస్సు గ్రహించలేదో – అయినప్పటికీ, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో, దేన్నయితే కళ్ళు చూడలేవో – అయినప్పటికీ దేనిచేత కళ్ళు చూడగలుగు తున్నాయో,దేన్నయితే చెవులు వినలేవో – అయినప్పటికీ దేనిచేత చెవులు వినేశక్తి పొందగాలుగుతున్నాయో, దేన్నయితే ముక్కు వాసన చూడలేదో – అయినప్పటికీ దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో ,అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా వివరించారు.*

*అంటే మన శరీరం, మనస్సు మరియు బుద్ధి అన్నియు ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి (ఆత్మ) మాత్రమె శాశ్వతం, అదియే నీవు. ఈ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది. అప్పుడు శరీరంలోనివి ఏవి కూడ పనిచేయవు.  మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు. ఆత్మ రాజయినప్పటికీ సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ అహంకారంతో ప్రవర్తించటం జరుగుతుంది. మనస్సనే మంత్రి రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు.*

*ఎప్పుడైతే మనిషి ఆత్మే నేను (అనే జ్ఞానాన్ని తెలుసుకొని) అంటే రాజే నేను అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకొని పనిచేసుకుంటూ వెళ్ళినపుడు మంత్రి ఏమి చెయ్యలేదు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన మనస్సు ఆత్మలో లయించవలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి నేనే ఆత్మను (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేలతామో అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది.*

*ఆత్మ ఎక్కడ ఉన్నదని వెదుకులాడవలసిన పని లేదు.*

*ఉన్నదంతా ఆత్మే అని గ్రహించండి. ప్రశ్నల్లా, మనిషి దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది? అని ప్రశ్నించుకోవడంతో ఆత్మ విచారణ, ఆత్మానుభూతికై సాధన తీవ్రతరమౌతుంది. ఆత్మ నిత్యం, సత్యం, కాలాద్యవిచ్ఛిన్నం, అపరిమేయం, అది పరిణామానికి లోనుకాని శక్తి మూలం. ఆత్మ ఆకాశం వలె శూన్యం! గగనం వలె సంపూర్ణం. ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు అని అర్థం. అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా అదేనని అసలు అర్థం. ప్రాణశక్తికి, ఇంద్రియ చలనాలకు కరచరణాది అవయవాల కదలికలకు, మెదలికలకు, సర్వకార్యకలాపాలకు మూలము ఆత్మే!*

*పంచభూతాలూ, ప్రాణం, ఆహారం, బుద్ధి వంటి సమస్త పదార్థమూ ఆత్మ నుండి పుట్టినవే! హృదయమనే ఖాళీ గుహ, మనిషి కుడి రొమ్మున ఉన్నది. అందులో నేను, నేను అంటూ నిస్వనంగా, నిరంతరంగా, అఖండంగా, వాఙ్మయంగా, జ్యోతిర్మయంగా ఆత్మ వెలుగుతూనే ఉన్నది. వెలుగులీనుతూనే ఉన్నది. కాలిగోటి నుండీ తల వెంట్రుక చివరి కొస వరకు ఆత్మే చైతన్యశక్తిగా శరీరాన్ని నడిపిస్తున్నది.*

*అంగాంగీభావంతో మనిషి తన దేహాన్ని శాశ్వత వస్తువుగా భావిస్తాడు. అవిద్య, అజ్ఞానం, అనాచారం, అస్పష్టత వంటి వ్యతిరిక్త శక్తుల వలన దేహం చుట్టూ తన ఆలోచనలను ఒక వలయంగా గూడు కట్టిస్తాడు. అందువల్లనే తాను ఆత్మనన్న భావన నుండి బహుదూరంగా వైదొలగుతుంటాడు. ఈ బహిరంగ వలయం నుండి మనిషి తన లోపలికి తాను తొంగి చూసుకోవడం ప్రారంభించడంతో ఆత్మానుభూతికి దారి దొరుకుతుంది. ధ్యానం ద్వారా ఆత్మానుభూతిని పొందినప్పుడు ఉనికి, అస్తిత్వం, అహం నశించి ఆత్మ ప్రకాశం అనుభవమౌతుంది.*

*ఈ స్థితిలో మరణ భయం నశించి అమరత్వ సిద్ధి కలుగుతుంది. తన శాశ్వతత్వం ఎరుకగా అనుభవంలోకి వచ్చినప్పుడు సదానందుడై పరమానందాన్ని తన సహజ స్థితిగా అనుభవిస్తూ అచలుడై శుద్ధాద్వైతంలో నిలకడ చెందుతాడు. మరణమంటే మార్పేనన్న భావన స్థిరమై మృత్యువును ఆహ్వానించడు! అలాగే కలకాలం ఉండాలని ఆశించడు!! ఇదొక అద్భుత స్థితి. ఇదే ఆత్మానుభూతి కలిగించే మహానంద స్థితి. -ఇప్పటిదాకా జరిగిన విచారణంతా ఆత్మవిద్యలో భాగమే!*

*ఆత్మానుభూతిని వేరెవ్వరూ కలిగించలేరు. ఎవరికి వారు తమ స్వీయ సాధన ద్వారా పొందాలి. అంతరంగ సాధన ద్వారా మనిషి తన జన్మను పారమార్థికంగా సార్థకం చేసుకోవాలి. జిజ్ఞాస ద్వారా సత్యాన్వేషణ కొనసాగించాలి. -ఆత్మ, ఆత్మ విచారణ, ఆత్మానుభూతి వంటి ఉదాత్త విషయాలను ఏకాగ్రచిత్తంతో, స్వానుభవంతో అర్థం చేసుకోవాలి. అనుభవించాలి..*

 *-పిప్పలాద మహర్షి తనను సమీపించి ప్రశ్నించిన జిజ్ఞాసువులకు ఆత్మవిద్యా వర దానం చేసి, మంగళా శాసనం చేశాడు!*

 *-జిజ్ఞాసువులందరూ సభక్తికంగా, పరమ ఋషి సత్తముడికి ప్రణామ సహస్రం సమర్పించి, సంపూర్ణ సమాధానాలను పొంది, ఆత్మనిష్ఠులైనారు! -ఒక మహర్షి, కొందరు జిజ్ఞాసువుల మధ్య సాగిన ప్రశ్నోత్తర సమాధానమే, ప్రశ్నోపనిషత్‌గా మనుష్య జాతికి లభించింది.*

--(())--

*లోకంలో వివేచన, విచక్షణ కలగలసిన ప్రత్యేక ప్రాణి మనిషి. హృదయస్పందనలతో, మేధస్సు నిండిన మస్తిష్కంతో ప్రాణికోటిలో శ్రేష్ఠుడై వెలుగొందుతున్నాడు. 'శుభకరమైనదీ, సుఖకరమైనదీ' అనే రెండు మార్గాలు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖం కంటే శ్రేయస్సే మేలని ఎన్నుకొంటాడు. కానీ బుద్ధి హీనుడు లోభాసక్తితో సుఖాన్నే కోరుకుంటాడు. విజ్ఞతకు సంబంధించిన సున్నితమైన ఆలోచన మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.*

*ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమా ర్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటు. మాలిన్యం నుండి మనసు ప్రక్షాళన మయితే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతుంది.*

*శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తిధీర:|*

*శ్రేయోహి ధీరోభి ప్రేయసోవృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్‌ వృణీతే||'*

*విశ్వజిత్‌ యాగం చేసిన వాజస్రవసుడనే ఋషి కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు తన సంపద నంతా దానం చేస్తున్నాడని తెలుసుకున్న నచికేతుడు శ్రద్ధతో తండ్రిని గమనించసాగాడు. శక్తినశించి కృంగికృశించిన ఆవులను దక్షిణలుగా దానం చేయడం వల్ల నా తండ్రికి దుర్గతి కలుగుతుందనీ వేదనతో తండ్రీ! నీ సంపదలో నేను భాగస్థుడినే కదా! మరి నన్నెవరికిస్తావు? అని ప్రశ్నించగా స్పందించని తండ్రిని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతాడు నచికేతుడు. వాజస్రవసుడు చిరాకులో నచికేతా! నిన్ను యమునికిస్తాను' అంటాడు.*

*కాలగతిలో ఎలాగూ నశించిపోయే క్షణికమైన జీవితం కోసం సత్యపాలన వదులుకోరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మహాత్ములు సత్య నిష్ఠను కాపాడుకున్నారు. కనుక తండ్రీ నేను యమలోకానికి వెళ్లడానికి అనుమతినివ్వు' అని వేడుకుంటాడు నచికేతుడు. వాజస్రవసుని ఆశీస్సులతో యమపురికి చేరిన నచికేతునికి యమధర్మరాజు ఇంటలేడనే విషయం తెలిసి మూడు రోజులవరకూ నిరాహారుడై యమునికై వేచి ఉంటాడు.*

*నచికేతుడు యమపట్టణ ద్వారం దగ్గర మూడు రోజులుగా నిరాహారుడై ఉన్నాడన్న విషయం తెలుసుకున్న యముడు అతనికి మూడు వరాలను ప్రాయశ్చిత్తంగా అను గ్రహిస్తాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి తగిన సత్కారం చేయాలి. అతిథిని నిర్లక్ష్యం చేసే గృహస్థుని ఆశలూ, ఆం క్షలూ, సత్ఫలి తాలూ, పుణ్య కర్మలూ అన్నీ నశిస్తాయి. అందుకే నచికేతుని సంతృప్తి పరచడానికి మూడు వరాలను అనుగ్రహిస్తాడు యముడు.*

*యమధర్మరాజును ధైర్యంగా నచికేతుడు అడిగిన మూడవ వరం కఠోపనిషత్తుకే తలమానికమై జీవితరహస్యాన్ని ఆవిష్క రిస్తుంది. 'మరణానంతరం ఆత్మ ఉంటుందా?' అని నచికేతుడు అడి గిన సందేహం సృష్టి అంతరార్థాన్ని సూచిస్తుంది. మృత్యుదేవతే యమ ధర్మ రాజు. మరణాంతర గతులను నిర్ణ యించే సమవర్తీ యముడే. కనుక మరణం తర్వాత మానవుని స్థితి గురించి చెప్పగలిగే శ్రేష్ఠులెవరు? యమధర్మరాజు తప్ప. సత్యమే అయినా అసా ధ్యమనిపించే నచి కేతుని కథా రూపం సంగతి కాసేపు పక్కన పెడితే...*

*జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్ఫాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం. మనిషి కూడా జనన మరణ చక్రాన్ని అనుస రిస్తాడు. మనిషి జన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించే పనిలేదు. అలాగని మితిమీరిన ఆనందమే సుఖమని భావించ క్కర్లేదు.*

*జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు. మనుషుల కంటే దేవతలు వందల సంవత్సరాలు అధి కంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై కొనసాగ వచ్చు.*

*కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మ జీవితమైనా ఎంతటి వైభవంతో అలరారు తున్నా జీవితం క్షణికమే, అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ' చైతన్యదిశగా అడుగులు వేయ మంటుంది. కుటిలచిత్తం లేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయ ధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూ ఢమైనదీ ఆత్మ.*

*ఏకరూపమైన అగ్ని ప్రపంచంలో ప్రవేశించి అది మండించే పదార్థాన్ని పోలిన రూపాన్నే ధరించినట్లు, అన్ని జీవులలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనబడుతుంది. వారిని మించి కూడా విశ్వవ్యాప్తమై అలలారుతుంది. జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మగా, సకల ప్రాణుల జీవాత్మలే పరమాత్మగా అనుసంధానం చేయబడే రహస్య తత్త్వమే శాశ్వతం. వస్తు ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే.*

*''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు|*

*బుద్ధింతు సారధిం విద్ధి మన: ప్రగ్రహమేవచ||''*

*శరీరమనే రథాన్ని నడిపే యజమాని ఆత్మ, బుద్ధే సారధి, మనస్సే కళ్లెం అని గ్రహించి జీవిస్తే ఇంద్రియాలనే గుర్రాలనూ, ఇంద్రియ విషయాలు అవి పరుగుతీసే మార్గాలనూ ఉంచుకొని నిజమైన జీవితానందాన్నీ, మోక్ష పదాన్నీ చేరుకోగలం. శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడిన ఆత్మయే చైతన్యం, శాశ్వతం అంటుంది కఠోపనిషత్తు. జనన మరణాలు లేక, మనుష్యాది రూపాలే శాశ్వతం కాక, జన్మ-వృద్ధి-పరిణతి-అపక్షయ-వ్యాధి-నాశాలనే వికారాలు.*

*పొందక శాశ్వతమై విశ్వంలో అలరారే ఆత్మ అత్యున్నతమైంది. అపూర్వమైంది.*

*మనోనిగ్రహం లేని మనిషి ఆత్మతత్త్వం తెలుసుకోలేక సంసార బంధంలో పదే పదే చిక్కుకుంటున్నాడు.*

*జ్ఞానంతో, మనోనిగ్రహంతో పరిశుద్ధుడైన మనిషి పుట్టుకను తిరిగి పొందక పరమపదాన్ని చేరుకోగలడు. ఇంద్రియాల కంటే శ్రేష్ఠమైనది మనస్సు. మనస్సుకంటే శ్రేష్ఠ తరం బుద్ధి. బుద్ధికంటే శ్రేష్ఠం ఆత్మ. మహత్తు కంటే అవ్యక్తం పరం. అవ్యక్తం కంటే మనిషి శ్రేష్ఠతరం.*

*పురుషుని కంటే పరమాత్మ శ్రేష్ఠతరం, సర్వావ సానం. కనుక ఆత్మచైతన్యమే ఆలంబనగా జీవితాన్ని స్వీకరించి, అనుభవించి పరమ పదంలో లీనం చేయగల మార్గమే మానవ జీవిత పార మార్థిక నిధి తత్త్వం. రహస్యం.*

--(())--

🧘‍♂️అరిషడ్వర్గాలు🧘‍♀️

-[ఎంతస్ధాయిలో ఉన్నవారినైనా దిగజార్చేవి]-

అరిషడ్వర్గాలు అని వేటిని అంటారు, వాటిని ఎలా అదుపులో ఉంచాలి..

అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి.

మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలే. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. కామము –

కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము – 

క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

3. లోభము –

లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము !

4. మోహము -

తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము –

మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము -

తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండడము.

అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి !

--(())--

*🧘‍♂️తపస్సు అంటే ఏమిటి ?🧘‍♀️

🕉️🌞🌍🌙🌟🚩


*తపస్సు అంటే ఏమిటి ? ఒక మంత్రాన్నో..., ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే తపస్సు అనుకుంటే పొరపాటు.*



 *‘తపనే’ తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే..., ఆరాటపడడమే ‘తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే...మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము.... ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది.*



 *ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు....*



*మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.’ నిజమే... ఆలోచించడం వేరు.ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు.చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు అంటారు.*



*అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు.*

 *తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా...ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోకచిలుక’. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది.*

*సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు.*

 *గొంగళిపురుగులు వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంత కాలం గడిచాక తన జీవింతం మీద రోత కలిగి.,ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశానికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది.*

 *అయితే అది గొంగళిపురుగులా రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది.*

 *ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక ఆత్మ సాక్షాత్కారం తో తరిస్తాడు.*

 *🧘‍♂️సృష్టి యెందుకు?🧘‍♀️*

ప్రశ్న: భగవంతుడు ఈ ప్రపంచాన్ని యెందుకు సృష్టించాడు?

జ్ఞానశిశువు : అందరికీ కలిసి ఒక ప్రపంచం లేనే లేదు.

యెవడి ప్రపంచంలో వాడున్నాడు.

యెవడి స్వప్నప్రపంచం వాడిదే అన్నట్టుగా.


నీ కలలో ఇదే విధమైన సంభాషణే జరిగిందనుకో...

ప్రశ్నించేవాడు, సమాధానమిచ్చేవాడు ఇద్దరూ నీవే కదా అవుతావు....


ఎవడి కలకు వాడే కర్త.

ఎవడి జగత్తుకు వాడే కర్త.


స్వప్న జగత్తుకు, జాగ్రత్ జగత్తుకు ఇంచుకైనా భేదం లేదు.


"భగవంతుడు ఎందుకు సృష్టించాడు?" అని ప్రశ్నించేవాడు, ఆ భగవంతునికి అభిన్నం


ఆడించేవాడూ భగవంతుడే.

ఆడేవాడూ భగవంతుడే.


తన మూలం వెళ్లి...

తనలో కలిసిపోయి...

తాను  ఒక్కడే శేషించినప్పుడు...

ఆ తాను భగవంతుడే అని అనుభవమాయ్యాక...

ఆ ఏకాత్మస్థితిలో...

సృష్టితో పాటు ప్రశ్న, ప్రశ్నించేవాడు కూడా మాయమౌతారు...


"ఎందుకు" అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం వాచా ఎప్పటికీ దొరకదు.

మనం(ప్రపంచం) భగవంతునిలో అంతర్భాగమై ఉన్నప్పటికీ...


మనం "అదే" అయినప్పటికీ....మనకు తెలియడం లేదు.


ఒకడు గూబ గుయ్యమనేట్టు చెంపమీద కొట్టాడు...

ఎందుక్కొట్టావు? అని అడిగితే...

నా బలమేమిటో నీకు తెలియడానికి అన్నాట్ట...



ఈ సృష్టి యెందుకు చేశావు? అని భగవంతుణ్ణి అడిగితే,

నేనొకడ్ని ఉన్నానని నీకు తెలియడానికి అన్నాట్ట.



ఇది హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ.



 సృష్టి కారణమేమి? అన్న ప్రశ్నకు ఇంతకు మించి సమాధానం లేదనిపిస్తుంది.



గొంతెత్తి పాట పాడకుంటే అతడు గాయకుడు అని ఎలా తెలుస్తుంది?



వీణ పై స్వరాల్ని మీటకుంటే అతడు వైణికుడు అని తెలుస్తుంది?



రాతిని శిల్పంగా మలచుకుంటే అతడు శిల్పి అని తెలుస్తుంది?



చిదాకాశమనే తెరపై విశ్వసృష్టిని గీయకుంటే అతడు భగవంతుడు అని ఎలా తెలుస్తుంది?  



బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠమహర్షి పుట్టుకతోనే శుద్ధబ్రహ్మజ్ఞాని...అతనికి బంధంగానీ, దుఃఖంగానీ తెలియవు.



నీవు గడియకాలం అజ్ఞానానికి లోనవుదువుగాక

 అని అకారణంగా...ఓ సదుద్దేశంతోనే వశిష్ఠునికి శాపం పెట్టాడు బ్రహ్మ. 



వశిష్ఠుడు అజ్ఞానవశుడై విచారవదనంతో 

తన అకారణ దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించగా అందుకు బ్రహ్మ చేసిన ప్రబోధమే  యోగవాశిష్ఠం అయ్యింది.



 కష్టసుఖాలనేవి ఎలా ఉంటాయో అనుభవంలో ఉన్నప్పుడే 

వాటి నుంటి బయటపడడానికి అనువైన బోధ లోకులకు చేయగలిగే సమర్థత వశిష్ఠునికి వస్తుంది.



అదే బ్రహ్మగారి సదుద్దేశము.



మితం అనేది తెలియకపోతే

అమితం అనేది ఎలా తెలుస్తుంది?



అంతం అనేది తెలియకపోతే 

అనంతం అనేది ఎలా తెలుస్తుంది?



బాధ అనేది తెలియకపోతే 

ఆనందం అనేది ఎలా తెలుస్తుంది?



అజ్ఞానం అనేది తెలియకపోతే 

జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది?



భగవంతుడు చేసిన సృష్టికార్యము కూడా అలాంటిదే.



ఏకంగా ఉన్న తాను ఏకంగా ఉండక

అనేకమైనాడు అది లీల అయ్యింది.



తిరిగి అనేకం నుండి ఏకం వైపుకు ప్రయాణమయ్యాడు. 

అది జీవితం అయ్యింది.



"ఎందుకు?" అని అడిగితే,

లోకవత్ లీలా కైవల్యం అంటుంది బ్రహ్మసూత్రం.

"లీల" అన్నాక ఇంకేం మాట్లాడగలం?

"లీల యెందుకు?" అని అడగలేం.



ఆనందం కోసం ఆడేది క్రీడ.

ఆనందంగా ఉండి చేసేది లీల.



ఎందుకు దుఃఖిస్తున్నావు? అని అడుగుతామే గాని

ఎందుకు ఆనందంగా ఉన్నావు? అని అడగం.



దుఃఖానికి కారణం ఉంటుందేగాని,

ఆనందానికి కారణం ఉండదు.



శిశువు అకారణ ఆనందానికి బాహ్యచేష్టలే కేరింతలు.

శివుని అకారణ ఆనందానికి బాహ్యరూపమే ప్రపంచం.



శివుని ఆనందసాగరంలో తేలియాడే నురగలు 

ఈ ద్వంద్వాలు, త్రిపుటులు.



ప్రశ్న: ఈ సృష్టి ఎలా జరిగింది?


జ్ఞానశిశువు: మలం తొక్కావు...కడుక్కోవాలి అంతే.

ఎలా తొక్కాను? అనే విచారణ అనవసరం.



మాయ ఎలా తొలగించుకోవాలో అనేది సందర్భానుసారంగా ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క  మార్గం చెప్పారు ఋషులు.



మాయ ఎందుకు కలిగింది? అనేదానికి సమాధానం మాత్రం వారు ఇవ్వలేదు.



పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి మిఠాయి ఇచ్చి సముదాయించినట్టే ఈ గురువులు చెప్పిన సమాధానాలన్నీ.

అవన్నీ కంటి తుడుపు సమాధానాలేగాని...అసలు కావు.



 ప్రశ్న: సమాధానం చెప్పడం ఋషులకు కూడా సాధ్యం కాలేదన్న మాట...


జ్ఞానశిశువు: యెందుకంటే "తానే" సమాధానం.

తనకు సమాధానం కాదు కాబట్టి.



ఋషికి సృష్టీ ఉండదు, బంధమూ ఉండదు.



ప్రశ్న: జన్మలకు వాసనలే కారణమంటారు?

తొలి వాసన ఎప్పుడు వచ్చింది?


జ్ఞానశిశువు : "ఎప్పుడు?" అనేది కాలానికి సంబంధించినది.

కాలం అనేది నీ తలపులలో తప్ప...దానికి స్వయం ఉనికి లేదు.



మనం నిద్రనుండి మేలుకోగానే

"నేను" అనే తొలి ఆలోచన కలిగాకే

మిగతా ఆలోచనలు, వ్యవహారాలూ కలుగుతాయి.



అలాగే భగవంతుని "తొలి ఆలోచన" అయిన "నేను" నుండే సర్వసృష్టీ జరిగింది.



అందుకే సృష్టిలోని ప్రతివ్యక్తిలోనూ, వస్తువులోనూ దివ్యత్వం ఉందనడానికి కారణం.



ప్రశ్న: నేను కనే ఈ సృష్టి నాదేనంటారా?


జ్ఞానశిశువు : అక్షరాలా....


ఈ సృష్టి నీ మనో వైచిత్ర్యమే...

ఇది తెలిసి ఓ మహాత్ముడుగా ఈ జగత్తులో చరించు...



ప్రశ్న: ఈ జగత్తు ఇంత సత్యంగా కనిపిస్తుంటే

ఇది కల అని యెందుకు అనుకోవడం?


జ్ఞానశిశువు : నిజమే.  ఆధ్యాత్మికంలో అత్యుత్తమస్థాయికి చేరుకునే వరకు దీనిని కలగా భావించాలి తప్పదు.

ఇదొక మంచి సాధన.



మూలసత్యం వైపుకు నీ దృష్టి మరలే వరకు

నీవనుకునే సత్యాలన్నీ అసత్యాలే అని చెప్పాల్సి ఉంటుంది....



ఆ కోణంలో జగత్తు అసత్యమన్నారేగాని,

నిజానికి సత్యంవైపు నుండి చూస్తే 

జగత్తు కూడా సత్యమే.



చైత్యన్యస్థాయిలో ఈ జగత్తు కూడా చైతన్యపు తునకే.

చైతన్యస్థాయిలో ఈ జీవితం కూడా ఆనందపు సారమే.



నిద్రలో కలిగే మెలకువ - కల.

మెలకువలో కలిగే కల - మెలకువ.



మొదటి కల - జీవునిది.

రెండవ కల - దేవునిది.



అందుకే ముందు నీవు ఈ మెలకువ నుండి మేలుకో.... అంటాను...



నిద్ర నుండి మేలుకుంటే కల చెదిరిపోయినట్టు.

ఈ మెలకువ అనే కల నుండి మేలుకుంటే ఈ సృష్టి చెదరిపోతుంది(కల ఉన్న ప్పటికీ కలకు బాధితుడై ఉండడు అని భావము)



కల కనేవాడు ఒకడే శేషిస్తాడు.

ఇదే ఆధ్యాత్మిక లక్ష్యం.



వచ్చిన కలను విధిలేక కనేవాడు - జీవుడు.

నచ్చిన కలను స్వేచ్ఛగా కనేవాడు - దేవుడు.



ప్రశ్న: భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు?



జ్ఞానశిశువు : సృష్టి కూడా తానే కాబట్టి....

తనకు విడిగా రెండవ వస్తువు లేదు కాబట్టి...

ఎందుకు అన్న ప్రశ్నకు తావులేదు.



బంగారం సదా బంగారంగానే ఉంది.

నీవెందుకు ఆభరణాల్ని సృష్టించావు?

అని బంగారాన్ని నిలదీయగలమా?



అవునా....నేనెప్పుడు ఆభరణమయ్యాను?

నేను నేనుగానే ఉన్నానే! అని అది ఆశ్చర్యపోతుంది.



ఆభరణసృష్టి మనం చేసుకున్న రూపకల్పనే తప్ప

బంగారం సదా బంగారంగానే ఉన్నది.

జగత్సృష్టి కూడా  మనో విక్షేపమే తప్ప

బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది.



ఆభరణం అనేది వ్యావహారిక సత్యం.

బంగారం అనేది పారమార్థిక సత్యం.



ప్రపంచం అనేది వ్యావహారిక సత్యం.

బ్రహ్మం అనేది పారమార్థిక సత్యం.



ఒకటి యెప్పుడూ రెండు కాలేదు.



ఒకటి(ఏకం) అనేది - ఆత్మకు సంబంధించినది.

రెండు(అనేకం) అనేది - మనసుకు సంబంధించినది.



ఒకటి అనేది - ఉన్నది.

రెండు అనేది - ఉన్నట్లున్నది.



ఒకటి అనేది - సత్యము.

రెండు అనేది మిథ్య.



ఒకటి అనేది - దైవము.

రెండు అనేది - ప్రపంచము.



తెల్లకాగితం - దైవం.

అక్షరాలు - ప్రపంచం.



జడమైన ఈ సకల నామరూపాల మరుగున ఆత్మచైతన్యమే ఉండేది.



 ప్రశ్న: ఇదంతా నా మనస్సృష్టే అనేది నమ్మలేకపోతున్నాను...


జ్ఞానశిశువు : జ్ఞానంలో నీవు మేలుకుంటే గాని తెలియదు

ఈ జాగ్రదవస్థ అనేది నీ మనస్సృష్టే అనేది.

అప్పుటి వరకు వాస్తవంగా ఉండి బాధిస్తుంది.



ఆ జ్ఞానమెలకువలో స్వప్నం కూడా జ్ఞానప్రకాశంతో(సంపూర్ణ ఎఱుకతో) ఉంటుంది.



ఇది కల, ఇది మెలకువ, ఇది నిద్ర అనే తేడా చూచేవాళ్లకేగానీ తన అనుభవంలో "జ్ఞానం" తప్ప మరొక అవస్థ ఏదీ ఉండదు.



ఇదే తురీయం.

ఆ తురీయాన్ని  సద్గురు సన్నిధిలో మాత్రమే సాధించగలం.



గుర్వనుగ్రహమే ప్రధానం.

ఇతరత్రా సాధనలన్నీ ద్వితీయం.

అని రమణులు చెప్పి ఉన్నారు.


🕉️🌞🌍🌙🌟🚩

No comments:

Post a Comment